Begin typing your search above and press return to search.

94 వేల ఓట్ల తేడాతో ఓడిన గుడ్డు మంత్రి ప్రెస్ మీట్ అవసరమా ?

నాటి నుంచి ఆయనకు సోషల్ మీడియాలో గుడ్డు మంత్రి అని పేరు స్థిరపడిపోయింది.

By:  Tupaki Desk   |   7 Jun 2024 8:16 AM GMT
94 వేల ఓట్ల తేడాతో ఓడిన గుడ్డు మంత్రి ప్రెస్ మీట్ అవసరమా ?
X

ఆయనకు కీలక మంత్రిత్వ శాఖలు జగన్ అప్పగించారు. అవి ఐటీ పరిశ్రమలు మౌలిక సదుపాయాల కల్పన వంటివి ఆయన చూశారు. రెండేళ్ల పాటు మంత్రిగా కొనసాగారు. ఏపీకి పరిశ్రమలు ఎన్ని వచ్చాయి అని మీడియా అడిగిన దానికి ఆయన బదులిస్తూ గుడ్డు కధ ఒకటి చెప్పాలి. పొదగాలి గుడ్లు పెట్టాలి అంటూ ఏవేవో అన్నారు. నాటి నుంచి ఆయనకు సోషల్ మీడియాలో గుడ్డు మంత్రి అని పేరు స్థిరపడిపోయింది.

ఆయనే విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్. ఆయన మాటలను ఆయన వైఖరిని చూసిన వారు ఇతడేనా ఐటీ మినిస్టర్ అని అనుకునేవారు. దావోస్ టూర్ కి వెళ్లి చలిగా ఉంది అనడం ఆయనకే సాధ్యమైంది అని ఐటీ ఉద్యోగులు కూడా సెటైర్లు వేసుకున్నారు.

అంతటితో ఆగని ఆయన జనసేనాని పవన్ కళ్యాణ్ కంటే తనకే క్రేజ్ ఎక్కువ అని కూడా ఒకానొక సందర్భంలో బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చేశారు. సినీ సెలిబ్రిటీస్ కంటే నాతోనే ఎక్కువ మంది ఫోటోలు దిగుతారు అని అహంకారంతో కూడిన గర్వం మాటలు చాలానే ఆయన మాట్లాడారు అని ప్రచారంలో ఉన్న విషయాలు.

ఇన్ని కబుర్లు చెప్పిన ఆయన ఇంతకీ ఓడినది ఎలా అంటే అందులోనే రికార్డు కొట్టేశారు. ఏపీలోనే అత్యధిక మెజరిటీతో గాజువాక నుంచి టీడీపీ కూటమి తరఫున పల్లా శ్రీనివాసరావు గెలిచారు. ఆయనకు వచ్చిన మెజారిటీ అక్షరాలా 94 వేల పై చిలుకు మాటే. దంతో ఆయనకు రికార్డు వస్తే ఆయన చేతిలో అంతటి పరాభవం పొందిన ఘనతను గుడ్డు మంత్రి కొట్టేశారు అని సోషల్ మీడియాలో ఒక్కటే సెటైర్లు పడుతున్నాయి.

అలాంటి భారీ ఓటమి తరువాత ఎవరైనా కొన్నాళ్ళు గమ్మున ఉంటారు. కానీ గుడివాడ మాత్రం విశాఖలో ప్రెస్ మీట్ పెట్టి మరోసారి తన నోటికి పనిచెప్పడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన తాను పనిచేసిన శాఖ గురించి మళ్ళీ గొప్పలు చెప్పుకోవడం తాము ఎన్నో పరిశ్రమలు తెచ్చామని చెప్పడం ఇలా బిల్డప్పుల బాబాయ్ గా మారిన గుడ్డు మంత్రి మీద మళ్లీ సోషల్ మీడియా చెడుగుడు ఆడుతోంది.

అసలు ఈయన ప్రెస్ మీట్ అవసరమా అని కూడా అంటోంది. జరిగిన దానికి చేసిన దానికి జనాలు తీర్పు ఇచ్చి ఘాటైన గుంటూరు కారమే పెట్టారు కదా అని అంటున్నారు. కానీ మేమెంతో అభివృద్ధి చేశామని ఇంకా ఆయన చెప్పుకోవడం చూసిన వారు ఓటమి తరువాత అయినా మారవా అని అడుగుతున్నారు.

ప్రజలు తీర్పు ఇచ్చేశాక ఇక చేసుకోవాల్సింది ఆత్మ విమర్శ తప్ప గొప్పలు కానే కాదు అని అంటున్నారు. జనాలకు నచ్చకనే ఓడించారు అంటే తమ తప్పులను వెతుక్కోవడం వాటిని సరిచేసుకోవడం నాయకుల లక్షణం అని అంటున్నారు.

దానిని పక్కన పెట్టి ఓవరాక్షన్ చేశారు మాజీ మంత్రి అని కామెంట్స్ సోషల్ మీడియాలో పెడుతున్నారు. విజయం బరువు ఓటమి పరువు. ఈ రెండింటికీ మధ్య తేడా తెలుసుకుంటేనే రాజకీయ నేతగా ఉంటారు అని అంటారు. మరి గెలిచినపుడు సమరోత్సాహం ఓడినా అదే దూకుడు ఉంటే పనిచేస్తుందా అని కూడా అంటున్నారు. మొత్తానికి గుడ్డు మంత్రి బాగానే దొరికిపోయారు అని అంటున్నారు.