Begin typing your search above and press return to search.

రాత్రి వేళ రేవంత్ సర్కారుకు మరోసారి షాకిచ్చిన గ్రూప్ 1 అభ్యర్థులు

గ్రూప్ 1 ఎగ్జామ్ ను వాయిదా వేయాలన్నడిమాండ్ ను వినిపించారు.

By:  Tupaki Desk   |   17 Oct 2024 5:05 AM GMT
రాత్రి వేళ రేవంత్ సర్కారుకు మరోసారి షాకిచ్చిన గ్రూప్ 1 అభ్యర్థులు
X

ఓవైపు పోటీ పరీక్షల్ని నిర్వహించకుండా అంతకంతకూ ఆలస్యం చేస్తున్నారన్న ఆరోపణ బలంగా వినిపిస్తున్న వేళ.. అందుకు భిన్నంగా పోటీ పరీక్షల నిర్వాహణకు కోర్టు అభ్యంతరాల్ని సైతం అధిగమించి.. పరీక్షల్ని నిర్వహించేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వానికి అనూహ్య అనుభవం ఎదురైంది. బుధవారం రాత్రి వేళ.. హైదరాబాద్ లోని అశోక్ నగర్ లో గ్రూప్ 1 పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు రోడ్ల మీదకు వచ్చారు. గ్రూప్ 1 ఎగ్జామ్ ను వాయిదా వేయాలన్నడిమాండ్ ను వినిపించారు.

బుధవారం రాత్రి 8 గంటల తర్వాత అశోక్ నగర్ రోడ్ల మీదకు భారీ సంఖ్యలో గ్రూప్ 1 మొయిన్స్ అభ్యర్థులు రోడ్ల మీదకు వచ్చారు. ప్రభుత్వం తక్షణమే గ్రూప్ 1 ఎగ్జామ్ ను వాయిదా వేయాల్సిందిగా మారు డిమాండ్ చేస్తున్నారు. అక్టోబరు 21 నుంచి వారంపాటు టీజీపీఎస్సీ గ్రూప్1 మొయిన్స్ పరీక్షను వాయిదా వేయాలన్నది వారి తాజా డిమాండ్. ఇంతకూ తమ నిరసనకు వారు చూపుతున్న కారణాల్ని చూస్తే.. ఇలా అయితే పరీక్షల నిర్వహణ ఎలా పూర్తి అవుతుందన్నది ప్రశ్నగా మారుతుంది.

గతంలో రెరండుసార్లు గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ ను రద్దు చేశారు. మూడోసారి కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రిలిమ్స్ ఎగ్జామ్ నిర్వహించి.. ఫలితాల్ని వెల్లడించారు. మొయిన్స్ కు 1:50 నిష్పత్తిలో అభ్యర్థుల్ని ఎంపిక చేశారు. అయితే.. ప్రిలిమ్స్ పరీక్షలో తప్పులు జరిగాయని.. తప్పుగా ఇచ్చిన ప్రశ్నల్లో న్యాయం చేయాలన్నది అభ్యర్థుల డిమాండ్. మరోవైపు రిజర్వేషన్లకు సంబంధించిన జీవో 29ను సవరించిన తర్వాతే గ్రూప్ 1 మొయిన్స్ సహా ఇతర గ్రూప్స్ పరీక్షల్ని నిర్వహించాలన్న డిమాండ్లను వినిపిస్తున్నారు.

అనూహ్యంగా రాత్రి వేళ రోడ్ల మీదకు వచ్చి నిరసన చేస్తున్న గ్రూప్ 1 అభ్యర్థుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎక్స్ లో తన సందేశాన్ని పోస్టు చేశారు. అక్రమంగా అరెస్టు చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేసిన కేటీఆర్.. తెలంగాణ గ్రూప్స్ అభ్యర్థులు కోరుతున్న మేరకు వెంటనే పరీక్షల్ని రీషెడ్యూల్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. శాంతియుతంగా రోడ్ల మీదకు వచ్చి నిరసన తెలుపుతుంటే.. వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించటాన్ని తప్పు పట్టారు.

ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కారు.. ఉన్నత విద్యావంతులైన యువతీయువకుల నిరసన తెలియజేసే హక్కును హరించేస్తున్నట్లుగా తప్పుపట్టారు. ఒక కేసులో వచ్చిన తీర్పును అడ్డుగా పెట్టుకొని ఈ నెల 21 నుంచి గ్రూప్స్ మొయిన్స్ నిర్వహించేందుకు ప్రయత్నం చేయటం దారుణమన్న కేటీఆర్.. స్వయంగా విద్యార్థులే గ్రూప్స్ పరీక్షలను రీషెడ్యూల్ చేయాలని కోరుతుంటే.. ఇక రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ఇబ్బంది ఏమిటంటూ ప్రశ్నించారు. ఏమైనా.. గ్రూప్ 1 అభ్యర్థుల నిరసన రేవంత్ సర్కారుకు ఇబ్బంది పెట్టేదని చెప్పక తప్పదు.