Begin typing your search above and press return to search.

వీడియో : ట్రంప్ పై కాల్పులు.. సేఫ్ అంటున్న వైద్యులు!

భారతకాలమానం ప్రకారం ఉదయం ఆరున్నర గంటల వేళలో ఆయనపై అమెరికాలోని పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో కాల్పులు జరిగాయి.

By:  Tupaki Desk   |   14 July 2024 3:55 AM GMT
వీడియో : ట్రంప్ పై కాల్పులు.. సేఫ్ అంటున్న వైద్యులు!
X

షాకింగ్ ఉదంతం ఒకటి చోటు చేసుకుంది. అమెరికా అధ్యక్ష పదవికి జరుగుతున్న ఎన్నికల్లో భాగంగా అధికార.. విపక్ష పార్టీల అధ్యక్ష అభ్యర్థులు జోరుగా ఎన్నికల ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. అమెరికా మాజీ అధ్యక్షుడు.. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ మీద తాజాగా కాల్పులు జరిగాయి. భారతకాలమానం ప్రకారం ఉదయం ఆరున్నర గంటల వేళలో ఆయనపై అమెరికాలోని పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో కాల్పులు జరిగాయి.

ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన వేదిక మీద నుంచి ట్రంప్ మాట్లాడుతున్న వేళ.. హటాత్తుగా కాల్పుల శబ్ధం వినిపించటం.. ఆ వెంటనే చెవి పక్కన చేయి పెట్టుకున్న ట్రంప్.. వెంటనే కిందకు వంగారు. మరుక్షణంలో ఆయన చుట్టూ ఉన్న భద్రతా సిబ్బంది స్పందించారు. ఆయనకు రక్షణగా నిలిచారు. మొదట కాల్పుల మోత విన్న తర్వాత దాదాపు ఆరేడుసార్లు కాల్పుల మోత వినిపించింది. దీంతో చుట్టుపక్కల వారు హాహాకారాలు చేశారు.

ఈ ఉదంతంలో ర్యాలీకి హాజరైన ఒకరు మరణించగా.. కాల్పులు జరిపిన దుండగుడ్ని భద్రతా సిబ్బంది హతమార్చినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనలో గాయపడిన ట్రంప్ ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. వేదికపై నిలబడి మాట్లాడుతున్న ట్రంప్ పై కాల్పులు జరిపిన ఒకటిన్నర నిమిషం వ్యవధిలోనే ఆయన్ను వాహనంలోకి ఎక్కించి.. ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటున్న ట్రంప్ సురక్షితంగానే ఉన్నట్లు అక్కడి వైద్యులు ప్రకటించారు. ఈ కాల్పుల్లో చెవి వెనుక గాయమైనట్లుగాచెబుతున్నారు. కిందకు వంగి పైకి లేచిన వేళలో ఆయన ముఖానికి రక్తం అంటుకుంది. కాల్పుల్లో గాయపడిన ట్రంప్ క్షేమంగా ఉన్నట్లు ప్రకటన వెలువడింది. దీంతో.. ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

ఈ కాల్పులపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నిమిషాల వ్యవధిలో స్పందించారు. కీలక ట్వీట్ చేశారు. ట్రంప్ పై దాడిని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్రంగా ఖండించారు. కాల్పుల ఘటనపై భద్రతాఏజెన్సీల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నట్లుగా పేర్కొన్నారు. అమెరికాలో హింసకు తావు లేదన్న ఆయన.. తాను.. ట్రంప్ కుటుంబ సభ్యులు ర్యాలీలో ఉన్న ప్రజలంతా క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. కాల్పుల ఘటనను ఖండించేందుకు ఒక జాతిగా అమెరికన్లు మొత్తం ఏకం కావాలన్న జోబైడెన్ ఆకాంక్షించారు.

మరోవైపు ట్రంప్ పై జరిగిన కాల్పుల ఘటనను అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఖండించారు. గాయపడిన ట్రంప్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ ఘటనలో తక్షణం స్పందించిన యూఎస్ సీక్రెట్ సర్వీస్.. లోకల్ అథారిటీస్ ను ఆమె అభినందించారు. ట్రంప్ పై కాల్పుల ఘటనపై పలువురు దేశాధినేతలు ఖండించారు.