బాలయ్య.. లోకేశ్.. బ్రాహ్మణి.. చంద్రబాబు.. అందరికి ఏసేసిన గుడివాడ
తాజాగా విశాఖలో మాట్లాడిన ఆయన బాబు అండ్ కో మీద తీవ్రమైన విమర్శలు.. ఆరోపణలు చేశారు.
By: Tupaki Desk | 20 Oct 2023 3:47 AM GMTరాజకీయ ప్రత్యర్థులపై చెలరేగిపోయేలా వ్యాఖ్యలు చేయటంలో ఏపీ అధికార పక్షానికి చెందిన కొందరు నేతలకున్న టాలెంట్ మిగిలిన వారికంటే భిన్నం. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై అదే పనిగా విరుచుకుపడుతూ.. ఘాటు విమర్శలకు దిగే ఆయన.. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు మొదలుకొని ఆయన కుమారుడు లోకేశ్.. వియ్యంకుడు బాలక్రిష్ణ.. కోడలు బ్రాహ్మణిలతో సహా ఏ ఒక్కరిని విడిచిపెట్టకుండా విరుచుకుపడిన వైనం ఆసక్తికరంగా మారింది.
చంద్రబాబు జైల్లో ఉన్నాడన్న బాధ ఆయన ఫ్యామిలీలో ఎక్కడా కనిపించడం లేదంటూ తీర్పును ఇచ్చేశారు మంత్రి గుడివాడ ఆమర్నాధ్. తాజాగా విశాఖలో మాట్లాడిన ఆయన బాబు అండ్ కో మీద తీవ్రమైన విమర్శలు.. ఆరోపణలు చేశారు.
లోకేశ్ విహార యాత్రలో ఉన్నాడని.. బాలక్రిష్ణ సినిమా రిలీజ్ సందడిలో ఉంటే.. చంద్రబాబు భార్య.. కోడలు బిజినెస్ లలో బిజీగా ఉన్నట్లుగా అభివర్ణించారు. చంద్రబాబు ఫ్యామిలీ మొత్తం ఇలా ఉంటే.. పార్టీనేతలు.. కార్యకర్తలు మాత్రం విధి లేని పరిస్థితుల్లో రోడ్ల మీదకు వచ్చి నిరసనలు చేసి వెళ్లిపోతున్నట్లుగా వ్యాఖ్యానించారు. తెలుగు తమ్ముళ్ల మొక్కుబడి ఆందోళనలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
ముసలాయన దసరా పండుగను ఈ సారి జైల్లో చేసుకుంటారన్న గుడివాడ అమర్నాథ్.. గడిచిన నాలుగున్నరేళ్లలో ఏ ఒక్క పండుగైనా ఏపీలో చేసుకున్నాడా? అని ప్రశ్నించారు. ఈసారి మాత్రం దసరాను ఏపీలోనే చేసుకుంటారని వ్యంగ్య వ్యాఖ్యలు చేయటం గమనార్హం. అంతేకాదు.. ఈసారి పండక్కి ఆయన రాష్ట్రంలో ఉండటం తనకు ఆనందాన్ని కలిగిస్తుందని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లోనూ జగన్ విజయం సాధించి.. ముఖ్యమంత్రి అవుతారని పేర్కొన్నారు.
చంద్రబాబు కుటుంబం ఎన్ని యాత్రలు చేసినా.. అధికారంలోకి మాత్రం రారన్నారు. జైలుకు వెళ్లే వేళలో చంద్రబాబు వెయిట్ 66 కేజీలు అని.. ఇప్పుడు ఆయన 67 కేజీలుగా పేర్కొన్నారు. ఇంట్లో ఖంటేనే చంద్రబాబును జైల్లోనే బాగా చూసుకుంటున్నట్లుగా వ్యాఖ్యానించారు. చంద్రబాబు తప్పు చేశారు కాబట్టే శిక్ష అనుభవిస్తున్నట్లుగా పేర్కొన్న ఆయన.. కోర్టులు తగిన తీర్పులు ఇస్తాయని పేర్కొన్నారు. గుడివాడ వ్యాఖ్యలకు తెలుగు తమ్ముళ్లు ఎలా రియాక్టు అవుతారో చూడాలి.