రసవత్తరంగా గుంటూరు అర్బన్ పాలిటిక్స్, మేయర్ ను లెక్కచేయని కమిషనర్
గుంటూరు నగరపాలక సంస్థలో కమిషనర్ నిధులు దుర్వినియోగానికి పాల్పడ్డారని మేయర్ కావటి మనోహర్ నాయుడు ఆరోపిస్తున్నారు.
By: Tupaki Desk | 23 Jan 2025 1:15 PM GMTగుంటూరు నగర పాలక సంస్థలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. మేయర్ కావటి మనోహర్ నాయుడు, కమిషనర్ పులి శ్రీనివాస్ మధ్య ఆధిపత్య పోరాటం పతాకస్థాయికి చేరుకుంది. గతంలో కౌన్సిల్ సమావేశం నుంచి వాకౌట్ చేసిన కమిషనర్ పై తీవ్ర విమర్శలు గుప్పించిన మేయర్ మనోహర్ నాయుడు తాజాగా రూ. 9 కోట్ల వరద సహాయ నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపణలు గుప్పించారు. ఆరోపణలకు తగిన సాక్ష్యాధారాలు తన వద్ద ఉన్నాయని చెబుతున్న మేయర్ దమ్ముంటే చర్చకు రమ్మని కమిషనర్ కు సవాల్ విసరడం రాజకీయంగా హీట్ పుట్టిస్తుంది.
గుంటూరు నగరపాలక సంస్థలో కమిషనర్ నిధులు దుర్వినియోగానికి పాల్పడ్డారని మేయర్ కావటి మనోహర్ నాయుడు ఆరోపిస్తున్నారు. బుడమేర వరద సాయంలో కమిషనర్ ఖర్చుపెట్టిన రూ.9.23 కోట్లకు లెక్కలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. కమిషనర్ అవినీతికి పాల్పడలేదంటే ఈ అంశంపై తనకు చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఇందుకోసం గురువారం మేయర్ కార్యాలయంలో ఉదయం 11 నుంచి 2 గంటల వరకు వేచిచూశారు. అయితే మేయర్ విసిరిన సవాల్ ను కమిషనర్ అసలు లెక్కచేయలేదు. మేయర్ తన కార్యాలయానికి రమ్మని పిలిచినా వెళ్లలేదు. దీంతో నగరపాలక సంస్థలో రాజకీయం వాడివేడిగా మారింది.
కమిషనర్ పులి శ్రీనివాస్ అవినీతిపరుడని ఆరోపిస్తూ మేయర్ తోపాటు కార్పొరేటర్లు రాష్ట్ర ముఖ్యమంత్రి, మున్సిపల్ మంత్రితోపాటు పురపాలక శాఖ ఉన్నతాధికారులకు లేఖల ద్వారా ఫిర్యాదులు పంపారు. అయితే తాను అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే తన ఐఎఎస్ ఉద్యోగాన్ని వదలుకుంటానని కమిషనర్ ప్రకటించారు. గుంటూరు నగరపాలక సంస్థలో వైసీపీకి పూర్తి మెజార్టీ ఉంది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కమిషనర్ స్వతంత్రంగా వ్యవహరిస్తుండటంతో వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో కమిషనర్ ను టార్గెట్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మేయర్ తోపాటు కార్పొరేటర్లు ముప్పేట దాడి చేయడంతో కమిషనర్ ఒంటరి అయినట్లు చెబుతున్నారు. అయితే ప్రభుత్వం కమిషనర్ ను వెనకేసుకు వస్తుండటంతో ఆయన స్వేచ్ఛగా పనిచేయగలుగుతున్నారని వాదన వినిపిస్తోంది.