వెండి కంచాల్లో భోజనం.. స్పూన్లు బంగారం.. జీ20లో అతిధులకు ఘన ఏర్పాట్లు
ప్రపంచంలో కీలకంగా వ్యవహరించే 20 దేశాల కూటమిగా పేర్కొనే జీ20 సమ్మిట్ కు దేశ రాజధాని ఢిల్లీ వేదిక కానున్న విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 7 Sep 2023 4:46 AM GMTప్రపంచంలో కీలకంగా వ్యవహరించే 20 దేశాల కూటమిగా పేర్కొనే జీ20 సమ్మిట్ కు దేశ రాజధాని ఢిల్లీ వేదిక కానున్న విషయం తెలిసిందే. ఈ హైప్రొఫైల్ సదస్సుకు సంబంధించిన కోలాహలం ఇప్పుడు నెలకొంది. మరో రెండు రోజుల్లో మొదలయ్యే ఈ మూడు రోజుల సమ్మిట్ కు సంబంధించి ఇప్పటికే హడావుడి ఢిల్లీలో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. ఈ నెల 8, 9, 10 తేదీల్లో జీ20 సమ్మిట్ ను నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్ ను కవర్ చేయటానికి ప్రపంచ వ్యాప్తంగా మూడు వేల మంది జర్నలిస్టులు ఢిల్లీకి వస్తున్నారు. ఈ సమ్మిట్ నేపథ్యంలో ఢిల్లీలోని ప్రఖ్యాత కట్టడాలన్నింటిని మువ్వన్నెల వెలుగులతో అందంగా అలంకరించారు.
జీ 20 కూటమిలోని దేశాలు చూస్తే.. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రభావం చూపే దేశాల కూటమి అన్న విషయం ఇట్టే అర్థమవుతుంది. ఈ కూటమిలోని దేశాల్ని చూస్తే.. భారత్ తో పాటు అగ్రరాజ్యమైన అమెరికా.. ఆర్థికంగా మహా బలోపేతమైన పేచీల డ్రాగన్ దేశమైన చైనాతోపాటు..
అర్జెంటీనా
ఆస్ట్రేలియా
బ్రెజిల్
కెనడా
ఫ్రాన్స్
జర్మనీ
ఇండోనేషియా
ఇటలీ
జపాన్
రిపబ్లిక్ ఆఫ్ కొరియా
మెక్సికో
రష్యా
సౌదీ అరేబియా
దక్షిణాఫ్రికా
టర్కీ
బ్రిటన్
మరికొన్ని యూరోపియన్ దేశాలు ఈ కూటమిలో ఉన్నాయి. ఈ సమ్మిట్ కు 20 దేశాలకు చెందిన దేశాధినేతలు.. ప్రధానులు హాజరుకానున్నారు. దీంతో.. భారీ ఎత్తున సందడి వాతావరణం నెలకొంది. ఈ ప్రతిష్ఠాత్మక సదస్సులో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వస్తున్నారు. ఆయన సతీమణి ఆరోగ్యం సరిగా లేనప్పటికీ.. ఆయన భారత్ కు వస్తున్నారు. మూడు రోజుల పాటు ఆయన భారత్ లో పర్యటించనున్నారు. ఆయన వెంట అమెరికా విదేశాంగ.. రక్షణ.. వాణిజ్య.. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు ఉండనున్నారు.
జీ 20 సదస్సుకు ఎలాంటి ఆటంకాలు ఎదురుకాకుండా ఉండేందుకు వీలుగా ఢిల్లీ ప్రభుత్వం మూడు రోజుల పాటు స్కూళ్లు.. కాలేజీలకు సెలవుల్ని ప్రకటించారు. అంతేకాదు.. సదస్సు జరిగే మార్గాల్లో వాహనాల్ని మళ్లిస్తూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. సమ్మిట్ కు హాజరయ్యే ప్రముఖులకు ఏర్పాటుచేసిన విందులో వెండి పళ్లాలు.. బంగారు స్పన్లు వాడేలా జాగ్రత్తలు తీసుకున్నారు. దేశీయ.. విదేశీ వంటలతో సమ్మిట్ ఘుమఘుమలాడిపోనుంది. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 200 మంది కళాకారులు తయారు చేసిన వెండి కంచాలు.. బంగారు పాత్రలు.. బంగారు స్పూన్లను సిద్ధం చేశారు. మొత్తం 15వేల వెండి వస్తువులను ఈ సమ్మిట్ లో నిర్వహించే విందులో వినియోగించనున్నారు. ఈ మొత్తాన్ని తయారు చేయటానికి 50వేల పని గంటలుపట్టిందని చెబుతున్నారు. ఇదంతా చూస్తే.. ఈ సదస్సును ఒక రేంజ్లో నిర్వహించేలా మోడీ సర్కారు ప్లాన్ చేసినట్లుగా అర్థమవుతుంది.