నాగబాబు వర్సెస్ గ్రంథి శ్రీను... ట్వీట్ వార్ వైరల్!
అవును... సోషల్ మీడియా వేదికగా అప్పుడప్పుడూ కొన్ని పోస్టులు పెడుతూ హల్ చల్ చేస్తుంటారు జనసేన నేత నాగబాబు
By: Tupaki Desk | 2 April 2024 12:04 PM GMTఎన్నికలు సమీపిస్తున్న వేళ విమర్శలు, ప్రతి విమర్శలతో వాతావరణం వేడెక్కిపోతోంది. ఈ విషయంలో ఆ పార్టీ ఈ పార్టీ అనే తారతమ్యాలేమీ లేవు.. ఎవరి స్థాయిలో వారు వాతావరణం వేడెక్కడానికి తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా జనసేన కీలక నేత కొణిదెల నాగబాబు ఆన్ లైన్ వేదికగా జగన్ పై విమర్శలు గుప్పించారు. దీంతో... భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీను కౌంటర్ ఇచ్చారు.
అవును... సోషల్ మీడియా వేదికగా అప్పుడప్పుడూ కొన్ని పోస్టులు పెడుతూ హల్ చల్ చేస్తుంటారు జనసేన నేత నాగబాబు. 2014 ఎన్నికల్లో నరసాపురం లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఆయన.. ఈ దఫా టిక్కెట్ దక్కకపోవడంతో ప్రస్తుతం పార్టీ సోషల్ మీడియా ప్రచారాలను పరిశీలిస్తున్నారని అంటున్నారు!! ఈ క్రమంలో తాజాగా కొన్ని నియోజకవర్గాల్లో సామాన్యులకు అసెంబ్లీ టిక్కెట్లు ఇచ్చారు జగన్.
ఈ క్రమంలో "మేమంతా సిద్ధం" సభల్లో వారిని పరిచయం చేస్తూ... వారి వారి మంచి తనాన్ని, గొప్పతనాన్ని చెబుతూ... వాళ్లవద్ద డబ్బులు అంతంతమాత్రమే అని నొక్కి చెప్పారు. అంటే... సామాన్యులకు టిక్కెట్లు ఇచ్చాను అని చెప్పే ప్రయత్నం అయ్యి ఉండొచ్చు! దీంతో... ఈ వీడియో బైట్స్ ని పోస్ట్ చేసిన నాగబాబు జగన్ పై విమర్శలు గుప్పించారు.
ఇందులో భాగంగా... "మన మాజీ ముఖ్యమంత్రి గారి పుత్రరత్నం.. ప్రస్తుత మాజీ ముఖ్యమంత్రి, సేనాని పేరుని సైతం పలకడానికి జడిసే సౌమ్యుడు గారు అధికారంలో అభివృద్ధి అంతంత మాత్రమే.. కాదు కాదు.. అంతా సూన్యమే.." అని పోస్ట్ చేశారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే... నాగబాబు చేసిన ట్వీట్ లో "ప్రస్తుత మాజీ ముఖ్యమంత్రి" అంటే... చంద్రబాబు కదా అని కౌంటర్ వేస్తున్నారు నెటిజన్లు!
ఆ సంగతి అలా ఉంటే... ఈ ట్వీట్ కి కాస్త ఘాటుగానే రిప్లై ఇచ్చారు భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీను! ఇందులో భాగంగా... "సామాన్యులను చట్టసభలకు పంపే సామర్థ్యం ఉన్న వ్యక్తి మా జగనన్న. మరి మీ పార్టీ పరిస్థితి ఏంటి నాగబాబు? పొత్తు లేనిదే కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేని పరిస్థితి నీ తమ్ముడు పవన్ కల్యాణ్ ది. ఇక నువ్వైతే ఏకంగా అనకాపల్లి నుంచే పారిపోయావు. గట్టిగా పోటీ చేసే దమ్ములేని నీకు ఏమి తెలుసని అభివృద్ధి గురించి మాట్లాడుతున్నావు?" అని రియాక్ట్ అయ్యారు. దీంతో... ప్రస్తుతం ఈ కామెంట్ల కింద చిన్న సైజు యుద్ధమే జరుగుతుంది.