కొడాలి నానిపై గట్టి అభ్యర్థిని సెట్ చేసిన చంద్రబాబు!
గత 20 ఏళ్లుగా గుడివాడ ఎమ్మెల్యేగా ఉన్న కొడాని నాని ని ఎలాగైనా ఓడించాలని చంద్రబాబు కృతనిశ్చయంతో ఉన్నారని టాక్.
By: Tupaki Desk | 2 Aug 2023 7:06 AM GMTఏపీ లో అసెంబ్లీ ఎన్నికల కు ఇంకా దాదాపు 8 నెలల సమయం ఉంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో అధికారం లోకి రావడమే లక్ష్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్రాన్ని చుట్టేస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఆయన తనయుడు నారా లోకేశ్ యువగళం పేరుతో చేస్తున్న పాదయాత్ర పల్నాడు జిల్లాలోకి ప్రవేశించింది. ఇంకోవైపు ఎక్కడికక్కడ చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ను ప్రకటిస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగా కృష్ణా జిల్లాలో కీలకమైన గుడివాడ నియోజకవర్గంలో చంద్రబాబు అభ్యర్థిని ఫిక్స్ చేశారని తెలుస్తోంది.
గతం లో టీడీపీ తరఫున గెలిచి ఆ తర్వాత వైసీపీ లోకి ఫిరాయించి తన పై, తన కుమారుడి పై అసభ్య వ్యాఖ్యలు చేస్తున్న కొడాలి నాని ని ఎలాగైనా ఓడించాలని చంద్రబాబు కంకణం కట్టుకున్నారని చెబుతున్నారు. గుడివాడ నుంచి 2004, 2009ల్లో టీడీపీ అభ్యర్థిగా గెలుపొందిన కొడాలి నాని 2014, 2019ల్లో వైసీపీ నుంచి గెలుపొందారు. వచ్చే ఎన్నికల్లోనూ మరోసారి ఆయన వైసీపీ నుంచి బరిలోకి దిగడం ఖాయం.
ఈ నేపథ్యంలో గత 20 ఏళ్లుగా గుడివాడ ఎమ్మెల్యేగా ఉన్న కొడాని నాని ని ఎలాగైనా ఓడించాలని చంద్రబాబు కృతనిశ్చయంతో ఉన్నారని టాక్. ఈ నేపథ్యంలో ఆయన పై టీడీపీ తరఫున పోటీ చేసే అభ్యర్థిని ఫైనల్ చేశారని అంటున్నారు.
అందులోనూ గుడివాడ మొదటి నుంచి టీడీపీ కంచుకోట. టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఇక్కడ నుంచే తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో ఎక్కువసార్లు టీడీపీ అభ్యర్థులే గెలుపొందారు. ఈ నేపథ్యంలో గుడివాడ లో వచ్చే ఎన్నికల్లో టీడీపీ జెండా ను ఎగురవేయాలనే లక్ష్యంతో చంద్రబాబు ఉన్నారు.
ప్రస్తుతం గుడివాడ టీడీపీ ఇంచార్జిగా రావి వెంకటేశ్వరరావు ఉన్నారు. ఈయన గతం లో 1999లో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా పనిచేశారు. టీడీపీ తరఫున గుడివాడ నియోజకవర్గంలో రావి ధీటుగానే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే ఇటీవల కాలం లో వెనిగండ్ల రాము అనే ప్రవాసాంధ్రుడు ఒకరు టీడీపీ తరఫున కార్యక్రమాలు భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు.
ఫౌండేషన్ ఏర్పాటు చేసి సేవా, సహాయ కార్యక్రమాలు చేపడుతున్నారు. టికెట్ కోసం రావి వెంకటేశ్వరరావుతో వెనిగండ్ల రాము పోటీ పడుతున్నారు. ఆర్థిక బలం పుష్కళంగా ఉండటంతో రాముకే చంద్రబాబు టికెట్ ఖరారు చేశార ని చెబుతున్నారు. ఇప్పటికే రాము గుడివాడ నియోజకవర్గంలో చురుగ్గా పర్యటిస్తున్నారు.
ఇప్పటివరకు గుడివాడ లో టీడీపీ తరఫున పోటీ చేసే అభ్యర్థి ఎవరో తెలియక ఆ పార్టీ శ్రేణులు కూడా అయోమయంలో ఉన్నాయని అంటున్నారు. ఇప్పుడు ఎన్నికల ముందు గట్టి అభ్యర్థిని ప్రకటించడం ద్వారా ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ వస్తుందని టీడీపీ అధిష్టానం భావిస్తోంది. వెనిగండ్ల రాము అయితే కొడాలి నానికి గట్టిపోటీ ఇవ్వగలరని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తోంది.