Begin typing your search above and press return to search.

అమెరికాలో మళ్లీ పేలిన గన్‌.. స్కూల్‌ చిన్నారులపై దారుణం!

అమెరికాలో అంతకంతకూ పెరుగుతున్న గన్‌ కల్చర్‌ పై గతంలో పలుమార్లు దేశాధ్యక్షుడు జో బైడెన్‌ కంటతడి కూడా పెట్టుకున్నారు.

By:  Tupaki Desk   |   7 March 2024 6:44 AM GMT
అమెరికాలో మళ్లీ పేలిన గన్‌.. స్కూల్‌ చిన్నారులపై దారుణం!
X

అగ్ర రాజ్యం అమెరికాలో ద్వేషపూరిత నేరాలు, సామూహికంగా కాల్చిచంపడం వంటి ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. గన్‌ కల్చర్‌ సంస్కృతికి చరమగీతం పాడాలని అమెరికా కాంగ్రెస్‌ (పార్లమెంటు) ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఈ దిశగా దిగువ సభ అయిన హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌ లో బిల్లును కూడా పెట్టారు. అమెరికాలో అంతకంతకూ పెరుగుతున్న గన్‌ కల్చర్‌ పై గతంలో పలుమార్లు దేశాధ్యక్షుడు జో బైడెన్‌ కంటతడి కూడా పెట్టుకున్నారు.

అయినా సరే గన్‌ కల్చర్‌ సంస్కృతికి అమెరికాలో ఏమాత్రం అడ్డుకట్ట పడలేదు. కొద్ది రోజుల క్రితం కాలిఫోర్నియాలో ఒక బర్త్‌ డే పార్టీని లక్ష్యంగా చేసుకుని సాయుధ దుండగులు తుపాకీలతో కాల్పులు జరపడంతో నలుగురు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. అలాగే మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనను ఎవరూ మరిచిపోకముందే అమెరికాలో మరోసారి గన్‌ పేలింది.

తాజాగా అమెరికాలోని ప్రముఖ నగరాల్లో ఒకటైన ఫిలడెల్పియాలో దారుణం చోటు చేసుకుంది. స్కూల్‌ బస్సు కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులపై ముగ్గురు సాయుధ దుండగులు తుపాకీలతో కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 8 మంది విద్యార్థులు గాయపడ్డారు.

ఫిలడెల్పియా పోలీసులు తెలిపిన వివరాల మేరకు నగరంలోని బర్హోమ్‌ పరిసరాల్లోని సెప్టా బస్టాప్‌ వద్ద సామూహిక కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఎనిమిది మంది విద్యార్థులు గాయపడ్డారు. సామూహిక కాల్పులకు తెగబడ్డ ముగ్గురు అనుమానితుల వీడియో ఫుటేజీని పోలీసులు విడుదల చేశారు.

అమెరికా కాలమానం ప్రకారం.. బుధవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో రైజింగ్‌ సన్, కాట్మన్‌ అవెన్యూల వద్ద ఈ ఘటన జరిగింది. కాల్పుల ఘటనలో నార్త్‌ ఈస్ట్‌ హైస్కూల్‌ లో చదువుతున్న ఎనిమిది విద్యార్థులకు గాయాలయ్యాయి.

ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం... 2019 మోడల్‌ కు చెందిన ముదురు నీలం రంగు హ్యుందాయ్‌ సొనాటా కారు నుండి బయటకు వచ్చిన నిందితులు బస్సు కోసం వేచి ఉన్న çస్కూలు పిల్లలపై కాల్పులు జరిపారు. ఈ దారుణ ఘటనలో ఒక 16 ఏళ్ల విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. మరో 15, 17 సంవత్సరాల మధ్య వయస్సు గల మరో ఏడుగురు తుపాకీ గాయాలకు గురయ్యారు.

30 సార్లకుపైగా కాల్పులు జరిపిన నిందితులు తర్వాత ఘటనా స్థలం నుంచి చెల్టెన్‌ హామ్‌ టౌన్‌ షిప్‌ వైపు పారిపోయారు. స్కూలు బస్సుతోపాటు మరో రెండు బస్సులపైన కూడా కాల్పులు జరిపారు. అయితే వాటిలో ఉద్యోగులు, ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో ఎవరికీ గాయాలు కాలేదు. నిందితుల సమాచారం ఎవరికైనా తెలిస్తే పోలీసులను సంప్రదించాలని అధికారులు కోరారు.

కాగా వారంలోపు ఇలాంటి ఘటనలు జరగడం ఇది నాలుగోసారి కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో పోలీసులు భద్రతను పెంచాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, తుపాకీ హింసకు వ్యతిరేకంగా కమ్యూనిటీలు చర్యలు చేపట్టాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.