"ఐపీఎల్ - 2025 విజేత ఎవరు?"... ఏఐ సమాధానం ఇదిగో!
ఈ సమయంలో "ఐపీఎల్ 2025 విజేత ఎవరు?" అనే ప్రశ్నకు ఏఐ చాట్ బాట్ ఆసక్తికర సమాధానం ఇచ్చింది.
By: Tupaki Desk | 21 March 2025 9:46 AM ISTఇటీవల కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) బాగా అభివృద్ధి చెందుతోన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా.. ఏఐ చాట్ బాట్ సేవలు ఇప్పుడు నెట్టింట ఆసక్తిగా మారుతుతున్నాయి. యూజర్ ఏ ప్రశ్న అడిగినా.. అర్ధవంతమైన, ఆసక్తికరమైన సమాధానాలు వస్తున్నాయని అంటున్నారు. ఈ సమయంలో "ఐపీఎల్ 2025 విజేత ఎవరు?" అనే ప్రశ్నకు ఏఐ చాట్ బాట్ ఆసక్తికర సమాధానం ఇచ్చింది.
అవును... ఎలాన్ మస్క్ ఏఐ స్టార్టప్ సంస్థ ఎక్స్ ఏఐ గ్రోక్.. చాట్ బాట్ సేవల్ని అందిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో యూజర్లు అడిగిన ప్రశ్నలకు గ్రోక్ ఆసక్తికర సమాధానాలు ఇస్తోంది. పైగా అవి స్థానిక భాషల్లో కూడా ఉండటంతో నెటిజన్లు హ్యాపీ కం సర్ ప్రైజ్ ఫీలవుతున్నారని అంటున్నారు. ఈ సమయంలో ఐపీఎల్ - 2025 విజేతపై గ్రోక్ ఆసక్తికర సమాధానం ఇచ్చింది.
తాజాగా ఓ యూజర్.. "ఐపీఎల్ 2025 విజేత ఎవరు?" అని అడగ్గా.. గ్రోక్ నుంచి సమాధానం వచ్చింది. ఈ సందర్భంగా... ఐపీఎల్ 2025 టైటిల్ ను గెలుచుకునే అవకాశాలు ముంబై ఇండియన్స్ కు ఈసారి ఎక్కువగా ఉన్నాయని గ్రోక్ బదులిచ్చింది. అంతే కాదు.. దీనికి గల వివరణ, తనదైన విశ్లేషణ కూడా ఇవ్వడం గమనార్హం.
ఇందులో భాగంగా... "ఐపీఎల్ 2025 సీజన్ ఇంకా ప్రారంభం కాలేదు.. మార్చి 22న కేకేఆర్, ఆర్సీబీ జట్ల మధ్య సీజన్ ఫస్ట్ మ్యాచ్ జరనుంది. ఇలా టోర్నీ ఆరంభం ముందే విన్నర్ ఎవరో చెప్పడం అసాధ్యం.. కాకపోతే జట్టు కూర్పు, ఆటగాళ్ల ఫామ్, మొదలైన అంశాలపైనే ఫలితం ఆధారపడి ఉంటుంది".
"అయితే.. గత చరిత్రతో పాటు, ప్రస్తుత ఫామ్ ఆధారంగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ వంటి జట్లకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.. అందులోనూ ముంబై కాస్త ముందు వరుసలో ఉంది" అని గ్రోక్ పేర్కొంది.
అక్కడితో ఆగని గ్రోక్ మరింత వివరణ ఇచ్చింది. ఇందులో భాగంగా... ముంబై ఇండియన్స్ జట్టు.. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ, ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, ట్రెంట్ బౌల్ట్, స్పీడ్ స్టర్ జస్ప్రీత్ బూమ్రా, టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వంటి ప్లేయర్స్ తో పటిష్టంగా ఉందని తెలిపింది.
అదేవిధంగా... మహేంద్రసింగ్ ధోని, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా వంటి వారితో చెన్నై సూపర్ కింగ్స్ కూడా బలంగా ఉందని చెప్పుకొచ్చింది. అదేవిధంగా... 2024లో మూడోసారి టైటిల్ గెలుచుకున్న కోల్ కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) కూడా పోటీల్లో ఉందని.. రిషబ్ పంత్ ను సొంతం చేసుకున్న లక్నో సూపర్ జెయింట్స్, శ్రేయస్ అయ్యర్ కొనుగోలుతో పంజాబ్ కింగ్స్ కూడా టైటిల్ పోటీదారులుగా కనిపిస్తున్నాయని చెప్పింది.