Begin typing your search above and press return to search.

చంద్రబాబుకి అప్పుడే తలనొప్పి!

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తుతం మంచి జోష్‌ లో ఉన్నారు. ఏపీలో జనసేన, బీజేపీలతో కలిసి టీడీపీ ఎన్నికల్లో విజయ ఢంకా మోగించింది

By:  Tupaki Desk   |   1 July 2024 10:11 AM GMT
చంద్రబాబుకి అప్పుడే తలనొప్పి!
X

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తుతం మంచి జోష్‌ లో ఉన్నారు. ఏపీలో జనసేన, బీజేపీలతో కలిసి టీడీపీ ఎన్నికల్లో విజయ ఢంకా మోగించింది. వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. మరోవైపు మిత్ర పక్షాలు జనసేన, బీజేపీలతో కలిసి టీడీపీ ఏకంగా 21 ఎంపీ స్థానాలను దక్కించుకుంది. దీంతో కేంద్రంలోనూ చంద్రబాబు కింగ్‌ మేకర్‌ గా మారారు. టీడీపీ మద్దతుపైనే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మనగలుగుతోంది.

అయితే ఇంతలోనే చంద్రబాబుకు తలనొప్పి మొదలయిందని టాక్‌ నడుస్తోంది. ఎన్నికల ముందు తాము అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీ నిర్వహిస్తామని.. ఇందుకు సంబంధించిన దానిపైనే తొలి సంతకం పెడతానని చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ హామీని నిలుపుకున్నారు. 16,347 పోస్టులతో మెగా డీఎస్సీని ప్రకటించారు. ఈ ఏడాది డిసెంబర్‌ లోగా అంటే ఇప్పటి నుంచి ఆరు నెలల్లోగా టీచర్‌ నియామకాలను పూర్తి చేస్తామన్నారు. అలాగే ఏటా డీఎస్సీని ప్రకటించే యోచనలో ఉన్నామని తెలిపారు.

డీఎస్సీ రాయడానికి కావాల్సిన టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టెట్‌) నోటిఫికేషన్‌ ను కూడా తాజాగా జారీ చేశారు. ఈ క్రమంలో చంద్రబాబుకు కొత్త తలనొప్పి మొదలయ్యిందని అంటున్నారు. ప్రస్తుత డీఎస్సీ పోస్టుల్లో నుంచి 1650 పోస్టులను మినహాయించాలని గిరిజన గురుకులాల్లో ఔట్‌ సోర్సింగ్, కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్న టీచర్లు డిమాండ్‌ చేస్తున్నారు. ఇప్పటికే వీరు చంద్రబాబును, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ ను కలిసి తమకు న్యాయం చేయాలని కోరారు.

అయితే ప్రభుత్వం ఏమీ స్పందించకపోవడంతో గిరిజన గురుకులాల్లో ఔట్‌ సోర్సింగ్, కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్న టీచర్లు పెన్‌ డౌన్‌ చేపట్టారు. ప్రభుత్వం ప్రకటించిన మెగా డీఎస్సీ వల్ల తమకు అన్యాయం జరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా గిరిజన గురుకులాల్లో గత పదిహేనేళ్లు, పది ఏళ్లుగా 1650 మంది టీచర్లు ఔట్‌ సోర్సింగ్, కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం తాజాగా ప్రకటించిన మెగా డీఎస్సీలో గిరిజన ప్రాంతాల్లోని గురుకుల విద్యాలయాలకు 1143 పోస్టులను ప్రకటించింది. దీంతో ఆ పోస్టులను డీఎస్సీ ద్వారా భర్తీ చేస్తే తాము ఉపాధి కోల్పోతామని ఔట్‌ సోర్సింగ్‌ , కాంట్రాక్టు టీచర్లు వాపోతున్నారు.

ఈ టీచర్లు పెన్‌ డౌన్‌ చేపట్టడంతో ప్రభుత్వం విద్యా బోధన ఆగిపోకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. డీఎస్సీ పూర్తయి కొత్త టీచర్లు వచ్చే లోగా వివిధ శాఖలకు చెందిన ఉపాధ్యాయులను తాత్కాలికంగా డిప్యుటేషన్‌ పై గిరిజన గురుకులాల్లో నియమించాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

ఈ నేపథ్యంలో గిరిజన గురుకులాల్లో పనిచేస్తున్న 1650 మంది ఔట్‌ సోర్సింగ్, కాంట్రాక్టు టీచర్లు ఉండవల్లి చేరుకున్నారు. చంద్రబాబును కలడానికి వారు వచ్చారు. చంద్రబాబు నివాసం ఉంటున్న ప్రాంతంలో ధర్నాకు దిగారు. తమకు న్యాయం చేయాలని బైఠాయించారు.

ప్రస్తుత డీఎస్సీ నుంచి గిరిజన గురుకులాల పోస్టులను మినహాయించాలని టీచర్లు డిమాండ్‌ చేశారు. తాము 15 ఏళ్ల నుంచి పనిచేస్తున్నామని.. తమకు అన్యాయం చేస్తే తమ కుటుంబాలు రోడ్డున పడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. డీఎస్సీ రాయడానికి కూడా తమకు వయసు దాటిపోయిందన్నారు. తమ సమస్యను ముఖ్యమంత్రికి చంద్రబాబుకు వివరిస్తామని.. ఆయన తమకు న్యాయం చేయాలన్నారు. మరి చంద్రబాబు ఈ సమస్యకు ఎలాంటి పరిష్కారం చూపుతారో వేచిచూడాల్సిందే.