Begin typing your search above and press return to search.

పవన్ పవర్ తెలిసింది అంటున్న వైసీపీ మాజీ మంత్రి !

ఒక యూట్యూబ్ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో గుడివాడ అమర్నాథ్ అయితే పవన్ మీద చేసిన విమర్శలు తన కొంప ముంచాయని చెప్పకనే చెప్పేసి ఒప్పేసుకున్నారు.

By:  Tupaki Desk   |   20 Dec 2024 1:30 AM GMT
పవన్ పవర్ తెలిసింది అంటున్న వైసీపీ మాజీ మంత్రి !
X

పవన్ కళ్యాణ్ అంటే రీల్ లైఫ్ లో పవర్ స్టార్. ఆయన అంటే పడి చచ్చేంత అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. పవన్ ఇమేజ్ కి ఆకాశమే హద్దు అన్నట్లుగా ఆయన స్టార్ డం సాగుతూ వచ్చింది. అయితే పవన్ తన స్టార్ స్టాటస్ పీక్స్ లో ఉండగానే 2014లో రాజకీయ అరంగేట్రం చేశారు. ఆయనకు సినీ రంగంలో ఉజ్వల భవిష్యత్తు ఉండగానే ఈ డెసిషన్ తీసుకోవడం పట్ల అప్పట్లోనే చర్చ పెద్ద ఎత్తున సాగింది

అయితే పవన్ కి సినిమాల కంటే ప్రజా సేవ చేయాలన్న ఆసక్తి మెండుగా ఉండడంతో ఆయన పాలిటిక్స్ వైపు చూశారు. అయితే పవన్ రాజకీయ అరంగేట్రం నుంచి వైసీపీతోనే లడాయి ఉంది. అది ఎందుకు ఎక్కడ ఏర్పడింతో తెలియదు కానీ అలా సాగుతూ వచ్చింది పవన్ ఒకటి రెండు వైసీపీ నుంచి అన్నట్లుగా సాగిపోతూ వచ్చింది.

ఇక ఇదంతా పీక్స్ కి చేరుకున్నది ఎపుడు అంటే వైసీపీ అధికారంలో ఉన్నపుడు. పవన్ అధికారంలో ఉన్న పార్టీ మీద విమర్శలు చేస్తే దానికి ప్రతీగా భారీ కౌంటర్లు వేయడం అన్న స్ట్రాటజీని వైసీపీ ఎంచుకుంది. అది కాస్తా హద్దులు దాటి వ్యక్తిగత స్థాయిలోకి వచ్చేసింది. పవన్ పెళ్ళిళ్ళ విషయం ప్రస్తావిస్తూ ఆయనను గట్టిగానే వైసీపీ టార్గెట్ చేసింది.

ఇక వైసీపీలో ఒక సెక్షన్ ఆఫ్ మినిస్టర్లు పవన్ ని కౌంటర్లు వేయడానికే ఉన్నారా అన్నంతగా మీడియా ముందుకు వచ్చేవారు. వారిలో విశాఖ జిల్లా నుంచి యువ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఒకరు. ఆయన అయితే పవన్ మీద తనదైన శైలిలో విమర్శలు చేస్తూ వచ్చారు. అవన్నీ కూడా హాట్ హాట్ గా సాగేవి. అలా జనసేన వర్సెస్ వైసీపీ అన్న పొలిటికల్ వార్ పీక్స్ కి చేరిపోయింది.

ఇవన్నీ పక్కన పెడితే వైసీపీ ఘోరంగా ఓటమి పాలు కావడానికి పవన్ మీద చేసిన ఘాటు విమర్శలు కూడా ప్రధాన కారణం అని తాపీగా వైసీపీ మాజీలు చింతిస్తున్నారు. ఒక యూట్యూబ్ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో గుడివాడ అమర్నాథ్ అయితే పవన్ మీద చేసిన విమర్శలు తన కొంప ముంచాయని చెప్పకనే చెప్పేసి ఒప్పేసుకున్నారు.

పవన్ మీద విమర్శలు వద్దు అని తన తల్లికి అంతా చెప్పేవారు అని అలాగే తనకు కూడా నేరుగా కొందరు చెప్పేవారు అని ఆయన పేర్కొన్నారు. అయితే తాను పాలసీ ప్రకారమే విమర్శలు చేస్తూ వచ్చాను అని భావించాను తప్ప వేరేగా అనుకోలేదని అన్నారు. ఈ మొత్తం పరిణామాలలో పవన్ చుట్టూ బలమైన కాపు సామాజిక వర్గం అల్లుకుని ఉందని గమనించలేదని ఆయన అన్నారు.

ఆ విధంగా పవన్ మీద విమర్శలు చేయడం ద్వారా కాపు సామాజిక వర్గం అంతా పోలరైజ్ అయిందని దన ఓటమికి అదే ప్రధాన కారణం అయింది అని ఆయన విశ్లేషించారు. దానికి ఉదాహరణ చెబుతూ 2019లో వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన తిప్పల నాగిరెడ్డికి 77 ఓట్లు వస్తే పవన్ నేరుగా పోటీ చేసినా 17 వేల ఓట్ల మెజారిటీ దక్కిందని. అదే 2024లో తాను పోటీ చేసి 67 వేల ఓట్లు తెచ్చుకున్నా పవన్ అభ్యర్థి కాకపోయినా మెజారిటీ అయితే ఏపీలోనే రికార్డు స్థాయిలో కూటమికి వచ్చిందని అన్నారు.

దీని వల్ల మొత్తం కూటమి ఓట్లు పొల్లుపోకుండా పడ్డాయని అర్ధం అయిందని అదే విధంగా కాపుల ఓట్లు కూడా నూటికి ఎనభై శాతం కూటమికి వెళ్లాయని కూడా అర్ధం అయింది అన్నారు. ఈ విధంగా గుడివాడ తన ఓటమి గురించి విశ్లేషిస్తూ పవన్ ని విమర్శించడం వల్లనే ఇబ్బందులు ఎదురయ్యాయని ఒప్పేసుకున్నారు అంటున్నారు.

మరో వైపు చూస్తే తమ పార్టీ పాలసీల మేరకే విమర్శించింది అని ఆయన చెబుతున్నా జనాలకు అది వేరేలా వెళ్ళిందని అంటున్నారు. అయితే గతంతో పోలిస్తే ఇపుడు వయసు కొంత పెరిగిందని అలాగే మెచ్యూరిటీ లెవెల్స్ కూడా పెరిగాయని తాను భావిస్తున్నాయని అందువల్ల మరింతగా రాజకీయంగా రాటు దేలి జనాల మద్దతు చూరగొంటామని ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. చూడాలి మరి గుడివాడ ఆశలు ఏ విధంగా మారి జనంలోకి వెళ్ళి ఫలిస్తాయో.