Begin typing your search above and press return to search.

గవర్నర్ బంగ్లాలో మంత్రి గుడివాడకు చేదు అనుభవం!

రాజకీయ అంశాలతో పాటు అన్నీ అంశాల్ని ఆయన మాట్లాడుతూ ఉండేవారు. శనివారం కూడా అదే తీరులో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

By:  Tupaki Desk   |   10 March 2024 4:56 AM GMT
గవర్నర్ బంగ్లాలో మంత్రి గుడివాడకు చేదు అనుభవం!
X

రోటీన్ గా చేసే పనినే మరోసారి చేసే క్రమంలో ఏపీ మంత్రి గుడివాడ అమర్నాధ్ కు చేదు అనుభవం ఎదురైంది. గడిచిన కొన్నేళ్లుగా విశాఖపట్నంలోని గవర్నర్ బంగ్లాలో ఆయన మీడియా సమావేశాల్ని నిర్వహిస్తూ వస్తుంటారు. రాజకీయ అంశాలతో పాటు అన్నీ అంశాల్ని ఆయన మాట్లాడుతూ ఉండేవారు. శనివారం కూడా అదే తీరులో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే.. మీడియా సమావేశాన్ని గవర్నర్ బంగ్లాలో నిర్వహించొద్దంటూ అక్కడి అధికారులు అడ్డుకోవటంతో ఆయన తన మీడియా భేటీ వేదికను మార్చుకున్నారు.

శనివారం టీడీపీ - జనసేన - బీజేపీ కూటమిపై మాట్లాడేందుకు శనివారం సాయంత్రం గవర్నర్ బంగ్లా వేదికగా మీడియా భేటీని ఏర్పాటు చేస్తూ.. ఆ సమాచారాన్ని మీడియా ప్రతినిధులకు అందజేశారు. అయితే.. సమావేశానికి కాస్త ముందుగా గవర్నర్ బంగ్లా అధికారులు రాజకీయ విమర్శలకు వేదికగా వద్దని.. అందుకు అనుమతిని నిరాకరించారు. దీంతో చేసేదేమీ లేక గవర్నర్ బంగ్లా బయట మీడియా భేటీని నిర్వహించారు మంత్రి గుడివాడ అమర్నాధ్.

గతానికి భిన్నంగా ఇటీవల కాలంలో గవర్నర్ బంగ్లా వాడే తీరుపై అధికారులు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. గడిచిన నాలుగున్నరేళ్ల కాలంలో ఎప్పుడూ ఏ భేటీని అడ్డుకోని వారు.. ఎన్నికలు ముంగిట్లోకి వచ్చేసిన వేళలో మాత్రం రోటీన్ కు భిన్నంగా వ్యవహరించటంపై అధికార పార్టీకి చెందిన నేతలకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి.

మొన్నటికి మొన్న తెలుగు అకాడమీ ఛైర్ పర్సన్ గా వ్యవహరిస్తున్న లక్ష్మీ పార్వతి విలేకరుల సమావేశాన్ని అధికారులు అడ్డుకున్నారు. రాజకీయ పరమైన సమావేశాలకు గవర్నర్ బంగ్లా వేదిక కాకూడదన్నది అధికార యంత్రాంగం నిర్ణయంగా చెబుతున్నారు. అధికారులు అడ్డుకోవటంతో లక్ష్మీపార్వతి వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశాన్నినిర్వహించారు. కట్ చేస్తే.. తాజాగా గుడివాడకు కూడా అదే తరహాలో అనుభవం ఎదురు కాగా.. ఆయన మాత్రం బంగ్లా బయటనే మాట్లాడేశారు.