Begin typing your search above and press return to search.

టీవీ ఛానెల్‌ లైవ్‌ స్టూడియోలో తుపాకులు... వీడియో వైరల్!

అవును... ఈక్వెడార్‌ రాజధాని గ్వయకిల్‌ లో సాయుధులైన కొందరు దుండగులు టీసీ టీవీ ఛానెల్‌ లైవ్‌ స్టూడియోలోకి ప్రవేశించి తీవ్ర కలకలం సృష్టించారు

By:  Tupaki Desk   |   10 Jan 2024 6:15 AM GMT
టీవీ ఛానెల్‌  లైవ్‌  స్టూడియోలో తుపాకులు... వీడియో వైరల్!
X

వార్తలకు స్వాగతం, ఫలానా టీవీలో వార్తలు చదువుతుంది... అని తన పేరు చెప్పుకుని ఒక న్యూస్ ప్రజెంటర్ సీరియస్ గా వార్తలు చదివేస్తున్నప్పుడు.. సడన్ గా తుపాకీ చేతపట్టిన వ్యక్తి లోపలికి వచ్చి తలపై ఎక్కుపెడితే ఎలా ఉంటుంది..? పైగా ఆ సన్నివేశం ఎటువంటి అవాంతరం లేకుండా ప్రత్యక్ష ప్రసారం అవుతుంటే చూసేవారికి ఏమనిపిస్తుంది..? ఈ రెండు అనుభవాలనూ ఈక్వెడార్ లోని టీసీ టీవీ న్యూస్ ప్రజెంటర్, కెమెరామెన్స్, ఆ ఛానల్ లోని ఇతర ఉద్యోగులు, ప్రేక్షకులు చవిచూశారు. ఇప్పుడు ఈ ఇష్యూ వైరల్ గా మారింది.

అవును... ఈక్వెడార్‌ రాజధాని గ్వయకిల్‌ లో సాయుధులైన కొందరు దుండగులు టీసీ టీవీ ఛానెల్‌ లైవ్‌ స్టూడియోలోకి ప్రవేశించి తీవ్ర కలకలం సృష్టించారు. ఈ క్రమంలో మాస్క్‌ లు ధరించి.. తుపాకులు, డైనమైట్‌ లతో ఎంటరైన ఈ దుండగులు వార్తలు చదువుతున్న వ్యక్తి సహా అక్కడ ఉన్న ఉద్యోగులను బెదిరించారు. ఈ సందర్భంగా వారిని స్టూడియోలో నేలపై కూర్చోబెట్టి తలపై తుపాకీ ఎక్కుపెట్టారు. ఈ సన్నివేశం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది.

ఉద్యోగులను నేలపై కుర్చోబెట్టిన దుండగులు... తమ వద్ద బాంబులు ఉన్నాయని, పోలీసులెవరూ ఇక్కడికి రారని బెదిరించడం మొదలుపెట్టారు. ఇదంతా లైవ్ లో వస్తుంది.. తుపాకీ శబ్దాలు సైతం వినిపించాయి. అయితే ఈక్వెడార్‌ లో గత కొన్ని రోజులుగా వరుసగా ఈ తరహా దాడులు జరుగుతున్నాయి. ఈ సమయంలో ఈ తాజా సంఘటనపై పోలీసులు స్పందించారు.

ఇందులో భాగంగా... తాజా ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకూ 13 మంది నిందితులను అదుపులోకి తీసుకొని, ఉగ్రవాద చర్యల కింద కేసు నమోదు చేశామని తెలిపారు. అయితే.. ఈ దాడి వెనుక ఎవరున్నారనే విషయాన్ని మాత్రం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

ఈ షాకింగ్ సంఘటన షాక్ నుంచి తేరుకున్న అనంతరం టీసీ టీవీ ఛానెల్‌ అధిపతి మాన్రిక్ స్పందించారు. ఇందులో భాగంగా... దుండగులు కార్యాలయంలోకి వచ్చినప్పుడు తాను కంట్రోల్‌ రూంలో ఉన్నట్లు తెలిపిన ఆయన... ఆ సమయంలో తనవద్దకు కూడా ఒకడు వచ్చి తలపై తుపాకీ గురిపెట్టి, నేలపై కూర్చోవాలని బెదిరించాడని తెలిపారు.

ఆ సంఘటనకు సంబంధించి తానింకా షాక్‌ లోనే ఉన్నట్లు చెబుతున్న మాన్రిక్... ఈ దేశాన్ని విడిచి ఎక్కడికైనా దూరంగా వెళ్లిపోవాలనిపిస్తోందని అన్నారు. ఇలా స్టూడియోలో జరిగిన దారుణమంతా సుమారు 15 నిమిషాల పాటు ప్రత్యక్ష ప్రసారమైందని తెలిపారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో దేశాధ్యక్షుడు డేనియల్ నోబోవా అత్యవసర పరిస్థితి విధించారు.

కాగా... ఈక్వెడార్‌ లో గత కొన్ని రోజులుగా వరుసగా ఈ తరహా దాడులు జరుగుతున్నాయి. ఈ దాడుల్లో కొందరు పోలీసు ఉన్నతాధికారులు సైతం అపహరణకు గురయిన పరిస్థితి. అయితే ఇటీవల ఇద్దరు డ్రగ్‌ గ్యాంగ్‌ స్టర్లు జైళ్ల నుంచి తప్పించుకున్న తర్వాతే దేశంలో వరుసగా ఇలాంటి హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయని పోలీసులు క్లారిటీకి వస్తున్నారని తెలుస్తుంది