గాజువాక నుంచి మంత్రి గుడివాడ పోటీ....వైసీపీలో చకచకా మార్పులు ....!
దాంతో మంగళగిరి టికెట్ ని బీసీకి ఇవ్వాలని చూస్తున్న వైసీపీ ఇపుడు గాజువాక టికెట్ ని బలమైన సామాజిక నేపధ్యం ఉన్న గుడివాడ అమరనాధ్ కి ఇవ్వాలని చూస్తోంది
By: Tupaki Desk | 11 Dec 2023 12:22 PMవైసీపీలో చకచకా మార్పులు సంభవిస్తున్నాయి. పార్టీ గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలని డిసైడ్ అయింది. దాంతో మంగళగిరి టికెట్ ని బీసీకి ఇవ్వాలని చూస్తున్న వైసీపీ ఇపుడు గాజువాక టికెట్ ని బలమైన సామాజిక నేపధ్యం ఉన్న గుడివాడ అమరనాధ్ కి ఇవ్వాలని చూస్తోంది
గుడివాడ కుటుంబం సొంత నియోజకవర్గం గాజువాక. ఆయన తండ్రి తాతలు కూడా గాజువాకతో కలసి ఉన్న పెందుర్తి నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచారు. గుడివాడకు మాత్రం ఆ చాన్స్ దక్కలేదు. ఆయన అనకాపల్లి వెళ్ళి అక్కడ నుంచే 2014లో ఎంపీగా వైసీపీ తరఫున పోటీ చేసి ఓడారు. 2019లో అనకాపల్లి ఎమ్మెల్యేగా గెలిచారు.
ఇక 2024లో ఆయన అనకాపల్లి నుంచే పోటీకి దిగుతారు అని అంతా అనుకుంటున్నారు. ఆ విధంగా మంత్రిగారి హడావుడి ఉంది. అయితే సడెన్ గా వైసీపీలో చోటు చేసుకున్న కీలక పరిణామాల నేపధ్యంలో మంత్రిని తీసుకొచ్చి గాజువాక వైసీపీ నియోజకవర్గం ఇంచార్జిగా చేశారు. ఇప్పటిదాకా గాజువాక వైసీపీ ఇంచార్జిగా సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కుమారుడు దేవన్ రెడ్డి వ్యవహరిస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో తనకు బదులుగా తన కుమారుడికి టికెట్ ఇవ్వాలని తిప్పల అధినాయకత్వాన్ని కోరుతూ వస్తున్నారు. అయితే తిప్పల కుటుంబం పట్ల జనంలోనే కాదు పార్టీలోనూ వ్యతిరేకత ఉందని అంటున్నారు. దాంతో వైసీపీ హై కమాండ్ తిప్పల అభ్యర్ధనను తిరస్కరించినట్లుగా ఉంది. ఈ నేపథ్యంలో సోమవారం దేవన్ రెడ్డి ఇంచార్జి పదవికి రాజీనామా చేశారు. అంతే క్షణం కూడా ఆలస్యం చేయకుండా వైసీపీ హై కమాండ్ మంత్రి గుడివాడను గాజువాకకు ఇంచార్జిగా చేసింది.
దీంతో వచ్చే ఎన్నికలో గాజువాక నుంచి గుడివాడ పోటీ చేస్తారు అని అంటున్నారు. ఈ నియోజకవర్గం విశాఖ జిల్లాలో కీలకమైనది. ఇక్కడ నుంచి పోటీకి జనసేన టీడీపీ కూడా చూస్తున్నాయి. ఎవరికి టికెట్ దక్కుతుందో తెలియదు. మరో వైపు ఈసారి పొత్తుల వల్ల గాజువాకలో సామాజిక సమీకరణలు మారుతాయని వినిపిస్తోంది. మొత్తం రెండు లక్షల దాకా ఓట్లు ఉన్న గాజువాకలో 2019లో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే ఆయన్ని తిప్పల నాగిరెడ్డి ఓడింది జెయింట్ కిల్లర్ అయ్యారు. మంచి మెజారిటీతో ఆయన గెలిచారు.
అయితే ఈసారి మాత్రం తిప్పల ఫ్యామిలీకి సీటు ఇచ్చి రిస్క్ చేయదలచుకోలేదు వైసీపీ అని అంటున్నారు. అందుకే గుడివాడను అక్కడ పోటీ చేయిస్తున్నారు అని అంటున్నారు. కాపులు ఎక్కువగా ఉన్న గాజువాక నుంచి యువకుడు మంత్రి అయిన గుడివాడ పోటీ చేస్తే విజయావకాశాలు రెట్టింపు ఉంటాయని వైసీపీ భావిస్తోంది. దీంతో వైసీపీ సరైన డెసిషన్ తీసుకుంది అని పార్టీలో మెజారిటీ భావిస్తున్నారు. ఇక అనకాపల్లి ఎమ్మెల్యే టికెట్ కూడా అక్కడ బలంగా ఉన్న గవర సామాజిక వర్గానికి ఇవ్వవచ్చు అని అంటున్నారు. సో వైసీపీ కరెక్ట్ రూట్ లోనే వెళ్తోంది అని అంటున్నారు.