వైసీపీ ఓట్లు చీల్చలేరా...ఇక్కడ సీన్ రివర్స్ ?
ఆనాడు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ మీద చర్చ జరిగినా ఎవరూ అంత సీరియస్ గా అయితే తీసుకోలేదు.
By: Tupaki Desk | 4 Nov 2024 2:45 AM GMTరాజకీయాల్లో ఎపుడూ నంబర్ గేమ్ కీలక పాత్ర పోషిస్తుంది. అది పెద్ద ఎత్తున జరిగే ఓట్ల పండుగ అయిన లేక అధికారం కోసం దక్కించుకే సీట్ల లెక్క అయినా నంబర్ దే ఆధిపత్యం. ఇదిలా ఉంటే వైసీపీ వ్యతిరేక ఓట్లను చీలనివ్వనని జనసేన అధినేత 2024 ఎన్నికలకు నాలుగేళ్ళ ముందే భారీ శపధం చేశారు.
ఆనాడు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ మీద చర్చ జరిగినా ఎవరూ అంత సీరియస్ గా అయితే తీసుకోలేదు. కానీ చివరికి పవన్ అనుకున్నదంతా చేశారు. ఆయన బీజేపీని టీడీపీ కలిపి కూటమి కట్టించగలిగారు. వైసీపీని ఏపీలో 2024 ఎన్నికల్లో మట్టి కరిపించగలిగారు
అలా వైసీపీ వ్యతిరేక ఓటు ఒక్కటి కూడా చీలకుండా సాలిడ్ గా కూటమికి పడింది.దాంతో కూటమి బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది.95 శాతం సీట్లను దాదాపుగా అరవై శాతం ఓట్ల షేర్ తో పవర్ ని దక్కించుకుంది.
ఇది బాగానే ఉంది కానీ ఇపుడు ఏపీలో విపక్షంలో ఉన్న వైసీపీకి పోటీ లేకుండా పోయింది. రాజకీయ మైదానం మొత్తం ఖాళీగా ఉంది. అంతా కూటమిలోనే ఉన్నారు. బీజేపీ కానీ జనసేన కానీ టీడీపీకి మంచి దోస్తులుగా మారిపోయారు. పైపెచ్చు వీరంతా కలసి 2029లో షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగినా లేక జమిలి ఎన్నికలు తోసుకుని వచ్చినా కలసికట్టుగా పోటీ చేస్తామని చెబుతున్నారు.
దాంతో అధికార పార్టీలోనే అన్ని పార్టీలు ఉండడం విపక్షం వైపు గ్రౌండ్ టోటల్ గా ఖాళీగా ఉండడం వైసీపీకి ఊపు ఇస్తోంది. 2019లో చూస్తే అలా ఏమీ లేదు, అధికారంలో టీడీపీ ఉంటే విపక్షంలో జనసేన బీజేపీ ఉన్నాయి. జనసేన కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుని మరీ పోటీ చేసింది. అలాగే కాంగ్రెస్ కూడా ఒంటరిగా పోటీ పడింది.
ఇలా విపక్ష ఓట్లు పెద్ద ఎత్తున చీలుతాయని మరో మారు తమదే అధికారం అని పొలిటికల్ మేధమెటిక్స్ ని టీడీపీ నమ్ముకుంది. కానీ జనాలు టీడీపీకి యాంటీగా ఉన్న వైసీపీనే గెలిపించి తన వివేచనను చాటుకున్నారు. పైగా మిగిలిన పార్టీలు అన్నీ సోదిలోకి రాకుండా పోయాయి.
ఈ నేపథ్యంలో ఇపుడు విపక్ష శిబిరం మొత్తం వైసీపీయే ఆక్రమించుకుంటే వచ్చే ఎన్నికల్లో ఎలాంటి రిజల్ట్ వస్తుంది అన్నది చర్చగా ఉంది. ప్రతిపక్షంలో ఉన్నపుడు కూటములు కడితే ప్రయోజనం భారీగా ఉంటుంది. అదే అధికారంలో ఉన్నపుడు కూటములు కట్టినా జనంలో యాంటీ ఇంకెంబెన్సీ గట్టిగా ఉంటే మాత్రం రిజల్ట్ రివర్స్ అయిన సందర్భాలు దేశ చరిత్రలో ఎన్నో ఉన్నాయని గుర్తు చేస్తున్నారు.
ఇవన్నీ పక్కన పెడితే విపక్షంలో తాము సింగిల్ గా ఉండడం పట్ల వైసీపీలో ఆనందం వ్యక్తం అవుతోంది. కూటమి పట్ల జనాలు వ్యతిరేకత పెంచుకుంటే ఆల్టరేషన్ గా వైసీపీ మాత్రమే కనిపిస్తుందని అది తమను అధికారానికి చేరువ చేస్తుందని బలంగా నమ్ముతోంది. వైసీపీ మాజీ మంత్రులు కూడా ఇదే రకంగా చెబుతున్నారు.
గుడివాడ అమర్నాధ్ తాజాగా మాట్లాడుతూ ఏపీలో ప్రతిపక్షం అంటే ఒక్క వైసీపీ మాత్రమే అని మొత్తం అంతా అధికార పక్షంలోనే ఉన్నారు కదా అని సెటైర్లు వేశారు. అంటే కమ్యూనిస్టులు కాంగ్రెస్ కూడా కూటమి పట్ల సాఫ్ట్ కార్నర్ తో ఉంటున్నారు అన్న అర్ధమేదో ఆయన మాటలలో ఉందేమో చూడాల్సి ఉంది.
మరో వైపు చూస్తే వైసీపీ సోలోగా ఉండడం వల్ల లాభమే అని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. పోరాటం చేస్తే మేమే చేయాలి వైసీపీ మాత్రమే ప్రతిపక్షం, జగన్ ఒక్కరే జనాలకు భరోసా ఇవ్వగలిగే నాయకుడు అని మరో మాజీ మంత్రి పేర్ని నాని ఇటీవల మీడియా సమావేశంలో అన్న మాటలను గుర్తు చేసుకుంటే వైసీపీ పొలిటికల్ మేధమెటిక్స్ ని బాగానే నమ్ముకుంది అని అర్ధం అవుతోంది. మరి ఇదే పరిస్థితి కొనసాగుతుందా లేక వైసీపీకి పోటీగా మరే ఇతర ప్రతిపక్షం పుంజుకుని రేసులోకి వస్తుందా అన్నది చూడాల్సి ఉంది.