Begin typing your search above and press return to search.

గుడివాడను గిర్రున తిప్పేస్తున్న వైసీపీ !

పొలిటికల్ గా గుడివాడ అమర్నాధ్ ఎంట్రీ ఇచ్చి రెండు దశాబ్దాలు గడచినా సొంత నియోజకవర్గం అంటూ లేకుండా పోయింది అన్న విమర్శలు ఉన్నాయి.

By:  Tupaki Desk   |   20 Jan 2025 2:45 AM GMT
గుడివాడను గిర్రున తిప్పేస్తున్న వైసీపీ  !
X

విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్ తన తండ్రి దివంగత నేత మాజీ మంత్రి గుడివాడ గురునాధరావు వారసుడిగా పొలిటికల్ అరంగేట్రం చేశారు. అయితే తండ్రి తాతలకు సొంత నియోజకవర్గం ఉంది. అదే పెందుర్తి. అక్కడ నుంచే వారు తమ రాజకీయాలను చేస్తూ వచ్చారు.

పొలిటికల్ గా గుడివాడ అమర్నాధ్ ఎంట్రీ ఇచ్చి రెండు దశాబ్దాలు గడచినా సొంత నియోజకవర్గం అంటూ లేకుండా పోయింది అన్న విమర్శలు ఉన్నాయి. దానికి గుడివాడ కూడా చేసుకున్నదే అంటున్నారు. ఆయన మొదట టీడీపీలో చేరారు. అపుడు ఆయన కార్పోరేటర్ గా గాజువాక నుంచి గెలిచారు. అదే టీడీపీలో ఆయన తల్లికి ఎమ్మెల్యే సీటు ఇచ్చారు. ఆ తరువాత ఆయన వైసీపీలో చేరారు. అయితే గాజువాక సీటుని తిప్పల నాగిరెడ్డికి జగన్ ఇచ్చారు.

దాంతో సొంత సీటు విషయంలో గుడివాడకు ఇబ్బంది అలా ఏర్పడింది. 2014 ఎన్నికల్లో ఆయనను అనకాపల్లికి షిఫ్ట్ చేసి ఎంపీగా పోటీ చేయించింది వైసీపీ అధినాయకత్వం. దాంతో ఆయన ఆ ఎన్నికల్లో ఓటమి పాలు అయ్యారు. ఇక 2019 నాటికి ఆయన అనకాపల్లి నుంచి అసెంబ్లీకి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. కానీ నాన్ లోకల్ అన్న ముద్రతో పాటు వర్గ రాజకీయంతో ఆయన పొలిటికల్ గా ట్రబుల్స్ ని ఫేస్ చేశారు.

ఇక 2024 ఎన్నికల ముందు ఆయనను తెచ్చి గాజువాక నుంచి పార్టీ పోటీ చేయించింది. అయితే సొంత సీటులో వైసీపీ నుంచే మద్దతు తగినంతగా లేక ఏపీలోనే భారీ ఓట్ల తేడాతో గుడివాడ ఓటమి పాలు అయ్యారు. ఆ సీటు తిప్పల ఫ్యామిలీదే అని మరోమారు కన్ ఫర్మ్ చేస్తూ లేటెస్ట్ గా వైసీపీ హైకమాండ్ మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కుమారుడు తిప్పల దేవాన్ రెడ్డిని ఇంచార్జిగా చేసింది.

ఇక గుడివాడ భీమిలీ సీటు మీద మోజు పెంచుకున్నారు అక్కడ అవంతి శ్రీనివాస్ రాజీనామా చేయడంతో ఆయన ఆ నియోజకవర్గం నుంచి 2029 ఎన్నికల్లో పోటీకి సిద్ధపడుతున్నారు. భీమిలీ నియోజకవర్గం నాయకులతో ఆయన మీటింగ్స్ పెట్టి మరీ హడావుడి చేశారు.

అయితే అనూహ్యంగా ఆ సీటులోకి బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు దూసుకుని వచ్చారు. దాంతో గుడివాడను చోడవరం అసెంబ్లీ నియోజకవర్గానికి ఈసారి వైసీపీ హైకమాండ్ షిఫ్ట్ చేసింది. దాంతో తప్పనిసరిగా ఆయన చోడవరానికి వెళ్ళాల్సి వస్తోంది.

ఇక్కడ తమాషా ఏంటి అంటే బొత్స విశాఖ జిల్లా వైసీపీ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్నారు. ఆయన పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. కానీ ఆయనకు మాత్రం తన సొంత జిల్లాలో ఎక్కడా అసెంబ్లీ సీటు అయితే పోటీకి లేదు. ఆయన అనకాపల్లి జిల్లా నుంచి చోడవరం నియోజకవర్గంలో రాజకీయాలు చేయాల్సి వస్తోంది. ఇది తమ నేతకు దూరం భారం అని గుడివాడ అనుచరులు అంటున్నారు.

మళ్ళీ నాన్ లోకల్ ఇష్యూ రావచ్చు అని వారు వాపోతున్నారు. అక్కడ ఉన్న క్యాడర్ సహకరించకపోతే ఇబ్బంది అవుతుందని మధన పడుతున్నారు. నాలుగు పదుల వయసులో ఉన్న గుడివాడ మరిన్ని ఎన్నికల్లో పోటీ చేయాల్సి ఉంటుంది. ఆయనకు ఈ రోజుకీ సొంత నియోజకవర్గం లేకపోవడం మాత్రం ఆయన పొలిటికల్ కెరీర్ కి ఇబ్బంది అవుతుందని అంటున్నారు. చూడాలి మరి గుడివాడ ఏ విధంగా నెగ్గుకుని వస్తారో అంటున్నారు.