గ్రూప్-2 అభ్యర్థిని ఆత్మహత్య... సూసైడ్ నోట్ లో ఉన్నదిదే?
అవును... చిక్కడపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో అశోక్ నగర్ లో ఒక యువతి ఆత్మహత్య చేసుకుంది. దీంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది.
By: Tupaki Desk | 14 Oct 2023 3:57 AM GMTతెలంగాణలో గతకొంతకాలంగా టీఎస్పీఎస్పీ పోటీ పరీక్షల నిర్వహణ, ప్రశ్నాపత్రాల లీక్, తిరిగి నిర్వహించడం వంటి అంశాలు తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో హైదరాబాద్ లోని అశోక్ నగర్ గ్రూప్-2 పోటీ పరీక్షలకు సన్నద్దమవుతోన్న యువతి (23) ఆత్మహత్య చేసుకుంది. సమీపంలోని హాస్టల్ లో ఉంటున్న ఆమె.. శుక్రవారం సాయంత్రం తన గదిలో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
అవును... చిక్కడపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో అశోక్ నగర్ లో ఒక యువతి ఆత్మహత్య చేసుకుంది. దీంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. ఈ సమయంలో తోటి విద్యార్థులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని, మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్న పోటీ పరీక్షల అభ్యర్థులు ఒక్కసారిగా తిరగబడి అడ్డుకున్నారు.
టీఎస్పీఎస్సీ పరీక్ష వాయిదా పడడం వల్లే ఆమె మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుందని తోటి అభ్యర్థులు చెబుతున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అర్ధరాత్రి వరకు యువతి మృతదేహం హాస్టల్ లోనే ఉంది. మరోపక్క ఆమె కుటుంబానికి న్యాయం చేసేవరకు కదలబోమని గ్రూప్స్ అభ్యర్థులు రహదారిపై అర్ధరాత్రి నిరసనకు దిగారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.
దీంతో సెంట్రల్ జోన్ డీసీపీ వారందరికీ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ వినని అభ్యర్తులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అర్ధరాత్రి దాటిన తర్వాత పోటీపరీక్షల అభ్యర్థులపై పోలీసులు లాఠీఛార్జి చేశారు. ఈ ఉద్రిక్త పరిస్థితుల నడుమ రాత్రి 1:30 ప్రాంతంలో ఆమె మృతదేహాన్ని అంబులెన్స్ లో గాంధీ ఆసుపత్రికి తరలించారు.
సూసైడ్ నోట్ లో ఏముంది?:
ఈ సమయంలో ఆత్మహత్య చేసుకున్న ఆ యువతి రాసిన సూసైడ్ నోట్ గా చెబుతున్న ఒక లేఖ విద్యార్థుల వాట్సాప్ గ్రూప్ లో చక్కర్లు కొట్టింది. ఇందులో... "నన్ను క్షమించండి అమ్మా! నేను చాలా నష్టజాతకురాలిని. నా వల్ల మీరు ఎప్పుడూ బాధపడుతూనే ఉన్నారు. ఏడవకండి అమ్మా.. జాగ్రత్తగా ఉండండి. మీకు పుట్టడం నా అదృష్టం అమ్మా.. నన్ను కాళ్లు కింద పెట్టకుండా చూసుకున్నారు.. మీకు నేను చాలా అన్యాయం చేస్తున్నా.. నన్ను ఎవరూ క్షమించరు. నాన్న జాగ్రత్త!" అంటూ ఆ లేఖలో ఉంది!
విద్యార్థులు చెబుతున్న వివరాలు!:
ఆత్మహత్య చేసుకున్న మృతురాలు వరంగల్ జిల్లాకు దుగ్గొంది మండలం, బిక్కోజిపల్లి గ్రామానికి చెందిన ప్రవల్లిక అని చెబుతున్నారు. ఈమె గత రెండు సంవత్సరాలుగా పోటీ పరీక్షకలకు ప్రిపేర్ అవుతోంది. ఇందులో భాగంగా గ్రూప్ – 2 కి అప్లై చేసిన ప్రవల్లిక.. అశోక్ నగర్ లో గర్ల్స్ హాస్టల్ లో ఉంటూ కోచింగ్ తీసుకుంటోంది.
అయితే... ఇప్పటికే ఒకసారి వాయిదా పడిన గ్రూప్ - 2.. మళ్లీ వాయిదా పడటంతో తీవ్ర మనస్తాపానికి గురైందని అంటున్నారు. వేలకు వేలు డబ్బు పెట్టి కోచింగ్ తీసుకోవడం.. హాస్టల్ లో ఉండి చదువుకోవడం భారంగా మారడంతో పాటు.. పరీక్ష మళ్లీ వాయిదా పడటంతో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడిందని.. ఈ నేపథ్యంలో యువతి హాస్టల్ లో రూం మేట్స్ భోజనం చేసేందుకు కిందకు వెళ్లిన సమయంలో ఆత్మహత్యకు పాల్పడిందని చెబుతున్నారు.