Begin typing your search above and press return to search.

రాజన్న జిల్లాలో రాఖీకి అధికారులు నో.. అయ్యో అనేలా చిన్నారుల అవస్థలు

రాఖీ వేళ.. తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన గురుకుల అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది

By:  Tupaki Desk   |   20 Aug 2024 4:16 AM GMT
రాజన్న జిల్లాలో రాఖీకి అధికారులు నో.. అయ్యో అనేలా చిన్నారుల అవస్థలు
X

రాఖీ వేళ.. తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన గురుకుల అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. అన్నాచెల్లెళ్ల అనురాగానికి ప్రతీకగా ఉండే ఈ పండుగ వేళ.. తోబుట్టువులకు రాఖీ కట్టేందుకు వచ్చిన వారిని అధికారులు నో చెప్పేయటం విమర్శలకు తావిచ్చింది. ఈ సందర్భంగా రాఖీ కట్టేందుకు చిన్నారులు పడిన అవస్థలు.. దానికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. అధికారుల తీరును తీవ్రంగా తప్పు పడుతూ.. ఛీ.. ఛీ.. ఇదేం బుద్ధి? ఇలా కూడా చేస్తారా? అంటూ తిట్ల దండకం అందుకుంటున్నారు. ఇంతకూ అసలేం జరిగిందంటే..

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి.. మంచిర్యాల జిల్లా రామక్రిష్ణాపూర్ పట్టణంలోని బాలిక సాంఘిక సంక్షేమ గురుకులాల్లో చదువుతున్న విద్యార్థినులతో రాఖీ కట్టించుకునేందుకు వారి అన్నదమ్ములు.. కుటుంబ సభ్యులు కలిసి గురుకులానికి వచ్చారు. అయితే.. వారిని లోపలకు వెళ్లకుండా అక్కడి సిబ్బంది అడ్డుకున్నారు. పండుగ వేళ.. రాఖీ కట్టించుకోవటానికి దూరం నుంచి వచ్చామని.. తమ పిల్లలతో కలవనివ్వాలని.. రాఖీ కట్టించుకునే అవకాశం ఇవ్వాలని కోరారు. అందుకు ససేమిరా అన్న సిబ్బంది వారిని లోపలకు అనుమతించలేదు.

దీంతో.. మరో దారి లేకపోవటంతో అక్కాచెల్లెళ్ల చేత.. కిటికీల నుంచే రాఖీలు కట్టించుకున్నారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు.. తమ భుజాల మీద పిల్లల్ని ఎక్కించుకొని.. గురుకులం గోడ వద్ద నిలబడగా.. కిటికీలో నుంచి లోపలకున్న అక్కచెల్లెళ్లు.. తమ సోదరులకు రాఖీలు కట్టేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. సోదర భావాన్ని పెంచే రాఖీ పండక్కి ఈ దరిద్రపుగొట్టు ఆంక్షలేంటి? అని తిట్టి పోస్తున్నారు.

ఈ వీడియో వైరల్ గా మారటం.. పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తటంతో అధికారులు మాట మార్చారు. రాఖీ కట్టేందుకు తల్లిదండ్రులు.. వారి పిల్లలు వచ్చారని.. అయితే.. వారి వివరాల్ని పరిశీలించి.. అనుమతులు ఇచ్చామని చెబుతున్నారు. అయితే.. అంత ఓపిక లేని వాళ్లు.. అలా గోడల వద్దకు వెళ్లి రాఖీ కట్టించుకున్నారంటూ చెప్పటం గమనార్హం. ఒకవేళ.. నిజంగానే గురుకుల ప్రిన్సిపల్స్ గంట ఆగండి.. పిల్లల చేత రాఖీ కట్టిస్తామంటే.. ఏ పేరెంట్ మాత్రం అందుకు భిన్నంగా గోడల వద్దకు వెళ్లి మరీ.. కిటికీల సందుల నుంచి రాఖీ కట్టించుకుంటారు చెప్పండి? అన్న ప్రశ్న ఎదురవుతోంది.