బీఆర్‌ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్!
కాగా గూడెం మహిపాల్‌రెడ్డి 2014, 2018, 2023ల్లో పటాన్ చెరులో వరుసగా మూడుసార్లు బీఆర్‌ఎస్ నుంచి గెలుపొందారు. తద్వారా హ్యాట్రిక్ సృష్టించారు.
By: Tupaki Desk | 15 July 2024 3:37 PM GMTతెలంగాణలో కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్‌ఎస్ కు మరో దిమ్మతిరిగే షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయన తోపాటు జహీరాబాద్ బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన గాలి అనిల్ కుమార్, కొంతమంది కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు.
గతేడాది డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అధికారాన్ని కోల్పోయింది. 39 అసెంబ్లీ స్థానాలకే పరిమితమైంది. ఇక ఇటీవల పార్లమెంటు ఎన్నికల్లో ఒక్క సీటును కూడా దక్కించుకోలేకపోయింది. చాలా నియోజకవర్గాల్లో ఏకంగా మూడో స్థానంలో నిలిచింది.
దీంతో బీఆర్‌ఎస్ లో ఉంటే రాజకీయ భవిప్యత్ మృగ్యమవుతుందని భావిస్తున్న ఆ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిపోతున్నారు. ఇప్పటికే శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, చేవేళ్ల ఎమ్మెల్యే కాలేరు యాదయ్య, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా త్వరలో హస్తం పార్టీలో చేరతారని తెలుస్తోంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ నుంచి పలువురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు త్వరలో కాంగ్రెస్ లో చేరతారని ప్రచారం జరుగుతోంది.
కాగా గూడెం మహిపాల్‌రెడ్డి 2014, 2018, 2023ల్లో పటాన్ చెరులో వరుసగా మూడుసార్లు బీఆర్‌ఎస్ నుంచి గెలుపొందారు. తద్వారా హ్యాట్రిక్ సృష్టించారు. రెండు రోజుల క్రితమే ఆయన చేరాల్సి ఉంది. అయితే అనివార్య కారణాల వల్ల జూలై 15న పార్టీలో చేరారు.
పటాన్ చెరు నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.