Begin typing your search above and press return to search.

నీరు.. నీరు.. రైతు కంట నీరు.. చూడరెవ్వరూ!

గిట్టుబాటు ధరలు లభించకపోవడంతో వారి పరిస్థితి దయనీయంగా మారింది.

By:  Tupaki Desk   |   19 Jun 2024 10:15 AM GMT
నీరు.. నీరు.. రైతు కంట నీరు.. చూడరెవ్వరూ!
X

అటు అతివృష్టి అయినా, ఇటు అనావృష్టి అయినా ముందుగా నష్టపోయేది రైతులే. ఆరుగాలం ఎండనక, రేయినక కష్టపడితే కానీ చివరకు పంట చేతికి రాదు. అన్నీ బాగుండి, వాతావరణం అనుకూలించి పంట చేతికొచ్చినా మార్కెట్‌ లో సరయినా గిట్టుబాటు ధర అందకపోతే అన్నదాతల కడగండ్లు అన్నీఇన్నీకావు.

ఇప్పుడు మిర్చి పండించే రైతుల పరిస్థితి ఇలాగే ఉంది. గిట్టుబాటు ధరలు లభించకపోవడంతో వారి పరిస్థితి దయనీయంగా మారింది. పంటకు పెట్టిన పెట్టుబడి కూడా రాని పరిస్థితులు నెలకొన్నాయని మిర్చి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గుంటూరు జిల్లా మిర్చి పంటకు పెట్టింది పేరు. మిర్చి ఉత్పత్తిలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానంలో ఉంది. గుంటూరు మిర్చి యార్డు దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అతిపెద్దది. ప్రస్తుతం ఇక్కడ మిర్చి ధరలు భారీగా పడిపోయాయని రైతులు చెబుతున్నారు.

గత ఏడాది మేలో క్వింటాల్‌ మిర్చి కనీస ధర రూ.9 వేలు పలికింది. గరిష్ట ధర రూ.26,500 వరకు చేరకుంది. అయితే ఈ ఏడాది ధరలు పడిపోయాయి. క్వింటాల్‌ కనీస ధర రూ.8 వేలకు పడిపోయింది. అలాగే గరిష్ట ధర 20,700కి పతనమైంది.

మిర్చిలో మంచి రకంగా పేరున్న తేజ రకానికి మాత్రమే క్వింటాల్‌ రూ.19,500 ధర పలుకుతోందని చెబుతున్నారు. మిగిలిన అన్ని రకాల మిర్చి ధరలు పడిపోయాయని చెబుతున్నారు. ఇంకా ఇతర రాష్ట్రాలకు, దేశాలకు ఎగుమతులు ప్రారంభం కాకపోవడంతో ఎక్కడికక్కడ మిర్చి యార్డులో నిల్వలు పేరుకుపోయాయి. 75 లక్షల మిర్చి బస్తాలు ఇలా పేరుకుపోవడం గమనార్హం.

దీంతో ధరలు ఎప్పుడు పెరుగుతాయో, ఎగుమతులు ఎప్పుడు ప్రారంభమవుతాయో తెలియక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో ఖరీప్‌ సీజన్‌ ప్రారంభమైంది. వర్షాలు కూడా మొదలయ్యాయి. దీంతో సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. అయితే వారిని పెట్టుబడి కొరత వేధిస్తోంది. ఇప్పటికే పండించిన పంట ఇంకా అమ్ముడుకాకపోవడం, మళ్లీ సాగు చేయాల్సిన సీజన్‌ వచ్చేయడంతో రైతులు బయట ప్రైవేటు వ్యక్తుల వద్ద అప్పులు చేయక తప్పడం లేదు.

కాగా మన దేశం నుంచి సుమారు 20 దేశాలకు మిర్చి ఎగుమతులు జరుగుతున్నాయి. 2022–23 వార్షిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో రూ.10,440 కోట్ల విలువైన మిర్చి విదేశాలకు ఎగుమతైంది. దీంతో రైతులు మంచి లాభాలు కళ్లజూశారు. ఈ నేపథ్యంలో గత రెండేళ్లుగా మిర్చిని పెద్ద ఎత్తున సాగు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ధరలు పతనమవ్వడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.