మంత్రి గుడివాడకే జగన్ ఓటు...దాడి ఫ్యామిలీకి ఝలక్....?
ఉమ్మడి విశాఖ జిల్లాలో రాజకీయ కంద్రంగా ఉన్న అనకాపల్లి నుంచి రెండవసారి ఎమ్మెల్యేగా తానే పోటీ చేస్తాను అని యువ మంత్రి గుడివాడ అమరనాధ్ ప్రకటించారు.
By: Tupaki Desk | 24 Aug 2023 12:30 PM GMTఉమ్మడి విశాఖ జిల్లాలో రాజకీయ కంద్రంగా ఉన్న అనకాపల్లి నుంచి రెండవసారి ఎమ్మెల్యేగా తానే పోటీ చేస్తాను అని యువ మంత్రి గుడివాడ అమరనాధ్ ప్రకటించారు. ఆయన తాజాగా అనకాపల్లి పర్యటనలో ఈ విషయం వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో అనకాపల్లి నుంచి పోటీ చేయడమే కాదు భారీ మెజారిటీతో గెలిచి తీరుతాను అని గుడివాడ స్పష్టం చేశారు. దీంతో మంత్రి ఎక్కడ నుంచి పోటీ అన్న చర్చకు తెర పడిపోయింది.
అదే టైం లో ఆయన ఎలమంచిలి నుంచి పోటీ చేస్తారని సాగిన మరో ప్రచారానికి కూడా ఫుల్ స్టాప్ పెట్టేసారు. తాను వేరే నియోజకవర్గానికి వెళ్లడం లేదు, అనకాపల్లిలోనే అభివృద్ధి అంతా చేశాను కాబట్టి మళ్లీ ఇక్కడ నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను అని స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే మంత్రి గుడివాడ అమరనాధ్ నాన్ లోకల్ అని ఆయన వచ్చే ఎన్నికల్లో అనకాపల్లి నుంచి పోటీ చేయరని వైసీపీలోని ఆయన వ్యతిరేకవర్గం గత కొంతకాలంగా ప్రచారం చేస్తూ వస్తోంది. గుడివాడ వేరే నియోజకవర్గాలని చూసుకుంటున్నారు అని కూడా చెబుతూ వచ్చారు. అయితే గుడివాడ మాత్రం అనకాపల్లిలో తన బలాన్ని పెంచుకోవడమే కాకుండా సీనియర్ నేత అయిన దంతులూరి దిలీప్ కుమార్ కి రాష్ట్ర స్థాయిలో నామినేటెడ్ పదవిని కూడా ఇప్పించారు.
అనకాపల్లిలో తన పట్టుకుని పెంచుకుంటూ ఈసారి మళ్ళీ గెలవాలని ప్లాన్స్ లో ఉన్నారు. గుడివాడ కనుక షిఫ్ట్ అయితే అనకాపల్లి సీటు మాజీ మంత్రి దాడి వీరభద్రరావు కుమారుడు దాడి రత్నాకర్ కి దక్కుతుందని ఆయన వర్గం ఆశలు పెట్టుకుంది. 2019లోనే టికెట్ కోసం వైసీపీలో చేరిన దాడి ఫ్యామిలీకి గత నాలుగున్నరేళ్ల కాలంలో ఏ పదవీ దక్కలేదన్న ఆవేదన ఉంది.
దాంతో ఎమ్మెల్యే సీటు విషయంలోనే ఇంతకాలం ఓపిక పట్టారని అంటున్నారు. ఇపుడు ఎటూ సీటు దక్కదని తేలిపోయింది. స్వయంగా మంత్రి తానే మళ్లీ అనకాపల్లి నుంచి పోటీ చేస్తాను అని చెబుతున్న నేపధ్యంలో హై కమాండ్ కూడా ఆయనకే ఓటేసింది అని అంటున్నారు. అనకాపల్లి గవర సామాజికవర్గం ఎక్కువగా ఉంటుంది. ఆలాగే కాపులు కూడా ఎక్కువే.
దాంతో పాటు మంత్రి కూడా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. దాడి ఫ్యామిలీ ఈసారి సహాయ నిరాకరణ చేసినా కూడా గెలిచి చూపించాలని అన్ని ఏర్పాట్లూ చేసుకున్నారు అని అంటున్నారు. మంత్రి వర్సెస్ దాడి అన్నట్లుగా వైసీపీలో సాగుతున్న అంతర్గత పోరు ఇక మీదట బాహాటం అవుతుందా అన్న చర్చ కూడా వస్తోంది. దాడి ఫ్యామిలీ వేరే పార్టీ వైపు చూస్తుందా అన్న చర్చ మొదలైంది.
ఇక చూస్తే దాడి ఫ్యామిలీకి ఆప్షన్లు ఏమి ఉన్నాయన్నది కూడా ఆలోచిస్తున్నారు. జనసేనలోకి రావాలని 2019లో పవన్ కళ్యాణ్ స్వయంగా దాడి ఇంటికి వెళ్లి ఆహ్వానించారు. కానీ నాడు చేరలేదు. ఇపుడు వస్తే తీసుకున్న టికెట్ ఇస్తారా అన్నది సందేహంగా ఉంది. టీడీపీలో ఉంటూ అనేక పదవులు అందుకుని పార్టీ క్లిష్ట సమయంలో ఉన్నపుడు వీడిన దాడిని మళ్లీ ఆ పార్టీ ఆదరిస్తుందా అన్నదే ఇంకో డౌట్.
ఏది ఏమైనా దాడి ఫ్యామిలీకి వైసీపీలో టికెట్ లేదని పక్కాగా క్లారిటీ వచ్చేసింది అని అంటున్నారు. అనకాపల్లిలో ఈసారి వైసీపీ వర్సెస్ టీడీపీ గట్టిగానే పోరు సాగుతుంది అని అంటున్నారు. టీడీపీతో పొత్తులు ఉంటే జనసేన సాయం కూడా వైసీపీకి టఫ్ గా మారుతుంది.
ఇక గత ఎన్నికల్లో సహకరించిన దాడి వర్గం ఈసారి మైనస్ అయితే మంత్రి గుడివాడ ఎలా బయటపడతారు అన్నది చర్చకు వస్తున్న మరో విషయం. అయితే వైసీపీకి సాలిడ్ గా ఓటు బ్యాంక్ ఉందని, గత అయిదేళ్లలో చేసిన సంక్షేమ పధకాలే తమకు శ్రీరామ రక్ష అని మంత్రి వర్గం అంటోంది. ఇక సామాజిక సమీకరణలు తమకు సహకరిస్తాయని కూడా బలంగా నమ్ముతోంది. మొత్తం మీద చూస్తే అనకాపల్లిలో రాజకీయ సమరం ఉత్తరాంధ్రాను ఆకట్టుకునేలా సాగుతుందని అంటున్నారు.