బీఆర్ ఎస్‌లో గుబులు.. ఎమ్మెల్యేల స్ట్రాటజీ ఏంటి?
వరుసగా బీఆర్ ఎస్ నాయకులు నేరుగా సీఎం రేవంత్‌తో భేటీ అవుతున్నారు.
By: Tupaki Desk | 29 Jan 2024 5:30 AM GMTతెలంగాణ రాజకీయాల్లో మరోసారి కుదుపు ఏర్పడనుందా? కీలకమైన పార్లమెంటు ఎన్నికలకు ముందు.. జంపింగులు తెరమీదికి వస్తాయా? అధికార పార్టీ కాంగ్రెస్ దూకుడుతో బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు.. పక్క చూపులు చూస్తున్నారా? అంటే.. తాజాగా జరుగుతు న్న పరిణామాలను గమనించిన వారు.. ఔనని.. కొందరు కాదని వ్యాఖ్యానిస్తున్నారు. వరుసగా బీఆర్ ఎస్ నాయకులు నేరుగా సీఎం రేవంత్‌తో భేటీ అవుతున్నారు. రాష్ట్రంలో ఎన్నికలు జరిగి పట్టుమని రెండు మాసాలు కూడా కాకుండానే బీఆర్ ఎస్ పక్షాన గెలిచిన ఎమ్మెల్యేలు ఇలా సీఎం రేవంత్‌తో భేటీ కావడం వెనుక విషయం ఏదున్నా.. రాజకీయంగా మాత్రం ఏదో జరుగుతోందనే వాదన వినిపిస్తోంది.
ఇటీవలే.. బీఆర్ ఎస్‌కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యారు. నరసాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు సీఎం రేవంత్‌తో గంటకు పైగా భేటీ అయ్యారు. వీరికి సీఎం రేవంత్ తేనీటి విందు ఇచ్చారు. అయితే.. వీరు ఏం చర్చించారన్న విషయంపై అనేక ఊహాగానాలు వచ్చాయి. కేవలం అభివృద్ధి కోసమే.. తాము సీఎంను కలిశామని వారు తర్వాత వివరణ ఇచ్చుకున్నారు. కానీ, పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్ ఎస్ అభివృద్ది చేశామని చెబుతున్నప్పుడు పట్టుమని రెండు నెలలు కూడా కాని కొత్త ప్రభుత్వంతో వీరు అభివృద్ధిపై చర్చలు జరుపుతారా? అనేది సందేహం.
ఇక, ఇప్పుడు తాజాగా.. మరో ఎమ్మెల్యే కూడా సీఎం రేవంత్‌తో భేటీ అయ్యారు. ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ సీఎం రేవంత్‌తో భేటీ అయ్యారు. యథాలాపంగా ఈయన కూడా తన నియోజకవర్గం అభివృద్ధి కోసమే వచ్చానని చెప్పుకొచ్చారు. పైన వచ్చిన డౌటే.. ఈయన విషయంలోనూ వచ్చింది. ఇదిలావుంటే.. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మధు యాష్కీ సంచలన ప్రకటన చేశారు. వాళ్లంతా తమ పార్టీలోకి వచ్చేయడానికి రెడీగా ఉన్నారని.. కానీ, తామే వారిని నిలువరిస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. నిప్పులేందే పొగరాదన్నట్టుగా.. జంపింగుల ఉద్దేశం లేకుండా.. ఏనేతా ఇంత హడావుడిగా ప్రత్యర్థి పార్టీ సీఎంను కలుసుకునేందుకు సాహసం అయితే చేయరని పరిశీలకులు అంటున్నారు.
ఇక, రాజకీయ వాతావరణాన్ని పరిశీలిస్తే.. రాష్ట్రంలో త్వరలోనేపార్లమెంటు ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ గాలి జోరుగా వీస్తున్నందున.. ఈ పార్టీ భారీగానే ఆశలు పెట్టుకుంది. ఉచిత బస్సు ప్రయాణం సహా ఇతర పథకాలు తమకు లాభిస్తాయని అనుకుంటోంది. దీనిని పరిశీలకులు కూడా అంగీకరిస్తున్నారు. ఈ క్రమంలోనే పలువురు బీఆర్ ఎస్ నేతలు.. పార్టీ మారేందుకు సిద్ధపడుతున్నారా? అనే చర్చ జోరుగా సాగుతోంది. పైకి వారు కాదని అంటున్నా.. లోపల మాత్రం తేడాగానే ఉన్నారనేది విశ్లేషకుల మాట. చూడాలి.. మరి ఏం జరుగుతుందో. మరోవైపు.. బీఆర్ ఎస్‌లోనూ ఈ విషయం చర్చకు వస్తోంది. ఉండేవారు.. ఎవరు? వీడేవారు ఎవరు? అనేది గుబులు రేపుతోంది.