Begin typing your search above and press return to search.

మీ దుంపలు తెగ..చివరకు పెళ్లిళ్లను వదల్లేదు కదరా..!

మోసగాళ్ల మాటలకు 28 జంటలు బోల్తాపడ్డాయి. పెళ్లి చేసుకుందామని ఎంతో సంబరంగా వస్తే ఇలా కావడంపై వారంతా నిరాశ పడ్డారు.

By:  Tupaki Desk   |   23 Feb 2025 6:30 AM GMT
మీ దుంపలు తెగ..చివరకు పెళ్లిళ్లను వదల్లేదు కదరా..!
X

‘‘పెళ్లంటే నూరేళ్లు పంట..పెళ్లిచేయాలంటే పడాలి నానా తంటా..’’ అందుకే కాబోలు ఇల్లు కట్టి చూడు..పెళ్లి చేసి చూడు అని మన పెద్దలు ఎప్పుడో సెలవిచ్చారు. అప్పట్లో పెళ్లి పదహారు రోజులు ఉండేదట. ఆ పదహారు రోజులు బంధువులు, స్నేహితులు అందరూ పెళ్లింట్లోనే ఉండేవారు. అప్పట్లో జనాలకు అంత తీరిక దొరికింది మరి. ఆ తర్వాత తర్వాత ట్రెండ్ మారుకుంటూ వచ్చింది. 16 రోజుల పెళ్లి రెండు రోజులకు వచ్చింది.. ఇప్పుడు కొందరైతే ఒకే రోజు పెళ్లి, రిసెప్షన్ కూడా పెట్టేసుకుంటున్నారు. ఈ కాలంలో పెళ్లి చేసుకోవాలంటే లక్షల రూపాయలు చదివించుకోవాల్సిందే. ధనవంతులైతే కోట్లలోనే ఉంటుంది ఖర్చు..

ఖర్చు సంగతి అటుంచితే పెళ్లి పనులు చేసేందుకు కూడా జనాల దగ్గర టైం ఉండటం లేదు. పెళ్లి సంబంధాలు చూసుకునే తీరిక లేదు. పెళ్లి సంబంధాల కోసం మ్యారేజ్ బ్యూరోలపై ఆధారపడటం.. ఎంగేజ్ మెంట్ నుంచి రిసెప్షన్ అయిపోయే దాక అన్ని పనులు చేసేందుకు ఈవెంట్ ఆర్గనైజేషన్స్ కు అప్పజెప్పుతున్నారు. ఇప్పుడు ఒకటి, రెండు రోజుల పెళ్లి అయిన కూడా ఎలా జరుగుతుందో ఏమో అనే భయమైతే అందరిలోనూ ఉంటోంది.

పెళ్లి పాట్లు తాము పడలేం బాబోయ్..అనే వారికి సామూహిక వివాహాలు చేసే సంస్థలు పుట్టుకొచ్చాయి. కొంత మందికి ఒకే చోట పెళ్లి చేసి..తిండి, తిఖానా అంతా అక్కడే పెట్టి ఖర్చును తగ్గిస్తారన్న మాట. తక్కువ ఖర్చుతో పెళ్లి అయిపోతుంది కదా అని నమ్మితే ఇలాంటి సంస్థ ఒకటి డబ్బులు వసూలు చేసి ఉడాయించిందిన సంఘటన గుజరాత్ లోని రాజ్ కోట్ లో జరిగింది. సామూహిక వివాహాలు చేస్తామని ఒక్కొక్కరి నుంచి రూ.15 వేల చొప్పున వసూలు చేసిన ఓ సంస్థ తీరా ముహూర్త సమయానికి పత్తా లేకుండా పోయింది. ఎన్నో ఆశలతో కల్యాణ వేదిక వద్దకు వచ్చిన కొత్త జంటలు షాక్ అయ్యాయి. నిర్వాహకులకు ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో మోసపోయామని గ్రహించిన జంటలు వెంటనే పోలీసులను ఆశ్రయించారు.

మోసగాళ్ల మాటలకు 28 జంటలు బోల్తాపడ్డాయి. పెళ్లి చేసుకుందామని ఎంతో సంబరంగా వస్తే ఇలా కావడంపై వారంతా నిరాశ పడ్డారు. ఇది గ్రహించిన పోలీసులు దగ్గరుండి అదే వేదికపై పెళ్లిళ్లు జరిపించడం విశేషం. కొత్త జంటలను మోసగించిన వారిపై కేసుపై నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు పోలీసులు.