వైసీపీకి మరో షాక్.. ‘గుంటూరు’ మిస్
దీంతో మున్సిపల్ కార్పొరేషన్లలో ఇంకో ఏడాది పదవీకాలం ఉన్నా, మేయర్లు తప్పుకోవాల్సివస్తోందని అంటున్నారు. దీనికి తాజా ఉదాహరణ గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు అని చెబుతున్నారు.
By: Tupaki Desk | 16 March 2025 2:38 PM ISTఏపీలో ప్రతిపక్ష వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. ప్రధానంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ నేతల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లు అవుతోంది. స్థానిక సంస్థల్లో అధికారంలో కొనసాగుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో పదువులు ఉన్నా వైసీపీ నేతలు ఉత్సవ విగ్రహాల్లా మిగిలిపోతున్నారు. దీంతో పవర్ లేని పోస్టులు ఎందుకంటూ స్వయంగా తప్పుకుంటున్నారు. కూటమి పార్టీల పక్కా స్కెచ్ తో పొమ్మనలేక పొగబెడుతున్నాయని కూడా అంటున్నారు. దీంతో మున్సిపల్ కార్పొరేషన్లలో ఇంకో ఏడాది పదవీకాలం ఉన్నా, మేయర్లు తప్పుకోవాల్సివస్తోందని అంటున్నారు. దీనికి తాజా ఉదాహరణ గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు అని చెబుతున్నారు.
నాలుగేళ్ల క్రితం జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీతో మేయర్ గా బాధ్యతలు స్వీకరించిన కావటి మనోహర్ నాయుడు తాజాగా తన పదవికి రాజీనామా చేశారు. అంతేకాకుండా వైసీపీని త్వరలో వీడుతానని ప్రకటించారు. ప్రస్తుతానికి తన రాజీనామాను కలెక్టరుకు పంపినా, పార్టీకి మాత్రం ఇంకా రాజీనామా చేయలేదు. మేయర్ రాజీనామాను కలెక్టర్ ఆమోదించిన తర్వాత పార్టీకి రాజీనామా చేస్తారని ఆయన కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి.
గత ఏడాది కూటమి అధికారంలోకి వచ్చాక గుంటూరు రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. టెక్నికల్ గా వైసీపీకి బలం ఉన్నప్పటికీ ఎక్కువ మంది కార్పొరేటర్లు టీడీపీకి మద్దతు ప్రకటించారు. దీంతో ఇటీవల నిర్వహించిన స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులే గెలిచారు. అదేవిధంగా మేయర్ మనోహర్ నాయుడి మాటకు ఏ మాత్రం విలువ లేకుండా చేస్తున్నారని అంటున్నారు. మేయర్ ఆదేశాలను కమిషనర్ ఎంతమాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. మరోవైపు మేయర్ డ్రైవర్ ను తప్పించడంతోపాటు ఆయనకు తెలియకుండా స్టాండింగ్ కౌన్సిల్ సమావేశాలు నిర్వహించి అవమానిస్తున్నారని ఆవేదనతో మనోహర్ నాయుడు రాజీనామా చేసేశారు.
ఇంకోఏడాది పదవీకాలం ఉన్నా, మేయర్ పీఠంపై కూర్చొని అవమానాలు భరించేకన్నా తప్పుకుని హాయిగా ఉండటమే మేలన్న ఆలోచనతో కావటి తన పదవికి రాజీనామా చేశారంటున్నారు. వాస్తవానికి ప్రస్తుతం టీడీపీలోకి జంప్ చేసిన కార్పొరేటర్ల బలంతో మేయర్ పై అవిశ్వాసం పెట్టి ఆయనను పదవి నుంచి దించే అవకాశం టీడీపీకి ఉందని చెబుతున్నారు. కానీ, ఆ పార్టీ మేయర్ పై అవిశ్వాసం పెట్టకుండా, ఆయనే తప్పుకునేలా స్కెచ్ వేసిందని అంటున్నారు. పొమ్మనలేక పొగబెట్టే విధంగా మేయర్ మాటకు విలువ లేకుండా చేయడం, ఆయనకు సమాచారం ఇవ్వకుండా కార్పొరేషన్ వ్యవహారాలు సాగిపోవడంతో మేయర్ ను అవమానించినట్లైందని అంటున్నారు. దీంతో అవమానాలు భరించలేక మేయర్ స్వచ్ఛందంగా తప్పుకున్నారని ప్రచారం జరుగుతోంది.
కాగా, కమ్మ సామాజికవర్గానికి చెందిన మేయర్ కావటి మనోహర్ నాయుడు వైసీపీపైనా అసంతృప్తిగా ఉన్నారని చెబుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనను చిలకలూరిపేట నుంచి పోటీ చేయించారు. ఆ ఎన్నికల్లో సుమారు 77 వేల ఓట్లు తెచ్చుకున్న కావటి, ఎన్నికల అనంతరం ఇన్చార్జిగా కొనసాగాలని భావించారు. అయితే ఎన్నికల అనంతరం మాజీ మంత్రి విడదల రజినికి తిరిగి చిలకలూరిపేట సమన్వయకర్త బాధ్యతలు అప్పగించడం కూడా కావటి జీర్ణించుకోలేకపోతున్నారని అంటున్నారు. తనకు ఆశ పెట్టడమే కాకుండా, గత ఎన్నికల్లో పోటీకి దించి ఆర్థికంగా నష్టపోయేలా చేశారని పార్టీపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు చెబుతున్నారు. దీంతోనే మేయర్ పదవికి రాజీనామా చేయడంతోపాటు పార్టీ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నారని మనోహర్ నాయుడు అనుచరులు చెబుతున్నారు. మేయర్ రాజీనామాతో గుంటూరు కార్పొరేషన్ కూటమి చేతికి చిక్కినట్లైనని అభిప్రాయం వ్యక్తమవుతోంది.