రాజకీయ రంధిలో భీమవరం గ్రంధి
ఆయన భీమవరం రాజకీయ కామందుగా మారి చక్రం గిర్రున తిప్పేశారు.
By: Tupaki Desk | 9 Nov 2024 3:40 AM GMTభీమవరంలో 2019లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని ఓడించి జెయింట్ కిల్లర్ అనిపించుకుని ఒక వెలుగు వెలిగారు గ్రంధి శ్రీనివాస్. ఆ ఊపులో ఆయనకు మంత్రి పదవి ఇస్తారని కూడా అంతా తలచారు. కానీ ఎందుకో ఆయనకు ఆ చాన్స్ అయితే దక్కలేదు. అయితే అయిదేళ్ల పాటు ఆయన హవా బ్రహ్మాండంగా సాగింది. ఆయన భీమవరం రాజకీయ కామందుగా మారి చక్రం గిర్రున తిప్పేశారు.
ఇక 2024లో ఆయనకే టికెట్ ని వైసీపీ అధినాయకత్వం ఇచ్చింది. తన మీద పోటీకి సిద్ధం కకనే పవన్ కళ్యాణ్ పిఠాపురం వెళ్లారని అప్పట్లో గ్రంధి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారన్న ప్రచారం ఉంది. మొత్తనికి గ్రంధి రియల్ హీరో అని ప్రచారం చేశారు. కానీ 2019లో వర్కౌట్ అయినట్లుగా 2024లో కాలేదు. ఫలితంగా గ్రంధి శ్రీనివాస్ భారీ ఓటమిని మూటగట్టుకున్నారు.
ఆయన మీద టీడీపీ నుంచి జనసేనలోకి వెళ్ళిన పులపర్తి ఆంజనేయులు భారీ మెజారిటీతో గెలిచారు. దాంతో గ్రంధి శ్రీనివాస్ ఆలోచనలో పడ్డారని టాక్ నడచింది. ఆయన వైసీపీ యాక్టివిటీస్ కి దూరం పాటిస్తూ వచ్చారు ని కూడా ప్రచారం సాగింది. ఇక పులపర్తి ఆంజనేయులు జనసేనలోకి వెళ్లాక టీడీపీలో సరైన లీడర్లు లేరని తాను ఆ ప్లేస్ లోకి వెళ్లవచ్చు అని గ్రంధి భావించారు అని కూడా ఊహాగానాలు చెలరేగాయి. అదే విధంగా జాతీయ పార్టీ అయిన బీజేపీలో కూడా ఆయన చేరవచ్చు అని మరో రకమైన ప్రచారమూ సాగింది.
ఈ క్రమంలోనే గ్రంధి పార్టీ మారుతారు అని వార్తలు వెల్లువలా వచ్చినా ఆయన అనుచరుల వైపు నుంచి ఖండనలు అయితే లేవు. ఇక జగన్ సమీక్షా సమావేశాలకు సైతం ఆయన హాజరైంది కూడా లేదని గుర్తు చేసిన వారూ ఉన్నారు. అన్నీ అయిపోయాయి ఇక ముహూర్తమే తరువాయి అన్న నేపథ్యంలో ఉరమని పిడుగులా గ్రంధి ఇంటి మీద ఆఫీసుల మీద ఐటీ దాడులు సాగడంతో ఒక్కసారిగా సీన్ మారింది అని అంటున్నారు.
ఏకంగా మూడు రోజుల పాటు ఈ ఐటీ దాడులు సాగడంతో గ్రంధి శ్రీనివాస్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని అంటున్నారు. ఆయనకు ఈ విధంగా కూటమిలోనికి ఎంట్రీ లేకుండా చేసిన దాడులుగా కూడా అంతా అనుకుంటున్నారు.
దీంతో గ్రంధి రాజకీయ రంధిలో పడ్డారని అంటున్నారు. తన వ్యాపారాల మీద దాడులు జరగకుండా చూసుకునేందుకే ఆయన పార్టీ మారుతారు అని ప్రచారం సాగింది అంటున్నారు. కానీ ఇపుడు అదే జరుగుతున్న వేళ పార్టీ మారి ఉపయోగం ఏంటని గ్రంధి శిబిరంలో ఆలోచనలు సాగుతున్నాయని అంటున్నారు.
అంటే ఆయన వైసీపీని వీడకుండా అందులోనే కొనసాగాలని నిర్ణయించుకున్నారని కొత్త వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాదు ఆయన తొందరలోనే వైసీపీ అధినేత జగన్ ని కలసేందుకు అపాయింట్మెంట్ కోరారని కూడా ప్రచారం సాగుతోంది.
ఈ మొత్తం పరిణామాలు ఐటీ దాడుల నేపథ్యంలో ఆయన వైసీపీలోనే ఉంటూ యాక్టివ్ కావాలని డిసైడ్ అయ్యారని అంటున్నారు. అయితే గ్రంధి ప్లాన్స్ అన్నీ వైసీపీ హై కమాండ్ కి బాగా ఎరుక అని అంటున్నారు. రాజకీయంగా అనివార్యత వల్లనే ఆయన ఫ్యాన్ నీడన ఉంటున్నారని తెలిసిన నేపథ్యంలో అధినాయకత్వం ఆయనకు అపాయింట్మెంట్ ఇస్తుందా తిరిగి రియల్ హీరో అంటూ జనంలోకి వెళ్లేలా ప్రోత్సహిస్తుందా అన్నదే చర్చగా ఉంది. మొత్తానికి గ్రంధి పాలిటిక్స్ మాత్రం ఇపుడు ఆసక్తికరమైన చర్చగా మారింది.