ఉత్తరాంధ్రాలో ఏముందన్న వైసీపీ మంత్రి...!
ఉత్తరాంధ్రా అంటే వెనకబాటుతనానికి అచ్చమైన నిదర్శనం. దానికి కారణం పాలకుల నిర్లక్ష్యం అని కచ్చితంగా చెప్పాల్సిందే
By: Tupaki Desk | 29 Nov 2023 4:00 AM GMTఉత్తరాంధ్రా అంటే వెనకబాటుతనానికి అచ్చమైన నిదర్శనం. దానికి కారణం పాలకుల నిర్లక్ష్యం అని కచ్చితంగా చెప్పాల్సిందే. వలసల జాబితా తీస్తే ఉత్తరాంధ్రా నుంచే ఎక్కువగా కనిపిస్తాయి. విజయవాడ నుంచి మొదలెడితే అవి దుబాయ్ దాకా పాకుతాయి.
ఎంతో మంది ఉమ్మడి ఏపీని పాలించినా ఉత్తరాంధ్రాకు దిక్కు లేకుండా పోయింది అనే అంటారు. అందుకే ఉత్తరాంధ్రాకు ప్రత్యేక ప్యాకేజీ ని బుందేల్ ఖండ్ తరహాలో ఇవ్వాలని ఆనాడు కేంద్రం నియమించిన కమిటీలు సిఫార్సు చేశాయి. విభజన చట్టంలో వెనకబడిన జిల్లాలకు ఏటా యాభై కోట్లు ఇస్తామన్న హామీ కూడా మూడేళ్ళు తప్ప తరువాత అమలు కాలేదు.
ఇదిలా ఉంటే విశాఖకు రాజధాని ఎందుకు అన్న పాయింట్ మీద వైసీపీ మంత్రి గుడివాడ అమరనాధ్ మాట్లాడుతూ ఉత్తరాంధ్రా అత్యంత వెనకబడిన ప్రాంతం అని కుండబద్ధలు కొట్టినట్లుగా చెప్పేశారు. కేవలం విశాఖ సిటీ తప్ప చెప్పుకోదగిన అభివృద్ధి ఉత్తరాంధ్రాలో ఏమి జరిగింది అని మంత్రి హోదాలోనే ఆయన మాట్లాడటం విశేషం.
ఉత్తరాంధ్రాకు మేలు చేసే ప్రయత్నం వైసీపీ నాలుగున్నరేళ్ల పాలనలో సాగిందని విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల సామాజిక సాధికారిక సభలో గుడివాడ పేర్కొన్నారు దాదాపుగా అయిదు వేల కోట్ల రూపాయలతో భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని వైసీపీ నిర్మిస్తోందని ఇది పూర్తి అయితే ఉత్తరాంధ్రా కూడా అభివృద్ధి పధంలో సాగుతుందని, ఈ ప్రాంతం అంతా మరో శంషాబాద్ గా మారుతుంది అని ఆయన అంటున్నారు.
విశాఖలో రాజధాని వస్తే కనుక మూడు జిల్లాలు ప్రగతి పధంలో సాగుతాయని ప్రజల జీవన ప్రమాణాలు మారుతాయని కూడా ఆయన అంటున్నారు. జగన్ విశాఖలో సొంత ఇల్లు కట్టుకున్నారు అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనడం మీద మరో మంత్రి సీదరి అప్పలరాజు తప్పు పట్టారు. ప్రభుత్వం నిర్మిస్తున్న భవనాలను చూపించి జగన్ ఇల్లు అంటున్నారు అంటే ఆయనకు ఉన్న అవగాహన ఏపాటిదో అర్ధం అవుతుంది అని అప్పలరాజు ఎద్దేవా చేశారు.
ఇవన్నీ పక్కన పెడితే విశాఖ రాజధాని కావాలని జనంలో ఎంత వరకూ ఉంది అన్నది ఒక ప్రశ్నగా ముందుకు వస్తోంది. విశాఖ రాజధాని అంటే జనాలకు ఇష్టమే అదే సమయంలో అభివృద్ధి చేస్తామంటే తీసుకోవడానికి ఎవరికి ఆసక్తి ఉండదు అని అంటున్నారు. అయితే ఆ అభివృద్ధి మాటున తమ జీవితాలకు ఎక్కడ ఇబ్బంది వస్తుందో అన్న భయాలు కూడా ఉన్నాయి. అభివృద్ధిని అందుకునే స్తోమత తమకు కూడా ఉండాలని వారు కోరుకుంటున్నారు.
అదే విధంగా చూస్తే భూ కబ్జాలు దందాలు రౌడీయిజం అంటూ విపక్షాలు చేస్తున్న విమర్శల మీద కూడా వైసీపీ మంత్రులు కచ్చితమైన క్లారిటీ ఇవ్వాలని కూడా కోరుతున్నారు. ఎందుకంటే ఉత్తరాంధ్రా వెనకబడింది అన్నది అందరికీ తెలిసిందే. అభివృద్ధి తప్పకుండా చేయాలి. కానీ విపక్షాలు లేవనెత్తుతున్న ప్రశ్నలకూ జవాబు చెబితే జనాల పూర్తి మద్దతు దక్కుతుంది అని అంటున్నారు.