Begin typing your search above and press return to search.

కెనడా సరిహద్దులో.. ఆ మంచు కాళరాత్రిలో.. భారతీయ కుటుంబం విషాదాంతం

అలాంటి ఓ గడ్డకట్టే చలి రాత్రి ఓ గుజరాతీ కుటుంబం పాలిట మరణ శాసనమైంది.

By:  Tupaki Desk   |   17 Nov 2024 10:10 AM GMT
కెనడా సరిహద్దులో.. ఆ మంచు కాళరాత్రిలో.. భారతీయ కుటుంబం విషాదాంతం
X

ఉన్నదాంట్లో హాయిగా ఉండాలి.. లేని నాడు కాళ్లు కడుపులో ముడుచుకుని పడుకోవాలి.. ఇదీ సగటు భారతీయులకు పెద్దలు చెప్పిన సూత్రం. అయితే ఆ గుజరాతీ కుటుంబం మాత్రం మరింత ఉన్నతంగా బతకాలనుకుంది.. ఇందులో తప్పేమీ లేదు. కానీ, అక్రమ మార్గంలో వెళ్లడమే వారి ప్రాణాలను బలతీసుకునేంత ప్రమాదంగా మారింది. రెండేళ్ల కిందట జరిగిన ఈ ఘటన అప్పట్లోనే అందరినీ కదిలించింది. మళ్లీ ఇప్పుడు మన ముందుకొస్తోంది. ఇంతకూ నాడు ఏం జరిగిందో తెలుసుకుంటే ఈ చలికాలంలో ఒళ్లు గగుర్పొడుస్తుంది.

ఉన్నంతలో లోటు లేకున్నా..

కెనడా చూసేందుకు పెద్ద దేశమే అయినా.. అందులో చాలావరకు మంచు ప్రభావం ఉంటుంది. అంది ఎంతగానంటే.. శరీరం గడ్డకట్టేంత.. అలాంటి ఓ గడ్డకట్టే చలి రాత్రి ఓ గుజరాతీ కుటుంబం పాలిట మరణ శాసనమైంది. గుజరాత్ లోని డింగుజ అనే గ్రామానికి చెందినవారు జగ్దీశ్ పటేల్, అతడి భార్య వైశాలి బెన్, కుమార్తె విహంగి (11), కుమారుడు ధార్మిక్. జగ్దీశ్, వైశాలి స్కూల్ టీచర్లు. మామూలుగా చూస్తే హాయిగా బతికేయొచ్చు. వారి సంపాదన సరిపోయే స్థాయిలోనే ఉంది. డింగుజలో వారికి రెండంతస్తుల భవనం ఉంది. విలాసవంతం కాకున్నా జీవితానికి ఏ లోటూ లేదు. అయితే, ‘అమెరికా వెళ్లాలి’ అనే కోరికే వారిని కుదురుగా ఉండనీయలేదు. ఇప్పటికే అమెరికా వెళ్లి విలాసవంతంగా గడుపుతున్న తమ ప్రాంత వాసుల జీవితాలను చూసి వారిలా బతకాలనుకున్నారు. దీంతో స్మగ్లర్ల (ఏజెంట్ల)ను సంప్రదించారు.

2022 జనవరి 19.. అమెరికా-కెనడా సరిహద్దు.. మైనస్ 36 డిగ్రీల ఉష్ణోగ్రత.. కెనడా నుంచి అమెరికాలోకి అక్రమంగా వెళ్లేందుకు భార్యాపిల్లలతో జగ్దీశ్ సిద్ధమయ్యారు. వీరే కాక మరో ఏడుగురు భారతీయులూ ఇదే విధంగా ఉన్నారు. అమెరికా సరిహద్దులో వారిని వ్యాన్ డ్రైవర్ స్టీవ్ షాండ్ (50) పికప్ చేసుకోవాలి. ఇందుకోసం జగ్దీశ్ కుటుంబం చిమ్మ చీకల్లో.. విపరీతమైన మంచులో రాత్రంతా ప్రయాణించారు. ఈ 11 మందిలో ఎవరికీ చలిని తట్టుకునే దుస్తులు లేవు. అయితే, అంతా బాగుంటే షాండ్‌ వచ్చేసేవాడే. కానీ అతడి వాహనం మంచులో చిక్కుకుపోయింది. అనుకున్న వేళకు రాలేకపోయాడు. భారతీయులంతా 11 గంటల పాటు మంచులో నడిచారు. అయితే, అది మరణానికి దారి తీసింది. కొన్ని గంటల తర్వాత జగ్దీశ్ న కుటుంబం మృతదేహాలు కెనడా పోలీసులకు లభించాయి.

రేపటి నుంచి విచారణ..

జగ్దీశ్ కుటుంబం మరణంపై సోమవారం నుంచి కెనడాలో విచారణ ప్రారంభం కానుంది.ఈ కేసులో కెనడాకు చెందిన హర్ష్‌ కుమార్‌ పటేల్‌ అలియాస్‌ డర్టీ హ్యారీ (29), అమెరికాకు చెందిన స్టీవ్‌ షాండ్‌ (50) నిందితులు. వీరిపై మానవ అక్రమ రవాణా అభియోగాలు నమోదయ్యాయి. కాగా, డింగుజాలో విదేశాలకు తీసుకెళ్తామంటూ ప్రచార పోస్టర్లు ఉంటాయి. కెనడా, ఆస్ట్రేలియా, అమెరికా తీసుకెళ్తామంటూ ఏజెంట్లు ఊరిస్తుంటారు. వీరికి జగ్దీశ్ కుటుంబం 90 వేల అమెరికన్‌ డాలర్లు చెల్లించారు. ఈ డబ్బు లేకపోతే చాలామంది వ్యవసాయ భూములు అమ్ముతారు. ఇక అక్రమంగా వచ్చినవారు కావడంతో ప్రవాస గుజరాతీలు వీరితో అమెరికాలో తక్కువ డబ్బుతో పనిచేయించుకుటారు. పైగా సొంత సామాజిక వర్గం వారిని తీసుకున్నట్లు చెప్పుకొంటారు. అమెరికా, కెనడా సరిహద్దు ద్వారా మానవ అక్రమ రవాణా ఎప్పటినుంచో జరుగుతోంది. కెనడా సరిహద్దుల్లో సెప్టెంబరు 30 నాటికి 14 వేల మంది భారతీయులను అమెరికా అరెస్టు చేసింది.