Begin typing your search above and press return to search.

ఉగ్రవాది బెదిరింపు... "నవంబర్ 1-19 మధ్య ఎయిరిండియాలో ప్రయాణించొద్దు"!

గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర జరిగిందన్న ఆరోపణలపై అమెరికా దర్యాప్తు జరుపుతున్న సంగతీ తెలిసిందే.

By:  Tupaki Desk   |   21 Oct 2024 5:35 AM GMT
ఉగ్రవాది బెదిరింపు... నవంబర్ 1-19 మధ్య ఎయిరిండియాలో ప్రయాణించొద్దు!
X

ఖలిస్తాన్ ఉగ్రవాది, సిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్.ఎఫ్.జే) చీఫ్ గురు పత్వంత్ సింగ్ పన్నూ కు సంబంధించిన వార్తలు గత కొన్ని రోజులుగా హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర జరిగిందన్న ఆరోపణలపై అమెరికా దర్యాప్తు జరుపుతున్న సంగతీ తెలిసిందే.

ఇందులో.. మాజీ రా అధికారి వికాస్ యాదవ్ తో పాటు అతని సహచరుడు నిఖిల్ గుప్తాపై అభియోగాలు మోపింది. ఈ నేపథ్యంలో గుప్తా యూఎస్ లో కటకటాల వెనుక ఉండగా.. వికాస్ యాదవ్ ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసినట్లు కథనాలొచ్చాయి! ఈ నేపథ్యంలో తాజాగా పన్నూ నుంచి సంచలన హెచ్చరికలు వెలువడ్డాయి!

అవును... అమెరికాలో ఉంటున్న గురు పత్వంత్ సింగ్ ఖలిస్తానీ ఏర్పాటు ఉద్యమాన్ని అక్కడ నుంచే నడుపుతున్నాడు! ఈ క్రమంలో భారతదేశానికి వ్యతిరేకంగా పలుమార్పు తీవ్ర వ్యతిరేక వ్యాఖ్యలు చేశాడు. ఇందులో భాగంగానే గతంలో ఓ సారి.. భారత పార్లమెంట్ ను కూల్చేస్తానంటూ హెచ్చరికలు జారీ చేశాడు.

ఈ నేపథ్యంలో తాజాగా అరోసారి సంచలన హెచ్చరికలు జారీ చేశాడు. ఇందులో భాగంగా... నవంబర్ 1 నుంచి 19 వరకూ ఎయిరిండియా విమానాలలో ప్రయాణించవద్దని గురు పర్వంత్ సింగ్ పన్నూ హెచ్చరించాడని తెలుస్తోంది. సిక్కు మారణహోమం జరిగి 40 ఏళ్లు కావొస్తోన్న నేపథ్యంలో ఎయిరిండియా విమానాలపై దాడి జరగొచ్చని పేర్కొన్నాడని అంటున్నారు.

ఇప్పటికే భారత విమానయాన సంస్థల విమానాలకు వరుసగా బాంబు బెదిరింపులు వస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... గత వారంలో సుమారు 70 వరకూ విమానాల్లో బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ నేపథ్యంలో గురు పత్వంత్ సింగ్ నుంచి ఇలాంటి హెచ్చరికలు రావడం హాట్ టాపిక్ గా మారింది.

కాగా... గత ఏడాదిలోనూ దాదాపు ఇదే సమయంలో ఇలాంటి హెచ్చరికలే చేశాడు గురు పత్వంత్ సింగ్. దీంతో... ఇతడిపై ఐపీసీ సెక్షన్ 120బీ, 506, 153ఏ తో పాటు చట్ట విరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (యూఎపీఏ)లోని సెక్షన్స్ 10, 13, 16, 17, 18, 18బీ కింద పన్నూపై కేసు నమోదు చేశారు.