ఉక్కుతోనే ఉక్కిరిబిక్కిరి చేయనున్న వైసీపీ
దాంతో విశాఖ ఉక్కు కర్మాగారం ఇష్యూతోనే అధికార టీడీపీ కూటమిని ఉక్కిరిబిక్కిరి చేయడానికి వైసీపీ డిసైడ్ అయింది.
By: Tupaki Desk | 12 Oct 2024 3:28 AM GMTప్రతిపక్షంలో ఉన్న వారికి సమస్యలు కావాలి. అవి ప్రజలకు సంబంధించినవి ఎంత ఎక్కువగా ఉంటే అధికార పక్షం మీద అంత బలంగా పోరాటం సాగుతుంది. విశాఖలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సర్వం కోల్పోయిన వైసీపీ పోయిన చోటనే వెతుక్కోవాలని చూస్తోంది.
దాంతో విశాఖ ఉక్కు కర్మాగారం ఇష్యూతోనే అధికార టీడీపీ కూటమిని ఉక్కిరిబిక్కిరి చేయడానికి వైసీపీ డిసైడ్ అయింది. కూటమి అధికారంలోకి రావడానికి ఎన్నికల హామీగా విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం కానీయమని చెప్పి ఓట్లు వేయించుకున్నారని ఇపుడు నాలుగు నెలలు గడచినా ఆ సమస్యను పట్టించుకోవడంలేదని వైసీపీ ఘాటు విమర్శలు చేసింది.
మాజీ మంత్రి విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాధ్ అయితే విశాఖ ఉక్కు విషయంలో కూటమి ప్రభుత్వం మోసం చేసిందని నిందించారు. కర్నాటకలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపారని విశాఖలో ఎందుకు ఆగదని ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుని ప్రశ్నించారు.
చంద్రబాబు ఢిల్లీ పర్యటన తరువాత విశాఖ ఉక్కు విషయంలో సాధించినది ఏమిటి అని ఆయన నిలదీశారు. విశాఖ ఉక్కు విషయంలో స్పష్టమైన ప్రకటన చేయాల్సిన ముఖ్యమంత్రి ఆ విషయం మీద పెద్దగా స్పందించకపోవడమేంటి అని ఆయన ఫైర్ అయ్యారు.
దేశంలో ఏ స్టీల్ ప్లాంట్ కీ పట్టని గతిని కేంద్రం ఒక్క విశాఖ స్టీల్ ప్లాంట్ కే పట్టిస్తే చంద్రబాబు ఏమి చేస్తున్నారు అని గుడివాడ అంటున్నారు. తనకు ఉన్న 16 మంది ఎంపీల మద్దతుని ఎన్డీయే కూటమికి ఇవ్వబోమని అల్టిమేటం ఎందుకు జారీ చేయరని ప్రశ్నించారు.
విశాఖ ఉక్కు విషయంలో మోసపూర్తిమైన హామీలు ఇచ్చారని కార్మికులకు అర్ధం అయిందని ఆయన అన్నారు. తామే విశాఖ ఉక్కుని కాపాడుకుంటామని స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపేలా ఉద్యమం చేస్తామని గుడివాడ చెప్పారు.
ప్రజా సంఘాలు, ప్లాంట్ కార్మికులతో కలిసి ఉమ్మడి కార్యాచరణతో వైసీపీ భారీ ఉద్యమం నిర్మిస్తుందని అన్నారు. వైసీపీ తరఫున నిరాహార దీక్షలు కూడా చేస్తామని పోరాటాన్ని ముందుకు తీసుకుని వెళ్ళి కేంద్రం ప్రైవేట్ పరం చేయకుండా చూస్తామని ఆయన ప్రకటించారు.
కేవలం ఇద్దరు ఎంపీల బలంతో కర్నాటక భద్రావతి స్టీల్ ప్లాంట్ ను ఆ రాష్ట్రం కాపాడుకుంటే 16 మంది ఎంపీల బలంతో కేంద్ర ప్రభుత్వాన్ని నిలబెట్టిన చంద్రబాబు విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం అల్టిమేటం ఇవ్వలేరా అని గుడివాడ లాజిక్ పాయింట్ నే తీశారు. భద్రావతి స్టీల్ ప్లాంట్ కోసం కేంద్రం 15 వేల కోట్లు కేటాయించిందని, ఇంకా నిధులు ఇవ్వడానికి మోడీ హామీ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
గత అయిదేళ్ళలో విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ కాకుండా తమ ప్రభుత్వం అడ్డుకుందని గుడివాడ గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నాలుగు వేల కార్మికులకు ఉధ్వాసన పలికి ఇంటికి పంపేశారు అని ఆయన ఆరోపించారు. తిరిగి ఉద్యమం చేయడం వల్లనే వారిని తీసుకున్నారని అన్నారు. ఈ రోజుకీ జీతాలు లేక పండుగ వేళ కూడా పస్తులతో గడుపుతున్న స్టీల్ ప్లాంట్ కార్మికుల సమస్య కూటమి పెద్దలకు ఎందుకు పట్టడం లేదని ఆయన నిలదీశారు.