గుంటూరు పశ్చిమలో వార్ వన్ సైడ్ అంటుంది ఇందుకేనా?
ఏపీలో సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి నేటితో గడువు ముగియనుంది. సోమవారం ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభం కాబోతుంది
By: Tupaki Desk | 11 May 2024 5:00 AM GMTఏపీలో సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి నేటితో గడువు ముగియనుంది. సోమవారం ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభం కాబోతుంది. ఈ సమయంలో.. గుంటూరు పశ్చిమలో రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి! ఇందులో భాగంగా... ఒక్కసారిగా వార్ వన్ సైడ్ అయ్యిందనే కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం. దీంతో... ఇంత సీరియస్ ఎలక్షన్స్ లో ఇలా ఎలా వదిలేశారనే చర్చ తెరపైకి వచ్చింది.. అందుకు గల పలు కారణాలపైనా చర్చ జరుగుతుంది!
అవును... ఈ ఎన్నికలు అటు వైసీపీ, ఇటు టీడీపీకి అత్యంత ప్రతిష్టాత్మకమైనవనేది తెలిసిన విషయమే. ఈ ఎన్నికల ఫలితాల అనంతరం ఏపీ రాజకీయాల్లో అనూహ్యమార్పులు చోటుచేసుకుంటాయని చెబుతున్నారు. ఈ సమయంలో గుంటూరు వెస్ట్ లో వైసీపీ అభ్యర్థి మంత్రి విడదల రజనీ పూర్తి ధీమాగా ఉన్నట్లు తెలుస్తుంది! జగనన్న సంక్షేమ పథకాలే తమని గెలిపిస్తాయని ఆమె అంటున్నారు. గుంటూరు ఆడపడచుగా భావించి గెలిపించమని కోరుతున్నారు.
వాస్తవానికి... ఆరు నెలల క్రితమే చిలకలూరిపేట నుంచి గుంటూరుకు మకాం మార్చారు విడదల రజనీ. ఈ నేపథ్యంలోనే స్థానికంగా కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. కొన్ని రోజుల క్రితం ప్రత్యర్థి మూకలు ఆ కార్యాలయంపై రాళ్లు విసరడం.. అది కాస్తా పెద్ద రచ్చ అవ్వడం.. అది కూడా విడదల రజనీకి ప్లస్ అవ్వడం తెలిసిందే. ధైర్యంగా పోటీ చేసి గెలవలేక రాళ్లు విసురుతారా? అని ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరోవైపు ప్రచారంలో కూడా విడదల రజనీ తనదైన దూకుడు కొనసాగిస్తున్నారని అంటున్నారు. చేసింది చెబుతూ.. చేయగలిగేవి మాత్రమే హామీ ఇస్తూ.. అరచేతిలో వైకుంఠం చూపించకుండా.. సీఎం జగన్ మార్గంలోనే ప్రజలకు చెబుతున్నారని అంటున్నారు. నిజాయితీగా.. పేద, మధ్య తరగతి ప్రజల ప్రయోజనాలే పరమావధిగా ప్రజాసేవ చేస్తామని అంటున్నారు.
ఆమె సంగతి అలా ఉంటే... తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గళ్లా మాధవి అభ్యర్థిత్వాన్ని సరిగ్గా 60 రోజుల ముందు ప్రకటించారు చంద్రబాబు. దీంతో ఆ నిర్ణయం ఆమెకు పెద్ద మైనస్ గా మారిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. దానికి తోడు మండుతున్న ఎండల కారణంగానో ఏమో కానీ.. కేవలం సాయంత్రం సమయంలోనే ప్రచారానికి వెళ్లడంతో ఇప్పటికీ పలు ప్రాంతాలు కవరవ్వలేదని చెబుతున్నారు!
దీనికి తోడు కూటమి నేతలు అవుట్ ఫోకస్ లోకి వెళ్లారనే కామెంట్లు వినిపిస్తున్నాయి! ముఖ్యంగా గుంటూరు పశ్చిమ సీటు ఆశించిన జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస యాదవ్ సైలంట్ అయిపోయారని.. ప్రస్తుతం ఆయన బయటకు రావడం లేదని.. జనసేన కార్యకర్తలను ఒకచోటుకి పిలవడం, వారితో మీటింగులు పెట్టడం వంటి కార్యక్రమాలేమీ చేసినట్లు లేరని చెప్పుకుంటున్నారు.
మరోవైపు బీజేపీ నేత, జాతీయ స్థాయిలో పలుకుబడి ఉన్న వల్లూరి జయప్రకాష్ నారాయణ ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న పరిస్థితి! ఆయనకి జాతీయ స్థాయి నాయకులు జేపీ నడ్డాలాంటి కేంద్ర పెద్దలతో మంచి సంబంధాలున్నాయి. దీంతో... ఆయన అక్కడే ప్రధనంగా ఉంటున్నారని చెబుతున్నారు. ఇలాంటి పలు కారణాలతో గుంటూరు పశ్చిమలో వార్ వన్ సైడ్ అయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు!!