బాదేసే జీఎస్టీ కౌన్సిల్ తాజాగా తీపి కబుర్లు చెప్పింది
అది.. ఇది అన్న తేడా లేకుండా బాదటమే లక్ష్యమన్నట్లుగా వ్యవహరించే జీఎస్టీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
By: Tupaki Desk | 10 Sep 2024 5:30 AM GMTఅది.. ఇది అన్న తేడా లేకుండా బాదటమే లక్ష్యమన్నట్లుగా వ్యవహరించే జీఎస్టీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒక దేశం ఒకే పన్ను మాటతో జీఎస్టీని తీసుకొచ్చిన తర్వాత నుంచి ఎంత భారీగా నిధులు కేంద్రానికి.. రాష్ట్రానికి వస్తున్నవిషయం తెలిసిందే. ప్రతి రంగానికి.. ప్రతి సేవకు జీఎస్టీ వడ్డించే వైనంపై ఎన్ని వ్యంగ్య వ్యాఖ్యలు ఉన్నాయో తెలిసిందే. చివరకు బీమా పాలసీలు.. ఆరోగ్య బీమాకు సైతం 18 శాతం జీఎస్టీని వసూలు చేస్తున్న వైనంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతపై జీఎస్టీ కౌన్సిల్ తాజాగా ఫోకస్ చేసింది.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేత్రత్వంలోజీఎస్టీ మండలి 54వ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆరోగ్య బీమా.. జీవిత బీమా ప్రీమియంను తగ్గించాలన్న అంశంపై ఏకాభిప్రాయానికి వచ్చారు. అయితే.. ఎంత తగ్గించాలన్న అంశంపై మాత్రం నిర్ణయాన్ని తీసుకోలేదు. ప్రస్తుతం బీమా ప్రీమియంపై 18 శాతం జీఎస్టీ వసూలు చేయటంపై వస్తున్న విమర్శలపై మండలి సమావేశంలో చర్చకు వచ్చింది.
బీమా ప్రీమియంపై వసూలు చేస్తున్న జీఎస్టీని తగ్గించేందుకు మండలి ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. రాష్ట్రాలు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బీమా ప్రీమియం తగ్గిస్తే ఎదురయ్యే ప్రభావాలకు సంబంధించిన నివేదికను జీఎస్టీ మండలి స్వీకరించింది. నవంబరులో జరిగే మండలి భేటీలో బీమాప్రీమియంపై జీఎస్టీని ఎంత వసూలు చేయాలన్న దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. ఎట్టకేలకు బీమా ప్రీమియంపై జీఎస్టీ కోత దిశగా అడుగులు పడుతున్న పరిస్థితి. తాజా మండలి సమావేశాల్లో తీసుకున్న కీలక నిర్ణయాల్ని చూస్తే..
- క్యాన్సర్ ఔషధాలపై 12 శాతంగా ఉన్న జీఎస్టీ 5 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం
- మతపరమైన ప్రయాణాల్లో ఉపయోగించే హెలికాఫ్టర్ సర్వీసులపై 18 శాతం ఉన్న జీఎస్టీ 5 శాతానికి తగ్గింపు
- కేదార్ నాథ్.. తదితర ప్రాంతాల్లో భక్తుల ప్రయాణానికి వాడే హెలికాఫ్టర్ సర్వీసులకు ఇది వర్తిస్తుంది.
- చార్టర్ హెలికాఫ్టర్లపై ఎప్పటిలానే 18 శాతం జీఎస్టీ వసూలు
- చిరుతిళ్లు.. అదేనండి స్నాక్స్ పాకెట్లపై 18 శాతం వసూలు చేస్తున్న జీఎస్టీని 12 శాతానికి తగ్గింపు
- విదేశీ ఎయిర్ లైన్స్ సంస్థలు దిగుమతి చేసుకునే సేవలపై జీఎస్టీ మినహాయింపు
- ఆన్ లైన్ గేమింగ్ పై 28 శాతం జీఎస్టీ వడ్డింపు తర్వాత దీని ఆదాయం 412 శాతం పెరిగింది. ప్రస్తుతం ఈ రంగం ద్వారా రూ.6909 కోట్లు వస్తున్నట్లుగా కేంద్ర ఆర్థిక మంత్రి పేర్కొనటం గమనార్హం.