Begin typing your search above and press return to search.

గుడివాడలో ఉద్రిక్తత... కొడాలి బర్త్ డే వేడుకల వేళ పోలీసులు షాక్!

"బిడ్డా.. ఇది కొడాలి నానీ అడ్డా!" అంటూ ఆయన అభిమానులు కామెంట్లు చేసిన పరిస్థితి! కట్ చేస్తే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

By:  Tupaki Desk   |   22 Oct 2024 6:21 AM GMT
గుడివాడలో ఉద్రిక్తత... కొడాలి బర్త్  డే వేడుకల వేళ పోలీసులు షాక్!
X

గత ప్రభుత్వ హాయంలో మంత్రిగా తనదైన హవా కొనసాగించిన నేత కొడాలి నాని. రాజకీయంగా గుడివాడను తన అడ్డాగా చేసుకుని అవిరామంగా వరుస విజయాలతో దూసుకుపోయిన నేత కొడాలి నాని. "బిడ్డా.. ఇది కొడాలి నానీ అడ్డా!" అంటూ ఆయన అభిమానులు కామెంట్లు చేసిన పరిస్థితి! కట్ చేస్తే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

గుడివాడలో సుమారు రెండు దశాబ్ధాలుగా తనదైన ఏకచత్రాధిపత్యం చేసినట్లు చెప్పే కొడాలి నాని పరిస్థితి ఇప్పుడు దయనీయంగా మారిందని అంటున్నారు. దీనికి తాజా ఉదాహరణ తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... కొడాలి నాని పుట్టినరోజు సందర్భంగా గుడివాడలో ఆయన అభిమానులు ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలను పోలీసులు తొలగించారు!

అవును... కొడాలి నాని ఫ్లెక్సీ కట్టకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఇవాళ కొడాలి నాని పుట్టిన రోజు సందర్భంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్న ఆయన అభిమానులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సమయంలో... అటు పోలీసులకు, ఇటు కొడాలి నాని అభిమానులకు మధ్య వాగ్వాదం జరిగింది.

ఈ సందర్భంగా స్పందించిన పోలీసులు... కొడాలి నాని పుట్టిన రోజు వేడుకలకు అనుమతి లేదని అంటున్నారు! ఈ సందర్భంగా పలువురు వైసీపీ స్థానిక నేతలు పోలీసులతో చర్చించినా అనుమతులు దక్కలేదని తెలుస్తోంది. 20 ఏళ్లు ఎమ్మెల్యేగా పనిచేసిన నాని బర్త్ డే ఫ్లెక్సీలను కూడా అడ్డుకోవడం దుర్మార్గం అని అంటున్నారు ఆయన అభిమానులు.

కాగా.. కొడాలి నాని గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో 2004 నుంచి వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఓసారి మంత్రిగానూ పనిచేశారు. ఇందులో 2004, 2009లో టీడీపీ నుంచి గెలిచిన ఆయన 2014, 2019లో వైసీపీ నుంచి గెలుపొందారు. కారణాలు ఏవైనప్పటికీ 2024లో ఘోరంగా 53,040 ఓట్లతేడాతో ఓటమిపాలయ్యారు.