ప్రభుత్వాలకు నేడు 'పరీక్షా' ఫలితాలు!
దీనికి ముందు పార్లమెంటు ఎన్నికలు జరిగినా ఆ లెక్కవేరుగా చూస్తున్నారు. దీంతో ఈ ఎన్నికలను రేవంత్ రెడ్డి కూడా కీలకంగా తీసుకున్నారు.
By: Tupaki Desk | 3 March 2025 9:06 AM ISTఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు సోమవారం కీలక సమయం కానుంది. ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫిబ్రవరి 27న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ సోమవారం పూర్తికానుంది. ఆ వెంటనే ఫలితాన్ని వెలువరించనున్నారు. తెలంగాణలో ఒక గ్రాడ్యుయేట్, రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ జరిగింది. అయితే.. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వచ్చిన 15 మాసాల్లో స్థానికంగా జరుగుతున్న తొలి ఎన్నిక ఇదే. దీనికి ముందు పార్లమెంటు ఎన్నికలు జరిగినా ఆ లెక్కవేరుగా చూస్తున్నారు. దీంతో ఈ ఎన్నికలను రేవంత్ రెడ్డి కూడా కీలకంగా తీసుకున్నారు.
ఇక, ఏపీ విషయానికి వస్తే.. రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలతోపాటు.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఒక ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక ల పోలింగ్ జరిగింది. ఇది కూటమి ప్రభుత్వానికి ఒక రకంగా శీల పరీక్షే! ఈ విషయం ఎవరో చెప్పడం లేదు. నేరుగా సీఎం చంద్రబాబే చెబుతున్నారు. చెప్పారు కూడా!. ఏపీలో కూటమి సర్కారు ఏర్పడిన 9 మాసాల్లో వచ్చిన తొలి ఎన్నిక కావడంతో ప్రభుత్వం దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇక, రెండు గ్రాడ్యేయేట్ స్థానాల్లోనూ టీడీపీ నేతలు.. ఆలపాటి రాజేంద్రప్రసాద్, పేరాబత్తుల రాజశేఖర్ పోటీ చేస్తున్నారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ స్థానంలో ఏపీటీఎఫ్(ఆంధప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్) తరఫున పోటీ చేస్తున్న పాకాలపాటి రఘువర్మకు కూటమి మద్దతు తెలిపింది.
అంటే ఒకరకంగా.. ఉత్తరాంధ్ర గెలుపు లేదా ఓటమి కూడా.. కూటమికే చెందనుంది. దీంతో ఏపీ సర్కారు చాలా తీక్షణంగా ఈ ఎన్నికల ఫలితాలను గమనిస్తోంది. మొత్తం ఓట్ల ప్రక్రియ బ్యాలెట్ విధానంలోనే జరిగింది. దీంతో లెక్కింపు ప్రక్రియ సుదీర్ఘంగా సాగుతుందని అధికారులు తెలిపారు. సోమవారం ఉదయం ప్రారంభమయ్యే ఈ ప్రక్రియ రాత్రికిగానీ.. ఫలితాలను వెల్లడించే అవకాశం లేదు. మరోవైపు ఈ ఎన్నికల్లో వైసీపీ దూరంగా ఉన్నప్పటికీ.. ఒక్క గుంటూరు, కృష్ణా ఉమ్మడి జిల్లాల పరిధిలో మాత్రం పీడీఎఫ్ అభ్యర్థి, ప్రస్తుత ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావుకు మద్దతు ఇచ్చింది. దీంతో వైసీపీ దూకుడు ఏమేరకు ఫలిస్తుందన్నదీ ఈ ఫలితంతో తేలిపోనుందని పరిశీలకులు చెబుతున్నారు.
ఇడ్డరు సీఎంలకూ కీలకమే!
ఇక, ఈ ఎన్నికలు చిన్నవే అయినప్పటికీ.. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి నేరుగా రంగంలోకి దిగి ప్రచారం చేయడం గమనార్హం. ఏపీలో సీఎం చంద్రబాబు పదే పదే సమీక్షల పేరుతో కూటమి నాయకులను రంగంలోకి దింపి స్వయంగా అన్నీ పరిశీలించారు. అంతేకాదు.. ప్రచారంలో ఏం చెప్పాలో కూడా ఆయనే వివరించారు. అయితే.. ప్రత్యక్షంగా ఆయన ప్రచారం చేయలేదు.. కానీ.. అన్నీ తానై వ్యవహరించారన్నది మాత్రం వాస్తవం. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు.. ఇద్దరు ముఖ్యమంత్రులకు అత్యంత కీలకం కానుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.