గుడివాడకు ఢిల్లీ దారి...!?
ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన మంత్రి గుడివాడ అమర్నాథ్ కి ఢిల్లీ దారి చూపిస్తారు అని అంటున్నారు. గుడివాడను అనకాపల్లి నుంచి ఎంపీగా వైసీపీ తరఫున నిలబెడతారు అని అంటున్నారు.
By: Tupaki Desk | 30 Jan 2024 2:45 AM GMTఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన మంత్రి గుడివాడ అమర్నాథ్ కి ఢిల్లీ దారి చూపిస్తారు అని అంటున్నారు. గుడివాడను అనకాపల్లి నుంచి ఎంపీగా వైసీపీ తరఫున నిలబెడతారు అని అంటున్నారు. గుడివాడ 2019 ఎన్నికల్లో అనకాపల్లి అసెంబ్లీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆయన మంత్రిగా కూడా అయ్యారు.
ఇపుడు చూస్తే ఆయన సీటులోకి కొత్త ఇంచార్జి వచ్చారు. సాఫ్ట్ వేర్ ఇంజనీరు అయిన మలసాల భరత్ కుమార్ అనే యువకుడికిని అక్కడ నియమించారు. దాదాపుగా ఆయనే వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరఫున అనకాపల్లి ఎమ్మెల్యే అభ్యర్ధి అని అంటున్నారు. కాపు సామాజికవర్గానికి చెందిన భరత్ కుమార్ కి సమీకరణలు కూడా సరిపోతున్నాయి. పైగా అంగబలం అర్ధబలం ఆయనకు నిండుగా ఉన్నాయి.
దాంతో మంత్రి గుడివాడకు సీటు ఎక్కడ అన్నది సందేహంగా మారింది. ఆయనను మొదట చోడవరానికి షిఫ్ట్ చేసి అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కరణం ధర్మశ్రీని అనకాపల్లి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని అనుకున్నారు. అయితే ధర్మశ్రీ ససేమిరా అన్నారు. అంతే కాదు వైసీపీ ఈ ఇద్దరి అభ్యర్ధిత్వం విషయంలో చేసిన సర్వేలలో ధర్మశ్రీకే ఎక్కువ మార్కులు వచ్చాయని అంటున్నారు.
దాంతో గుడివాడను ఎలమంచిలి పెందుర్తి వంటి చోట్ల సెట్ చేద్దామన్నా లోకల్ ఈక్వేషన్స్ తో కుదరకపోవడం ఒకటైతే అనకాపల్లి ఎంపీ సీటు విషయంలో జనసేన టీడీపీ పట్టుదలగా ఉండడం వైసీపీలో ఒకప్పుడు పనిచేసి ఇపుడు జనసేనలో చేరిన మాజీ మంత్రి కొణతాల రామక్రిష్ణ అనకాపల్లి నుంచి ఆ రెండు పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా పోటీలో ఉంటారని ప్రచారం సాగడంతో ఆయనను ఓడించాలంటే గుడివాడ కరెక్ట్ క్యాండిడేట్ అని భావించి పోటీకి దింపబోతున్నారు అని అంటున్నారు.
గుడివాడ అయితేనే కొణతాల మీద నెగ్గుకుని రాగలరని వైసీపీ భావిస్తోంది. పైగా కొణతాల గవర సామాజిక వర్గానికి చెందిన వరు అయితే గుడివాడ కాపు సమాజిక వర్గానికి చెందిన వారు. దాంతో అనకాపల్లి ఎంపీ పరిధిలో కాపులు ఎక్కువ కాబట్టి సామాజిక సమీకరణలు కూడా అనుకూలిస్తాయని భావించి వ్యూహాత్మకంగా గుడివాడను బరిలోకి దింపుతున్నట్లుగా సమాచారం ఉంది.
మంత్రిగా ఉండడం కూడా ఆయనకు ప్లస్ పాయింట్ అవుతుందని, అంగబలం అర్ధబలం కూడా సరిపోతాయని అంటున్నారు. అయితే గుడివాడ మాత్రం ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకే మొగ్గు చూపిస్తున్నారు అని అంటున్నారు. ఆయన పెందుర్తి నుంచి పోటీకి ఆసక్తిని చూపిస్తున్నారు అని అంటున్నారు. కానీ అయిదవ జాబితాలో మాత్రం ఆయన పేరు అనకాపల్లి ఎంపీ అభ్యర్ధిగానే ఉండవచ్చు అని అంటున్నారు. సో గుడివాడ ఇపుడు ఢిల్లె బాట పట్టేందుకు రెడీగా ఉండాలని అంటున్నారు.