తెలంగాణ సర్కారు "గ్రూప్స్" శాపం
రాష్ట్ర స్థాయి సర్వీసుల్లో అత్యున్నతమైనది గ్రూప్ 1. ఈ పోస్టుల్లో ఆర్డీవో, డీఎస్పీలుగా ఎంపికైనవారు తదుపరి కలెక్టర్లు, ఎస్పీలుగా పదోన్నతి పొందుతారు.
By: Tupaki Desk | 14 Aug 2023 12:30 AM GMTరాష్ట్ర స్థాయి సర్వీసుల్లో అత్యున్నతమైనది గ్రూప్ 1. ఈ పోస్టుల్లో ఆర్డీవో, డీఎస్పీలుగా ఎంపికైనవారు తదుపరి కలెక్టర్లు, ఎస్పీలుగా పదోన్నతి పొందుతారు. గ్రూప్ 1లోని మిగతా పోస్టులూ చాలా ముఖ్యమైనవే. నీళ్లు-నిధులు-నియామకాలు అంటూ ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్స్ పరీక్షలను శాపాలు వెంటాడుతున్నాయి. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత ఏళ్ల పాటు డిమాండ్ చేయగా చేయగా.. దాదాపు తొమ్మిదేళ్లకు గ్రూప్ 1 నోటిఫికేషన్ వెలువరించింది బీఆర్ఎస్ సర్కారు. కానీ, ప్రిలిమ్స్ కూడా పూర్తయి అంతా సజావుగా సాగుతోందని అనుకంటున్న సమయంలో బ్యాడ్ లక్ వెంటాడింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ)లోని ఇంటి దొంగలు మొత్తం పరీక్షనే రద్దు చేసేలా నిర్వాకానికి తెగించారు. తద్వారా లక్షలాది మంది అభ్యర్థులను హతాశులను చేశారు.
లీకేజీ అసాధ్యం అనుకుంటే..?
ఓ 20 30 ఏళ్ల కిందట అంటే పేపర్ లీకేజీకి అవకాశాలు ఉండేవి. కానీ, టెక్నాలజీ బాగా మెరుగైన ఈ రోజుల్లో పేపర్ లీకేజీ అంటే అసాధ్యమే అనేది అభిప్రాయం. కానీ, దీనిని చెరిపేస్తూ టీఎస్పీఎస్సీ ఇంటి దొంగలు పేపర్ లీకేజీకి పాల్పడ్డారు. అధునాతన సాంకేతికతతో అంతకుముందు ఏఈఈ పరీక్ష లోనూ అక్రమాలకు పాల్పడ్డారు. దీంతో ఆ పరీఓ కూడా రద్దయింది. వాస్తవానికి టీఎస్పీఎస్సీ పరంగా ఇందులో తప్పేమీ లేదు. కానీ, సంస్థలోని ఇంటి దొంగలు చేసిన పనికి కమిషన్ పరువు పోయింది. కమిషన్ చైర్మన్ గా ఉన్న జనార్దనరెడ్డి కూడా ఉత్తమ అధికారి. నమ్ముకున్న వారే లీకేజీకి పాల్పడడంతో ఆయన హతాశులయ్యారని అప్పట్లో చెప్పారు. కాగా, 2014లో తెలంగాణ ఏర్పడగా.. 2022లో తొలిసారిగా గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చారు. కొన్నాళ్ల కిందటనే ప్రిలిమ్స్ మరోసారి నిర్వహించారు.
గ్రూప్ 2 ఇలా
తెలంగాణ వచ్చిన నాలుగేళ్ల తర్వాత 2015లో ప్రభుత్వం తొలిసారిగా గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇచ్చింది. దీనికి సంబంధించి 2016లో పరీక్ష జరిగింది. అయితే, వివిధ కారణాలతో నోటిఫికేషన్ తేదీకి పరీక్షకు మధ్య చాలా సమయం పట్టింది. మధ్యలో ఓసారి అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు గడువును పొడిగించారు. మరోవైపు పరీక్ష పూర్తయిన తర్వాత కూడా నియామక ప్రక్రియ చాలా ఆలస్యమై ఎంపికైన అభ్యర్థుల్లో చెలరేగింది. అసలు నియామకాలు ఉంటాయా? అన్న ఆందోళన వ్యక్తమైంది. కాగా, ఎన్నికల సమయంలో తాజాగా చేపట్టిన గ్రూప్ 2 పరీక్ష అనివార్య పరిస్థితుల్లో వాయిదా వేయాల్సి వచ్చింది. గురుకుల బోర్డు, జూనియర్ లెక్చరర్ల పరీక్షలు ఉండగా గ్రూప్ 2 ఎలా రాయాలంటూ అభ్యర్థులు ఆందోళనకు దిగడంతో ప్రభుత్వం దిగిరాక తప్పలేదు.
ఉమ్మడి రాష్ట్రంలో గ్రూప్ 1 వివాదం
ఉమ్మడి ఏపీలో గ్రూప్స్ పరీక్షల నియామకాలపై పెద్ద వివాదమే రేగింది. వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో టీఎస్పీఎస్సీ చైర్మన్ గా ఉన్న వ్యక్తి అనేక అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి. ఈ కారణంగానే.. ‘‘ఆర్డీవో కావాల్సిన వ్యక్తి ఆర్టీవో అయ్యారంటూ’’ నాటి టీఆర్ఎస్ ముఖ్య నేతలు.. అందులోనూ ఇప్పటి తెలంగాణ సీఎం కేసీఆర్ పదేపదే విమర్శలు చేశారు. వాస్తవానికి గ్రూప్స్ పరీక్షలు ఎప్పుడు నిర్వహించినా వివాదాలు తప్పవు. అందులోనూ ప్రభుత్వ సర్వీసుల్లో అత్యున్నతమైనవి కావడంతో గ్రూప్స్ విషయంలో వివాదాలు సహజం. ప్రాంతీయ విభేదాల రీత్యా ఉమ్మడి రాష్ట్రంలోనూ పలుసార్లు దీనికి రుజువులున్నాయి. కానీ, తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా శాపాలు వెంటాడుతుండడమే గమనార్హం.