Begin typing your search above and press return to search.

జీపీఎస్‌ ను నమ్ముకొని నదిలోకెళ్లిన కారు... ఇద్దరు వైద్యులు మృతి!

జీపీఎస్‌ ని నమ్మిపోతు రకరకాల ఇబ్బందులు పడుతున్న వారికి సంబంధించిన ఎన్నో వార్తలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా వస్తోన్న సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   2 Oct 2023 11:07 AM
జీపీఎస్‌ ను నమ్ముకొని నదిలోకెళ్లిన కారు... ఇద్దరు వైద్యులు మృతి!
X

జీపీఎస్‌ ని నమ్మిపోతు రకరకాల ఇబ్బందులు పడుతున్న వారికి సంబంధించిన ఎన్నో వార్తలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా వస్తోన్న సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితం గూగుల్ మ్యాప్ ని నమ్ముకుని లారీ నడుపుకుంటూ వస్తుంటే... అదికాస్తా గో స్ట్రై, గో స్ట్రట్ అంటూ సిద్దిపేట జిల్లాలోని గౌరవెల్లి జలాశయంలోకి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఇదే టైపులో... అలానే వెళ్లిన ఇద్దరు డాక్టర్లు తాజాగా మృతి చెందారు.

అవును... పూర్తిగా టెక్నాలజీని నమ్ముకుని ప్రయాణం సాగిస్తే.. అది ప్రాణాంతకంగా మారుతుందని చెప్పే ఘటన తాజాగా తెరపైకి వచ్చింది. జీపీఎస్ ని నమ్ముకుని డ్రైవ్ చేస్తుంటే అది కాస్తా నదిలోకి తీసుకెళ్లింది! దీంతో ఇద్దరు వైద్యులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన కేరళలోని ఎర్నాకుళం జిల్లాలో జరిగింది.

వివరాళ్లోకి వెళ్తే... కేరళలోని కొల్లాంకు చెందిన డాక్టర్‌ అద్వైత్‌ (28), త్రిశూర్‌ కు చెందిన డాక్టర్‌ అజ్మల్‌ (28) ఓ ప్రైవేటు వైద్యశాలలో పనిచేస్తున్నారు. ఈ క్రమంలో విధులు ముగించుకుని కొడుంగల్లూరు నుంచి శనివారం రాత్రి ఇళ్లకు బయల్దేరారు. వీరితో పాటు మరో ముగ్గరు డాక్టర్లు తబ్సిర్, తమన్నా, నర్స్ జిస్మాన్ కూడా ఉన్నారు. వీరు ఐదుగురూ హోండా సివిక్ కారులో ప్రయాణిస్తున్నారు.

ఈ ఐదుగురిలో డాక్టర్‌ అద్వైత్‌ డ్రైవింగ్‌ సీట్లో కూర్చొన్నాడు. ప్రయాణ సమయంలో భారీ వర్షం పడుతుండటంతో రోడ్డు మార్గం సరిగా కనిపించడంలేదు. దీంతో అద్వైత్‌ జీపీఎస్‌ అనుసరించి డ్రైవింగ్‌ చేస్తున్నాడు. ఈ క్రమంలో జీపీఎస్‌ రీరూటైంది. దానిని అనుసరించిన అతడు వేగంగా ముందుకు పోతున్నాడు. ఈ సమయంలో కారు నీటిలో వెళ్తున్నట్లు తెలుస్తున్నా... మార్గం మధ్యలో నీరు నిలిచి ఉందని భావించినట్లున్నాడు.

ఈ విషయాలను కారులో అతడి పక్కన కూర్చొన్న ఎంబీబీఎస్‌ విద్యార్థిని తమన్నా చెప్పింది. ఇలా రోడ్డుపై నిలిచిన నీరనుకుని వేగంగా పోనిచ్చేసరికి... కారు నేరుగా నీటిలోకి వెళ్లిపోయింది. అది నది అని గుర్తించేలోపే వారి కారు నీటిలో మునిగిపోయింది. ఈ సమయంలో స్థానికులు స్పందించి ముగ్గురిని రక్షించారు. ఈ ఘటన అర్థరాత్రి 12:30 సమయంలో జరిగింది.

ఈ ఘటనలో అద్వైత్‌, అజ్మల్‌ ప్రాణాలు కోల్పోయారు. విషయం తెలుసుకున్న ఫైర్, పోలీస్ అధికారులు ఘటనా స్థలానికి వచ్చారు. మృతదేహాలను వెలికితీసేందుకు స్కూబా డైవర్లను రంగంలోకి దింపారు. ఈ మృతుల్లో అద్వైత్ కి ఈ ఘటన జరిగిన మరుసటి రోజే పుట్టినరోజు కావడం ఈ విషాదాన్ని మరింత పెంచిందనే చెప్పాలి!