వైసీపీకి గుమ్మనూరు జయరాం కండిషన్స్... తెరపైకి డీకేఎస్!
ఈ క్రమంలో ఇప్పటికే నాలుగు జాబితాలను విడుదల చేసిన జగన్ ఐదో జాబితాపై కసరత్తులు చేస్తున్నారు
By: Tupaki Desk | 25 Jan 2024 4:47 AM GMTఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రవ్యాప్తంగా చాలా నియోజకవర్గాల్లో వైసీపీ అధినేత జగన్.. ఇన్ ఛార్జ్ ల మార్పులు చేర్పులు కార్య్యక్రమానికి తెరలేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే నాలుగు జాబితాలను విడుదల చేసిన జగన్ ఐదో జాబితాపై కసరత్తులు చేస్తున్నారు. ఈ సమయంలో టిక్కెట్ దక్కనివారు, ఆశించిన సీటు దక్కనివారు పార్టీకి బై బై చెబుతున్నారు. ఈ సమయంలో గుమ్మనూరు జయరాం పరిస్థితి ఆసక్తికరంగా మారింది.
అవును... సామాజిక సమీకరణలు, సర్వేల ఫలితాలు, నేతల పనితీరు, కార్యకర్తల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని జగన్ ఇన్ ఛార్జ్ ల మార్పులు చేర్పులు చేపడుతున్న సంగతి తెలిసిందే. దీంతో... ఈ నిర్ణయాలతో ఏకీభవించని వారు అలిగినట్లు కనిపించినా.. జగన్ తో ప్రయాణించడానికి నిర్ణయించుకున్నారని తెలుస్తుంటే.. మరికొంతమంది మాత్రం పక్క చూపులు చూస్తున్నారు.
ఈ క్రమంలో ఇప్పటికే పలువురు నేతలు పవన్ కు, ఇంకొంతమంది నేతలు చంద్రబాబుకు టచ్ లోకి వళ్లారు! ఈ నేపథ్యంలో.. ఆలూరు ఎమ్మెల్యేగా ఉన్న జయరాం కు కర్నూలు ఎంపీ టికెట్ ను సీఎం జగన్ కేటాయించారు! ఆయన స్థానంలో ఆలూరు నియోజకవర్గ టికెట్ ను జెడ్పీటీసీ విరూపాక్షకు కేటాయించారు! దీంతో... తాను ఎంపీగా పోటీ చేసే ప్రసక్తే లేదని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఎమ్మెల్యే గానే పోటీ చేస్తానని జయరాం చెబుతున్నారని తెలుస్తుంది.
ఈ సమయంలో గతకొన్ని రోజులుగా ఆయన అజ్ఞాతంలో ఉన్నారని కథనాలొచ్చిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో పార్టీ పెద్దలకు గుమ్మనూరు జయరాం టచ్ లోకి వచ్చారని తెలుస్తుంది. ఈ సందర్భంగా తాను ఎంపిగా పోటీచేయాలంటే... అంటూ ఒక కండిషన్ కూడా వైసీపీ పెద్ద్దల ముందు ఉంచారని కథనాలొస్తున్నాయి.
ఇందులో భాగంగా.. తాను కర్నూలు ఎంపీగా పోటీ చేయాలంటే.. తన కుమారుడు ఈశ్వర్ కి ఆలూరు ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వాలని కోరారని.. అందుకు పెద్దలు అంగీకరిస్తే తాను కర్నూలు ఎంపీగా పోటీ చేసేందుకు రెడీ అని చెప్పారని ప్రచారం జరుగుతుంది. దీంతోఈ... వైసీపీ అధిష్టాణం ఏ నిర్ణయం తీసుకోబోతుంది అనేది ఆసక్తిగా మారింది.
ఇదే సమయంలో... కర్నూలు ఎంపీ, ఆలూరు ఎమ్మెల్యే టిక్కెట్ల విషయంలో గుమ్మనూరు జయరాం పెట్టిన కండిషన్స్ కు అధిష్టాణం అంగీకరించలేదని, అది సాధ్యం కాదని తెగేసి చెప్పిందని.. దీంతో గుమ్మనూరు జయరాం కర్ణాటకకు వెళ్లి, ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ని కలిశారని.. ఆయన ద్వారా కాంగ్రెస్ పార్టీలో చేరికకు ప్రయత్నాలు చేస్తున్నారని ఒక ప్రచారం ఊపందుకుంది!
ఏది ఏమైనా... ఒకటి రెండు రోజుల్లో జయరాం విషయంలో ఒక క్లారిటీ రావొచ్చని అంటున్నారు పరిశీలకులు.