రాజమండ్రి జైలు వెల్ నెస్ సెంటర్ కాదు... గుడివాడ వెటకారం!
అవును... స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 12 Oct 2023 5:26 AM GMTస్కిల్ డెవలప్ మెంట్స్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్టైనప్పటినుంచీ బయట జరుగుతున్న ప్రచారం, ములాకత్ అనంతరం వస్తున్న ఫిర్యాదులు, టీడీపీ శ్రేణులు చేస్తున్న నిరసన కార్యక్రమాలపై.. అధికార వైసీపీ నుంచి ఎద్దేవా మాటలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. దానికి అనుగుణంగానే వారి మాటలు కూడా ఉంటున్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా డీహైడ్రేషన్ ఇష్యూ వైరల్ అయ్యింది.
అవును... స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఆయన జైలుకు వెళ్లిన మొదట్లో దోమలపై ఫిర్యాదులు అందిన సంగతి తెలిసిందే. జైల్లో దోమలు ఎక్కువగా ఉన్నాయని.. ములాకత్ అనంతరం ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ విషయంలో లోకేష్ అయితే ఒక అడుగు ముందుకేశారు.
అందులో భాగంగా... దోమలతో కుట్టించి, డెంగ్యూ తెప్పించి, చంద్రబాబు చావును ప్లాన్ చేస్తున్నారన్నట్లుగా ట్వీట్ చేశారు. దీంతో... జైలు అధికారులు వివరణ ఇచ్చారు. జైల్లో రెండు పూటలా దోమల మందు పిచికారీ చేస్తున్నామని.. జైల్లో ఎక్కడా దోమల లార్వా లేదని వివరణ ఇచ్చారు. బాబుకు రెండు పూటలా వైద్య పరీక్షలు చేస్తున్నట్లు తెలిపారు.
దానిపైనా వైసీపీ నేతలు సెటైర్లు వేశారు. జైలు అన్నాక దోమలు అత్యంత సహజం అనే మాటలు మాట్లాడారు. అయినా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకుంటారని తెలిపారు. ఇక జైల్లో దోమలు కుట్టక.. రంభ ఊర్వశి మేనకా కన్ను కొడతారా అంటూ కొడాలి నాని తనదైన శైలిలో స్పందించారు. ఈ నేపథ్యంలో బాబుకు డీహైడ్రేషన్ అనే మాట హాట్ టాపిక్ గా మారింది.
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉంచిన సెల్ లో అధిక ఉష్ణోగ్రతల కారణంగా డీహైడ్రేషన్ తో బాధపడుతున్నారని ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నారు! అయితే ఈ విషయాలను జైళ్ల శాఖ డీజీపీ రవికుమార్ కొట్టిపరేశారు. ఆయన ఆరోగ్యం బాగుందని, రెగ్యులర్ గా వైద్య పరీక్షలు జరుపుతున్నామని తెలిపినట్లు తెలిసింది.
ఈ సమయంలో మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. ముఖ్యమంత్రి జగన్ చెప్పినట్లు ఇది రాజకీయ పరమైనటువంటి అంశం కాదని స్పష్టం చేశారు. చంద్రబాబుని కావాలని జైల్లో పెట్టాలని, ఇబ్బంది పెట్టాలనే ఆలోచన తమకు లేదని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. అంతా ప్రొసీజర్ ప్రకారం జరుగుతుందని వెల్లడించారు.
అనంతరం... చంద్రబాబేమీ వెల్ నెస్ సెంటర్ లో లేరని చెప్పిన అమర్నాథ్... ఆయన ఉన్నది జైల్లో అని అన్నారు. తప్పు చేస్తే శిక్ష పడినవాళ్లు, నేరం ఆరోపింపబడి రిమాండ్ లో ఉన్నవారికి ఆ రకమైనటువంటి పరిస్థితి ఉండాలనే ఉద్దేశ్యంతోనే ఈ వ్యవస్థను క్రియేట్ చేశారని అన్నారు.
అనంతరం... జైల్లో మర్డర్ చేసిన వ్యక్తి అయినా, అవినీతి చేసిన వ్యక్తి ఉన్నా... వారి ఆరోగ్యం గురించి డిపార్ట్మెంట్ బాధ్యత తీసుకుంటుందని అన్నారు. ఆయన కోసం, ఆయన ఆరోగ్యం కోసం ప్రభుత్వం ప్రత్య్క శ్రద్ధ తీసుకుంటుందని అమర్నాథ్ తెలిపారు. ఇదే క్రమంలో... ఆయన్ను జైల్లోనే ఉంచి జాగ్రత్తగా చూసుకునేలా ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.