Begin typing your search above and press return to search.

బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. ఆ పెద్ద నాయకుడు గుడ్ బై..

లోక్ సభ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ కు ఘోర పరాజయం ఎదురైంది. దీనికి మధ్యలోనే అధినేత కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత ఢిల్లీ మద్యం కేసులో జైలుపాలయ్యారు.

By:  Tupaki Desk   |   9 Oct 2024 11:55 AM GMT
బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. ఆ పెద్ద నాయకుడు గుడ్ బై..
X

సరిగ్గా ఏడాది కిందటి వరకు తెలంగాణలో భారత రాష్ట్ర సమితి అంటే మామూలు హవా కాదు.. కానీ, కాలం ఎల్లప్పుడూ ఒకేలా ఉండదుగా...? ఎన్నికల ఫలితాలు వచ్చాయి.. బీఆర్ఎస్ ఓడింది.. పరిస్థితులు మారాయి.. నాయకులూ మారిపోతున్నారు. అసెంబ్లీ ఎన్నిక్లలో ఓటమితోనే అయిపోలేదు.. లోక్ సభ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ కు ఘోర పరాజయం ఎదురైంది. దీనికి మధ్యలోనే అధినేత కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత ఢిల్లీ మద్యం కేసులో జైలుపాలయ్యారు. 10 మంది ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లోకి వెళ్లిపోయారు. ఇక నాయకుల సంగతి చెప్పక్కర్లేదు.

ముందుగా కుమారుడు..

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో జానారెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్, ఉత్తమ్ కుమార్ రెడ్డి వంటి వారి నాయకుల కుటుంబాలు రాజకీయాల్లో ఉన్నప్పటికీ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రాధాన్యం విస్మరించలేనిది. మొదట టీడీపీ, తర్వాత కాంగ్రెస్ ఆపై బీఆర్ఎస్ లోకి వచ్చిన సుఖేందర్ రెడ్డికి కేసీఆర్ మంచి పదవులే ఇచ్చి గౌరవించారు. మంత్రి పదవి మాత్రం సాధ్యం కాలేదు. రైతు కమిటీ రాష్ట్ర అధ్యక్షుడిని చేశారు. ఎమ్మెల్సీ పదవీ ఇచ్చారు. చివరకు శాసన మండలికి అధ్యక్షుడిని కూడా చేశారు. అయితే, తెలంగాణలో గత ఏడాది ఎన్నికల అనంతరం సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ కాంగ్రెస్ లోకి వెళ్లారు.

సుదీర్ఘ అనుభవం సొంతం..

ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచి సుఖేందర్ రెడ్డికి ఎంపీగానూ పనిచేసిన అనుభవం ఉంది. ఆయనకు టీడీపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ మూడు పార్టీల్లోనూ ప్రాధాన్యం దక్కింది. ఇది కొందరికి మాత్రమే సాధ్యం. అలాంటిది సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ పార్టీ మారడం అంటే మామూలు మాటలు కాదు. కానీ, సుఖేందర్ రెడ్డి మాత్రం బీఆర్ఎస్ నే అంటిపెట్టుకుని ఉన్నారు. కానీ, ఇప్పుడు ఆయన కూడా బీఆర్ఎస్ కు గుడ్ బై కొట్టడం ఖాయం అని అంటున్నారు.

బీఆర్ఎస్ ‘చైర్మన్’ను కాను..

తాను ఇప్పుడు బీఆర్ఎస్ కు చెందిన శాసన మండలి చైర్మన్ ను కానని సుఖేందర్ రెడ్డి అన్నారు. శాసనమండలిలో కాంగ్రెస్ చీఫ్ విప్ గా పట్నం మహేందర్ రెడ్డి బాధ్యతల స్వీకార కార్యక్రమంలో సుఖేందర్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. గత ప్రభుత్వంలో ఉద్యోగాల భర్తీ జరగలేదని విమర్శించారు. ఇప్పుడు ఉద్యోగాల మీద మాట్లాడుతున్న బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసిందని నిలదీశారు. అంతేకాదు.. ఎమ్మెల్యేల ఫిరాయింపుల విషయంలో గత ప్రభుత్వం ఏం చేసిందో గుర్తు చేసుకుంటే మంచిదని హితవు పలికారు.

జంపింగ్ ఖాయం..

బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పటి విధానాలను విమర్శించారంటే ఆ పార్టీకి గుత్తా సుఖేందర్ రెడ్డి గుడ్ బై చెప్పడం ఖాయం అని తెలిసిపోతోంది. కారు పార్టీలోనే కొనసాగే ఉద్దేశం ఉండి ఉంటే ఇలా మాట్టాడి ఉండరు. పైగా సుఖేందర్ రెడ్డి కుమారుడు ఇప్పటికే కాంగ్రెస్ లో చేరిపోయారు. కుమారుడి భవిష్యత్ రీత్యా చూసినా సుఖేందర్ రెడ్డి జంపింగ్ ఖాయం. అందుకే.. తానిప్పుడు బీఆర్ఎస్ చైర్మన్ ను కాదు అని వ్యాఖ్యానించారు.