టీడీపీలోకి జెయింట్ కిల్లర్? ఆసక్తికరంగా భీమవరం పాలిటిక్స్
ఏపీ పాలిటిక్స్ లో బిగ్ బ్లాస్టింగ్ న్యూస్ ఇది. 2019 ఎన్నికల్లో జన సేనాని పవన్ కల్యాణ్ ను ఓడించిన సీనియర్ నేత గ్రంథి శ్రీనివాసరావు టీడీపీలో చేరనున్నారని తాజా సమాచారం
By: Tupaki Desk | 23 Jan 2025 1:30 AM GMTఏపీ పాలిటిక్స్ లో బిగ్ బ్లాస్టింగ్ న్యూస్ ఇది. 2019 ఎన్నికల్లో జన సేనాని పవన్ కల్యాణ్ ను ఓడించిన సీనియర్ నేత గ్రంథి శ్రీనివాసరావు టీడీపీలో చేరనున్నారని తాజా సమాచారం. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గ్రంథి 2024 ఎన్నికల్లో అనూహ్యంగా ఓడిపోయారు. అప్పటి నుంచి వైసీపీపై గుర్రుగా ఉన్న గ్రంథి టీడీపీలో చేరేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారట.. ప్రస్తుతం భీమవరంలో టీడీపీకి బలమైన నేత లేకపోవడంతో గ్రంథి చేరికకు టీడీపీ అధిష్ఠానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటున్నారు. అయితే ఈ చేరికపై డిప్యూటీ సీఎం పవన్ తరఫున జనసేన నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు. అందుకే గ్రంథి చేరిక ఆలస్యమవుతోందని అంటున్నారు.
2019 ఎన్నికల్లో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ను ఓడించడంతో గ్రంథి శ్రీనివాసరావు పేరు రాష్ట్ర వ్యాప్తంగా మార్మోగిపోయింది. వ్యక్తిగతంగా ఆయన ఇమేజ్ కూడా పెరిగింది. బడానేతను ఓడించిన తనకు కచ్చితంగా మంత్రి పదవి వస్తుందని ఆశించారు గ్రంథి శ్రీనివాస్. కానీ, వైసీపీ రెండు విడతలుగా మంత్రి వర్గాన్ని విస్తరించినా జెయింట్ కిల్లర్ కు మొండిచేయే చూపింది. అయినప్పటికీ ఐదేళ్ల పాటు తన అసంతృప్తిని అదిమిపెట్టుకున్న గ్రంథి.. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన తర్వాత వైసీపీకి రాం రాం చెప్పేశారు. అప్పటి నుంచి రాజకీయంగా ఆచితూచి అడుగులు వేస్తున్న ఆయన టీడీపీతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రచారం జరిగింది.
అయితే ఎట్టకేలకు మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ప్రయత్నాలు ఫలించినట్లు చెబుతున్నారు. ఆయన చేరికకు టీడీపీ అధిష్ఠానం కూడా ఓకే చెప్పిందని సమాచారం. ప్రస్తుతం భీమవరం నియోజకవర్గంలో టీడీపీకి ఎమ్మెల్యే స్థాయి నేత కొరత ఉందంటున్నారు. ప్రస్తుత జనసేన ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులు ఎన్నికల ముందు వరకు టీడీపీలో ఉండేవారు. భీమవరం నుంచి పోటీ చేయాల్సిన జనసేనాని పవన్ అనూహ్యంగా పిఠాపురం ఎంచుకోవడం, భీమవరం స్థానాన్ని పొత్తులో భాగంగా జనసేన తీసుకోవడంతో పులవర్తి టీడీపీ నుంచి జనసేనకు మారాల్సివచ్చింది. ఈ పరిస్థితుల్లో టీడీపీకి నియోజకవర్గ స్థాయి నాయకుడు కొరత ఉంది. దీంతో వైసీపీ నుంచి టీడీపీలోకి మారేందుకు శ్రీనివాస్ ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. ముందుగా వైసీపీకి రాజీనామా చేసి టీడీపీ అధిష్టానం అనుమతి కోసం ఎదురుచూస్తున్నారు.
అయితే, మాజీ ఎమ్మెల్యే గ్రంథి టీడీపీలో చేరికను స్థానిక క్యాడర్ వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా జనసేన నుంచి తీవ్ర అభ్యంతరం వస్తోందంటున్నారు. మరోవైపు గ్రంథిని పార్టీలోకి తీసుకున్నా, ఆయనకు సీటు గ్యారెంటీ ఉండదని అంటున్నారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మలా ఆయన త్యాగమూర్తిగా ఉండాల్సిందేనని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న జనసేనాని పవన్ భవిష్యత్తులో భీమవరం నియోజకవర్గానికి మారితే గ్రంథి పరిస్థితి ఏంటన్న ప్రశ్న ఉదయిస్తోంది. ఎప్పటికైనా త్యాగానికి సిద్ధమైతేనే పార్టీలోకి తీసుకుంటామని టీడీపీ కండీషన్ పెడుతోందని చెబుతున్నారు. అయితే వైసీపీలో భవిష్యత్ లేదని భావిస్తున్న మాజీ ఎమ్మెల్యే గ్రంథి.. టీడీపీ ఏ షరతు విధించినా రెడీ అంటున్నారట.. మొత్తానికి భీమవరం రాజకీయం ఆసక్తికరంగా మారింది. నేడో రేపో జెయింట్ క్లిల్లర్ సైకిల్ ఎక్కడం ఖాయమని ప్రచారం జరుగుతోంది.