ఓపీఎస్ వద్దు జీపీఎస్సే ముద్దు.. తేల్చేసిన ఏపీ సర్కార్!
ఓల్డ్ పెన్షన్ స్కీమ్ (ఓపీఎస్) కంటే గ్యారెంటీ పెన్షన్ స్కీమ్ (జీపీఎస్) లోనే ఉద్యోగులకు ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని ఏపీ ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా వెల్లడించింది
By: Tupaki Desk | 28 Sep 2023 7:19 AM GMTఓల్డ్ పెన్షన్ స్కీమ్ (ఓపీఎస్) కంటే గ్యారెంటీ పెన్షన్ స్కీమ్ (జీపీఎస్) లోనే ఉద్యోగులకు ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని ఏపీ ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా వెల్లడించింది. ఓపీఎస్ ను అమలు చేస్తే రాష్ట్రానికి భవిష్యత్తులో అప్పు కూడా పుట్టదని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. అసెంబ్లీలో మాట్లాడిన ఆయన ఓపీఎస్ ను అమలు చేస్తే 3 శాతం ఉండాల్సిన ఆర్థిక లోటు 2030కి 4.8%, 2040కి 6.1%, 2050 కల్లా 8 శాతానికి చేరుతుందని తెలిపారు. అదే జరిగితే రాష్ట్రం ఆర్థికంగా స్తంభించిపోతుందని వెల్లడించారు. అప్పుచేసే పరిస్థితి కూడా ఉండదని సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, భావితరాలను, ఉద్యోగుల భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకునే గ్యారంటీ పెన్షన్ స్కీం (జీపీఎస్) తీసుకొచ్చామని స్పష్టం చేశారు. ఏపీ అమల్లోకి తెచ్చిన ఇదే విధానాన్ని రాబోయే కాలంలో దేశమంతా కూడా ఆదర్శంగా తీసుకోవచ్చన్నారు. ఉద్యోగి పదవీ విరమణ చేసే నాటికి చివరిసారిగా డ్రా చేసిన మూల వేతనంలో 50% చొప్పున నెల వారీ పింఛన్ ఉండేలా ఈ విధానంలో గ్యారంటీ ఇస్తున్నామన్నారు. అలాగే పింఛన్ దారు మరణిస్తే వారి జీవిత భాగస్వామికీ 60% పింఛన్ వర్తింపజేస్తామని చెప్పారు.
ప్రభుత్వ ఉద్యోగులతోపాటు జీపీఎస్ ఉద్యోగులకు హెల్త్ స్కీమ్ అమలు చేస్తామని బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. దీనివల్ల పదేళ్ల సర్వీసు కలిగిన ఉద్యోగులకూ రూ.10 వేల పింఛన్ గ్యారంటీ ఉంటుంది అని చెప్పారు. జీపీఎస్ బిల్లు-2023ను బుగ్గన రాజేంద్రనాథ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. దీనికి సభ ఆమోదం లభించింది.
ఈ సందర్భంగా మాట్లాడిన బుగ్గన హాట్ కామెంట్స్ చేశారు. 'కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం' (సీపీఎస్)ను రివ్యూ చేయాలని అనేక ఏళ్లుగా ఉద్యోగులు కోరుతున్నారని గుర్తు చేశారు. దీనిపై అనేక రకాలుగా అధ్యయనం చేశామన్నారు. ఉద్యోగులకు మరింత మేలు జరిగేలా హైబ్రిడ్ మోడల్ లో జీపీఎస్ ను తీసుకొచ్చామని వెల్లడించారు.
ఓల్డ్ పెన్షన్ స్కీమ్ (ఓపీఎస్)లో ప్రస్తుతం ఎవరైతే ఉన్నారో వారికి ఏడాదికి రూ.20,400 కోట్ల చొప్పున ప్రభుత్వం పింఛన్ ఇస్తోందని మంత్రి బుగ్గన గుర్తు చేశారు. సీపీఎస్ ఉద్యోగులంతా ఓపీఎస్ కు వెళితే 2030లో వారికివ్వడానికి ప్రభుత్వానికి రూ.33,546 కోట్లు అవసరమవుతాయన్నారు. 2045 నుంచి పరిస్థితి మరింత చేయి దాటిపోతుందని తెలిపారు. 2004 తరువాత నియమితులైన ఉద్యోగుల పదవీ విరమణ.. 2045 నాటికి భారీసంఖ్యలో ఉంటడమే ఇందుకు కారణమన్నారు. ఈరోజు ఎవరైతే సీపీఎస్ నుంచి ఓపీఎస్ తీసుకున్నామని సంబరపడతారో... వారు 2045 నాటికి ఇబ్బంది పడే ప్రమాదం ఉందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందే ఉద్దేశంతో కాకుండా 2070 వరకు ఉద్యోగుల సంక్షేమం గురించి ఆలోచించే ప్రభుత్వం జీపీఎస్‌ను తీసుకొచ్చిందని బుగ్గన వెల్లడించారు.
సీపీఎస్ ఉద్యోగుల కంట్రిబ్యూషన్ ను ప్రస్తుతం షేర్ మార్కెట్‌లో పెడుతున్నారని.. ఈ నేపథ్యంలో వారికి లభించే ప్రయోజనాలు మార్కెట్ హెచ్చుతగ్గులపైన ఆధారపడి ఉంటాయని బుగ్గన తెలిపారు. ఈ విధానంలో షేర్ మార్కెట్ మంచి పనితీరు చూపకపోతే ఉద్యోగులు నష్టపోతారని.. వారి పెట్టుబడికి కూడా హామీ ఉండదన్నారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం, భవిష్యత్ లో నియమితులయ్యే ఉద్యోగుల అవసరాలు, వారి పిల్లల భవిష్యత్ గురించి ఆలోచించే సీపీఎస్, ఓపీఎస్ లకు ప్రత్యామ్నాయంగా జీపీఎస్ ను అందుబాటులోకి తెచ్చామన్నారు. ఒక వేళ ఓపీఎస్ కు వెళితే రాష్ట్ర పింఛన్లు 2030 నాటికి 16%, 2040కి 19.5%, 2050కి 28.6%, 2100కి దాదాపుగా 40 శాతానికి వెళతాయని బుగ్గన రాజేంద్రనాథ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇది 5-7 శాతం మించకూడదన్నారు. అలాగే ఓపీఎస్‌కు వెళితే అప్పు 2030కి 53%, 2040కి 70%, 2050కి 107 శాతానికి చేరుతుందన్నారు. దీనివల్ల భవిష్యత్ లో ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తుతాయని వెల్లడించారు.