బాలికపై గ్యాంగ్ రే*ప్.. ముగ్గురు టీచర్లు అరెస్టు
ఏమైందీ లోకానికి. మరీ.. ఇంత దారుణమా? అన్నట్లుండే ఉదంతం ఒకటి వెలుగు చూసింది.
By: Tupaki Desk | 27 Nov 2024 6:30 AM GMTఏమైందీ లోకానికి. మరీ.. ఇంత దారుణమా? అన్నట్లుండే ఉదంతం ఒకటి వెలుగు చూసింది. విన్నంతనే ఒళ్లు గగుర్పాటుకు గురి చేసే ఈ ఉదంతంలో తల్లిదండ్రులతో సమానంగా గౌరవించాలని చెప్పే ముగ్గురు గురువులు కామాంధులుగా మారిన వైనం షాకింగ్ గా మారింది. తమ వద్ద చదువుకునే బాలికపై గ్యాంగ్ రేప్ చేసిన వైనం గురించి తెలిస్తే.. నోట మాట రాదంతే. పెను సంచలనంగా మారిన ఈ షాకింగ్ ఉదంతం ఛత్తీస్ గఢ్ లో చోటు చేసుకుంది.
నవంబరు 15 - 22 మధ్య కాలంలో రెండుసార్లు బాధిత బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ముగ్గురు టీచర్లతో పాటు.. మరొకరు. బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుల్ని పోలీసులు అరెస్టు చేశారు. ఛత్తీస్ గఢ్ లోని మహేంద్రగడ్ .. చిర్ మిరి.. భరత్ పుర్ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఉదంతంలోకి వెళితే.. ప్రభుత్వ పాఠశాలలో ప్లస్ వన్ (ఇంటర్ ఫస్ట్ ఇయర్) చదువుతున్న బాలికకు చదువులో సాయం చేస్తానని నమ్మించాడు రవేంద్ర అనే ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు. ఇందులో భాగంగా తన కారులో బాలికను ఎక్కించుకొని ఇంటికి తీసుకెళ్లాడు.
ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం ఇంటి వద్ద మరో ఇద్దరు ఉపాధ్యాయులు అశోక కుమార్ కుష్వాహా.. కుశాల్ సింగ్ తో పాటు.. అటవీ శాఖ ఉద్యోగి బన్వరి సింగ్ ఉన్నారు. వీరంతా బాధిత బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. తాము చేస్తున్న పాశవిక చర్యను తమ మొబైల్ ఫోన్లో రికార్డు చేశారు. తాము చేసిన దారుణం గురించి ఎవరికైనా చెబితే వీడియోను సర్క్యులేట్ చేస్తానని బెదిరించారు. తనపై జరిగిన దురాగతం గురించి ధైర్యంగా ఇంట్లోని తల్లిదండ్రులకు చెప్పటంతో వారు పోలీసుల్ని ఆశ్రయించారు.
నిందితులు నలుగురి మీదా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు వారిని అరెస్టు చేశారు. రిమాండ్ కు తరలించారు. ఈ ఉదంతం కాస్త ఆలస్యంగా బయటకు వచ్చింది. ఇప్పుడా రాష్ట్రంలో ఈ వ్యవహారం పెను సంచలనంగా మారింది. ఈ వ్యవహారంపై విద్యా శాఖ ఉన్నతాధికారులు స్పందించారు. దుర్మార్గంగా వ్యవహరించిన ముగ్గురు స్కూల్ టీచర్లను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే.. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని.. ఇలాంటి తప్పులు చేయాలంటే వణుకు పుట్టేలా ఉండాలన్న డిమాండ్లు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. మరేం జరుగుతుందో చూడాలి.