Begin typing your search above and press return to search.

తెలుగు రాజకీయాల్లో ఇలాంటి సీన్లు ఎన్నాళ్లైంది?

ఎన్నికల వరకు మాత్రమే రాజకీయం.. ఆ తర్వాత అంతా ప్రజలు.. వారి అవసరాలు తీర్చటం మీదనే ఫోకస్ చేసేవారు.

By:  Tupaki Desk   |   6 May 2024 4:55 AM GMT
తెలుగు రాజకీయాల్లో ఇలాంటి సీన్లు ఎన్నాళ్లైంది?
X

రాజకీయం ఎందుకు? అధికారం కోసం? అంతేనా? అంటే.. అసలు రాజకీయాల్లోకి ఎందుకు రావాలంటే ప్రజలకు సేవ చేయటానికి. చుట్టూ ఉన్న సమాజాన్ని మరింత మెరుగ్గా మార్చేందుకు. అయితే.. అసలు పోయి కొసరు మిగిలినట్లుగా.. రాజకీయాలంటేనే అధికారం.. డబ్బు.. వ్యాపారం అన్నట్లుగా మారిపోయింది. రాజకీయాన్ని ఎప్పుడైతే కార్పొరేట్ గా మార్చేసి.. అంతా వ్యాపారంగా.. పవర్ సెంటర్ గా మార్చేశారో.. అప్పటివరకు ఉన్న రాజకీయ విభేదాలు కాస్తా వ్యక్తిగత ద్వేషాలుగా మారాయి. ఒకప్పుడు రాజకీయ ప్రత్యర్థులు సైతం భుజం భుజం రాసుకుంటూ తిరిగేవారు. ఎన్నికల వరకు మాత్రమే రాజకీయం.. ఆ తర్వాత అంతా ప్రజలు.. వారి అవసరాలు తీర్చటం మీదనే ఫోకస్ చేసేవారు.

మారిన రోజులకు తగ్గట్లు ఇప్పుడు పరిస్థితుల్లో మార్పులు వచ్చేశాయి. ఇద్దరు నేతలు ఎదురుపడితే నవ్వుకుంటూ పలుకరించుకోవటం.. బాగోగుల గురించి మాట్లాడుకోవటం పోయింది. సినిమాల్లో శత్రువుల మాదిరి మాట.. మాట అనుకోవటమే తప్పించి.. అప్యాయతలు అన్నవే లేకుండా పోయింది. రాజకీయ ప్రత్యర్థుల్ని వ్యక్తిగత శత్రువులుగా భావించే పరిస్థితి. ఇలాంటి పరిస్థితి ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటని చెప్పాలి. అలాంటి ఏపీలో ఒక అనూహ్యమైన సీన్ చోటు చేసుకుంది.

ఈ ఘటన గురించి తెలిసిన తర్వాత ఇలానే ఏపీ మొత్తం ఉంటే ఎంత బాగుండన్న భావన వ్యక్తమవుతుంది. నోటికి వచ్చినట్లుగా మాట్లాడటం.. బెదిరింపులకు దిగటం.. బూతులు తిట్టుకోవటానికి భిన్నంగా ఎన్నికల బరిలో ఉన్న రెండు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎదురెదురు పడినప్పుడు చక్కగా నవ్వుకుంటూ మాట్లాడుకోవటం.. అప్యాయంగా ఉండటం అన్నది ఇప్పటి రాజకీయంలో సాధ్యం కాదన్న పరిస్థితి. అందుకు భిన్నంగా వ్యవహరించి చేతల్లో చేసి చూపించారు నరసాపురం ఎంపీ అభ్యర్థులు. తమ ప్రచారంలో భాగంగా పాలకొల్లులో టీడీపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మ.. వైసీపీ ఎంపీ అభ్యర్థి గూడూరి ఉమాబాలలు ఎదురుపడ్డారు.

సోదర భావంతో ఇద్దరు ఆత్మీయంగా పలుకరించుకోవటం ఆసక్తికరంగా మారింది. ఇద్దరు కలిసి ఫోటోలు దిగటమే కాదు.. ఎన్నికల్లో పోటీ అన్నది స్నేహపూర్వకంగానే ఉండాలే తప్పించి.. వ్యక్తిగత శత్రువులు మాదిరి ఉండకూడదన్నట్లుగా వారి తీరు ఉంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈ ఇద్దరు అభ్యర్థులు ఒకరినొకరు ఆత్మీయంగా పలుకరించుకుంటున్న వేళ.. అక్కడకు పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు రావటం.. వారి మధ్య కూడా అంతే ఆత్మీయత వెల్లివిరియటం చూపరుల్ని ఆకర్షించేలా చేసింది. ఇదే తీరులో ఏపీలో ఎన్నికలు జరిగితే ఎంత బాగుండు?