గ్రేటర్ వైజాగ్: 'పెందుర్తి- ఆనందపురం- కొత్తవలస' బెల్ట్ రియల్ జోరు?
ప్రశాంతనగరం విశాఖలో నివశించాలనే ఆశ చాలామంది టాలీవుడ్ హీరోలకు ఉంది. కానీ వృత్తిపరమైన కట్టుబాట్లు, స్థిరాస్తులు వ్యాపారాల కారణంగా వీళ్లంతా ఇంకా హైదరాబాద్‌లో ఉన్నారు.
By: Tupaki Desk | 8 Sep 2024 9:30 PM GMTవిశాఖ పట్నం అంటే అందమైన బీచ్‌లు మాత్రమే కాదు.. ఆహ్లాదకరమైన వాతావరణం.. అందమైన రోడ్లు, ఎటు చూసినా పార్కులు.. రిసార్టులు.. కూతవేటు దూరంలో ఆంధ్రా ఊటీ అవైలబిలిటీ... అందుకే ఈ నగరం అంటే అందరికీ మోజు! ముఖ్యంగా సెలబ్రిటీలకు. మెగాస్టార్ చిరంజీవి సైతం తన బ్యాలెన్స్ విరమణ జీవితాన్ని విశాఖ నగరంలో గడిపేస్తానని అన్నారు. ప్రశాంతనగరం విశాఖలో నివశించాలనే ఆశ చాలామంది టాలీవుడ్ హీరోలకు ఉంది. కానీ వృత్తిపరమైన కట్టుబాట్లు, స్థిరాస్తులు వ్యాపారాల కారణంగా వీళ్లంతా ఇంకా హైదరాబాద్‌లో ఉన్నారు.
అయితే ఇటీవల విశాఖ నగరం ఎదుగుదల అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తేదేపా ప్రభుత్వంలోను మరోసారి నగర విస్తరణను వేగవంతం చేసేందుకు జీవీఎంసీ (గ్రేటర్ విశాఖ నగరపాలక సంస్థ)కి ప్రతిపాదనలు వచ్చాయి. ప్రభుత్వం నుంచి సూచనలు అందగా కలెక్టర్, జీవీఎంసి కమీషనర్, వీఎంఆర్‌డిఏ సహా పలువురు అధికారులు ఈ పనిలో నిమగ్నమై ఉన్నారని తెలుస్తోంది. అందమైన ఓడరేవు నగరాన్ని మెట్రోపాలిటన్ నగరంగా మార్చే లక్ష్యంతో గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జివిఎంసి) పరిధిని విస్తరించడానికి పద్మనాభం, ఆనందపురం, భీమిలి పంచాయతీలను విలీనం చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చితే విశాఖపట్నం జిల్లా మొత్తం పెద్ద నగరంగా రూపుదిద్దుకోవడంతోపాటు మరో రెండు లక్షలకుపైగా జనాభా పెరుగుతుందని భీమిలి ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కార్యాలయంలో మూడు మండలాల ముఖ్య నేతలతో జరిగిన సమావేశంలో సూచించారు.
ఈ విలీనం వల్ల గ్రామీణ, పాక్షిక పట్టణ ప్రాంతాలకు అనేక అవకాశాలు లభిస్తాయని ఎమ్మెల్యే గంటా వారికి తెలియజేశారు. విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (MCV) గాజువాక .. మరో 32 గ్రామాల విలీనంతో గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (GVMC)గా మారిందని గుర్తుచేశారు. 2007లో పరిధీయ ప్రాంతాలు, వార్డుల సంఖ్యను 50 నుంచి 72కు పెంచారు. 2017లో భీమిలి మున్సిపాలిటీ, దాని చుట్టుపక్కల ఉన్న ఐదు పంచాయతీలు, అనకాపల్లి మున్సిపాలిటీని జివిఎంసిలో విలీనం చేసి, నగర విస్తీర్ణాన్ని పెంచి, వార్డుల సంఖ్యను 72 నుండి 98కి గతంలోనే పెంచారు.
ప్రస్తుత ప్రతిపాదనతో భీమిలి మండలం నుంచి 26 పంచాయతీలు, ఆనందపురం మండలం నుంచి 22 పంచాయతీలు, పద్మనాభం మండలంలో 16 పంచాయతీలు జీవీఎంసీలో విలీనం కానున్నాయి. ఆసక్తికరంగా, ఈ పంచాయతీలన్నీ భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ (అంతర్జాతీయ) విమానాశ్రయానికి సమీపంలో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే భోగాపురం విమానాశ్రయం వరకు మెట్రో రైలు ప్రాజెక్టును నిర్మించాలని ప్రణాళిక వేసింది. మెట్రో రైలు గాజువాక నుండి భోగాపురం వరకు, పాత పోస్టాఫీసు నుండి భోగాపురం వరకు .. ఇతర ప్రాంతాల ప్రజలను కలుపుతుంది.
భూమి విలువ, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి తాజా ప్రతిపాదనతో మరింత మెరుగవుతుందని భావిస్తున్నారు. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ గత దశాబ్ద కాలంగా నగరం భోగాపురం వైపు శరవేగంగా అభివృద్ధి చెందుతోందని, జివిఎంసిలో విలీనమయ్యే గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వం పన్నులు పెంచదని, భవిష్యత్తులో అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ప్రతిపాదనను ప్రజల్లోకి తీసుకెళుతున్నట్టు తెలిపారు.
విశాఖ-భోగాపురం మధ్యలో 'కొత్తవలస-ఆనందపురం' దశ మారనుందా?
అందమైన విశాఖ నగరం విస్తరణ ప్రణాళికలు కొత్తవలస ప్రాంతానికి కొత్త కళ తేనుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే జీవీఎంసీ పరిధిలో స్థలాలు కానీ, ఇండ్లను కానీ కొనడం చాలా ఖరీదైన వ్యవహారంగా మారింది. ఒకరకంగా చూస్తే హైదరాబాద్ కంటే విశాఖలో ఇండ్ల ధరలు చాలా అధికం. దీంతో నగరంలో సొంత ఇంటి కలను నెరవేర్చుకోలేని వారు ఔటర్ కి వెళ్లేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు. ఈ కారణంతో ఇప్పుడు విశాఖ ఔటర్ నుంచి భోగాపురం మధ్యలో ఉన్న ఆనందపురం మండలం, పద్మనాభం మండలం, పెందుర్తి మండలం లోని భూములకు విపరీతమైన గిరాకీ పెరిగింది. అలాగే పెందుర్తి, ఆనందపురం జంక్షన్లకు అతి సమీపంలో ఉండే కొత్త వలసకు కూడా ఇమేజ్ అమాంతం పెరిగిందని రియల్ ఎస్టేట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే ఈ ఏరియాలోనే భారీగా రియల్ వ్యాపరం వేగంగా పెరుగుతోంది.
మధ్యతరగతి ప్రజలు, పేదలకు కూడా ''ఆనందపురం- పెందుర్తి- కొత్త వలస'' బెల్ట్ లో సులువుగా సొంత ఇల్లు కొనుక్కునేందుకు అవకాశం ఉంటుంది. ఇక్కడ ధరలు ఇంకా చుక్కల్ని తాకలేదు. ప్రస్తుత జీవీఎంసీ ప్రతిపాదనలు చూస్తుంటే మునుముందు ఔటర్ లో కూడా ధరలు అమాంతం పెరిగినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఓవైపు మెట్రో లైన్ పనులపైనా సీరియస్ గా పని జరుగుతుండడంతో ఇక ధరల గ్రాఫ్ ని తగ్గించడం సులువు కాదని అంచనా వేస్తున్నారు. ఇక భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శరవేగంగా పూర్తవుతుండడం, మరో రెండేళ్లలోనే దీనిని లాంచ్ చేస్తామని నాయకులు ప్రకటించడంతో కూడా భూముల ధరల పెరుగుదలకు తెర లేపిందని చెబుతున్నారు.
హైదరాబాద్ కి ఉప్పల్- మేడ్చల్ ప్రాంతం ఎలానో 'ఆనందపురం- పెందుర్తి- కొత్త వలస' ట్రయాంగిల్ అలాంటిది అని కూడా అంచనా వేస్తున్నారు. కొత్తవలస-ఆనందపురం సమీపంలో రెల్లి గ్రామం పరిసరాల్లో 200 ఎకరాల్లో గిరిజన యూనివర్శిటీ ప్రతిపాదన తెలుగు దేశం ప్రభుత్వానికి ఉండటం కూడా ఇటీవల చర్చనీయాంశమైంది. దీనిపై ఇటీవల తర్జనభర్జన సాగుతోంది. కారణం ఏదైనా కానీ మునుముందు పెట్టుబడుల వృద్ధికి ఆస్కారం కల్పించే కీలకమైన ప్రాంతంగా దీనిని స్థిరాస్తి నిపుణులు అభివర్ణిస్తున్నారు. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో కొన్ని కాలనీలూ వెలుస్తున్నాయి. వేపగుంట- పెందుర్తితో పోలిస్తే నివాసాల ధరలు కొత్త వలసలో అందుబాటులో ఉంటున్నాయి. వైజాగ్ కి 30 కి.మీ. లోపు దూరంలోపు ఉండటంతో పాటు మధ్యతరగతి ప్రజలకు ఇక్కడ అనుకూలత కనిపిస్తోంది. ఆనందపురం -భీమిలి రెజియన్ లో 30-40లక్షల మధ్య డబుల్ బెడ్ రూమ్ లభిస్తుంటే, కొత్తవలసలో 20లక్షల రేంజులోను డబుల్ బెడ్ రూమ్ లభిస్తోంది. దీంతో ఈ పరిసరాలను మధ్యతరగతి ప్రజలు ఎంచుకుంటున్నారని రియల్ నిపుణులు చెబుతున్నారు. కేవలం 40 ని.ల ప్రయాణ దూరం(28కి.మీల లోపు)లోనే విశాఖ నగరం ఉండటం, ఫార్మా, సెజ్ లు అందుబాటులో ఉండటంతో కొత్త వలస - పెందుర్తి- ఆనందపురం ఏరియా పై అందరి చూపు మరలిందని చెబుతున్నారు. గ్రేటర్ విశాఖ పరిధిని విస్తరించే ప్రతిపాదనతో ఈ ప్రాంతాల్లో ఇప్పటికే రియల్ కథలికలు పెరిగాయని గుసగుస వినిపిస్తోంది. వైజాగ్- భోగాపురం మధ్యలో 'పెందుర్తి-ఆనందపురం-కొత్త వలస' హబ్ మునుముందు ప్రధాన ఆకర్షణగా మారనుంది.