Begin typing your search above and press return to search.

గుజరాత్ నో...అమరావతి ఎస్... ఇదేదో బాగానే ఉందిగా !

దేశంలో కొన్ని రాష్ట్రాలలో పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు ఉత్సాహం చూపిస్తాయి.

By:  Tupaki Desk   |   24 Aug 2024 7:30 AM GMT
గుజరాత్ నో...అమరావతి ఎస్... ఇదేదో బాగానే ఉందిగా !
X

దేశంలో కొన్ని రాష్ట్రాలలో పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు ఉత్సాహం చూపిస్తాయి. ఆ విషయంలో రాజకీయ లాబీయింగ్ కూడా చేసుకుంటాయి. అధికార ప్రభుత్వాల వెంట పడతాయి. అదే ఏపీ లాంటి చోట్ల అయితే ప్రభుత్వమే పారిశ్రామికవేత్తలను పిలవాల్సి ఉంటుంది. వారి కోసం అన్ని రెడీ చేసి రాయితీలను ఇవ్వాల్సి ఉంటుంది.

అయితే ఏపీ లాంటి వాటికి ఈ రకమైన పరిస్థితి ఎందుకు అంటే పూర్తిగా వ్యవసాయిక రాష్ట్రం. పైగా పారిశ్రామిక వాతావరణం కూడా పెద్దగా ఉండదు. అందుకే పరిశ్రమలు ఈ వైపు చూడాలంటే ప్రభుత్వాలు రంగంలోకి దిగాల్సిందే. ఇదిలా ఉంటే ఇటీవల కాలంలో అమరావతి రాజధానికి కొత్త కళ కనిపిస్తోంది. ప్రతీ రోజూ ఏదో పరిశ్రమ పెట్టుబడులు పెట్టడానికి వస్తోంది.

దాంతో అమరావతి రాజధానికి మంచి బూమింగ్ వస్తోంది. ఇంకా ఒక రూపూ షేపూ రాకుండానే పరిశ్రమలు క్యూ కడుతున్నాయని కూటమి పెద్దలు చెప్పుకునేందుకు కూడా ఆస్కారం ఏర్పడుతోంది. అయితే ఇటీవల కాలంలోనే ఎందుకు ఇలా జరుగుతోంది ఏపీ విభజన జరిగి పదేళ్ళు అయింది. అమరావతి రాజధాని అని ప్రకటించి తొమ్మిదేళ్ళు అయింది. పైగా ప్రకటించిన తరువాత నాలుగేళ్ల పాటు చంద్రబాబు సీఎం గా ఉన్నారు.

మరి ఆనాడు లేని ఈ మోజు ఇపుడే అమరావతి మీద పారిశ్రామికవేత్తలకు ఎందుకు కలిగింది అంటే అక్కడే ఒక బిగ్ స్టోరీ ఉందని అంటున్నారు. అమరావతిలో పెట్టుబడులు పెడితే బోలేడు రాయితీలు లభిస్తాయి. పైగా కొత్త రాష్ట్రం. తాము కోరింది చేయడానికి పాజిటివ్ గా ప్రభుత్వం ఉంది. ఇవన్నీ పెట్టుబడిదారులకు కలసి వచ్చే అంశాలు. అమరావతిని ఫుల్ గా డెవలప్ చేయాలని ప్రభుత్వం గట్టి సంకల్పంతో ఉండడం కూడా మరో కలిసి వచ్చే అంశం.

అయినా సరే ఇప్పటిదాకా అమరావతి వైపు చూడని వారు ఇపుడే తొంగి చూసి వంగి వాలుతున్నారు ఎందుకు అంటే కేంద్రంలోని పెద్దలే ఒక దారి చూపిస్తున్నారు అని అంటున్నరు. కేంద్ర పెద్దలు గుజరాత్ కి సంబంధించిన వారే కావడం విశేషం. అలా గుజరాత్ లో పరిశ్రమలు కొత్తగా పెడతామని చెప్పిన కొన్ని సంస్థలను ఏపీకి వెళ్లమని చెబుతున్నారని అందుకే వారు తరలి వస్తున్నారు అని అంటున్నారు.

ఇక గుజరాత్ లో పారిశ్రామిక పాలసీ కూడా కొందరికి ఇబ్బందిగా ఉందని అంటున్నారు గుజరాత్ లో అయితే కంపెనీలు పెట్టేందుకు ఇచ్చే భూమిలో ఇరవై అయిదు శాతం ఆర్థిక భారం ఆ కంపెనీలు భరించాలిట. ఇక పన్ను రాయితీలు ఏమీ లేవు. అదే అమరావతిలో అయితే భూమి ఫ్రీ. పన్నులలో రాయితీలు భారీగా ఉన్నాయి. అందుకే ఈ వైపు చూస్తున్నారు అని అంటున్నారు. పైగా గుజరాత్ లో కంపెనీలతో రష్ గా ఉంది. అందుకే రాయితీలు పెద్దగా ఇచ్చి వారిని ప్రత్యేకంగా ఆహ్వానం చేయాల్సిన పని లేదు అని అంటున్నారు.

అదే ఏపీకి అయితే అన్ని అవసరాలూ ఉన్నాయి. దీంతో వీటిని చూసిన కేంద్ర పెద్దలే ఈ విధంగా ఏపీకి వెళ్ళండి అని తరుణోపాయం ఆయా పరిశ్రమల పెద్దలకు చెబుతున్నారుట. అది కూడా మామూలుగా జరగడం లేదు. ఏపీ సీఎం చంద్రబాబు విన్నపం మేరకే ఇదంతా చేస్తున్నారుట. ఏపీకి ప్రత్యేకించి నిధులు ఎటూ ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా లేదు. అందువల్ల తమకు పెద్దగా భారం లేకుండా తమ రాష్ట్రం నుంచి కొన్ని పరిశ్రమలను ఇటు మళ్ళించడం ద్వారా కొత్త రాజధానికి ఎంతో కొంత సాయం చేసినట్లు అవుతుందని భావిస్తున్నారుట.

దాంతో ఏపీకి గోద్రేజ్ ఫాల్కాన్ వంటి పరిశ్రమలు వస్తున్నాయి. ఈ పరిశ్రమలకు గుజరాత్ లో ఒప్పందాలు సెట్ కావడం జరగలేదు అందుకే ఇలా దారి మళ్ళాయని అంటున్నారు. ఏది ఏమైనా ఏపీకి ఇపుడు పెట్టుబడులు అవసరం అందుకే గ్రాండ్ వెల్ కం అంటోంది మరి.