Begin typing your search above and press return to search.

నాకంతా తెలుసు.. జీవి రెడ్డికి అర్థంకాని చంద్రబాబు అంతరంగం!

By:  Tupaki Desk   |   23 Feb 2025 4:41 AM GMT
నాకంతా తెలుసు.. జీవి రెడ్డికి అర్థంకాని చంద్రబాబు అంతరంగం!
X

నాకంతా తెలుసు.. మీ పని మీరు చేసుకోండి. మీరు తెలివైన వారు.. మీ తెలివితేటలను చూసే ఏపీ ఫైబర్ నెట్ బాధ్యతలను మీకు అప్పగించాను. సంస్థ అభివృద్ధికి పనిచేయండి అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డికి సూచించారు. ఇటీవల ఏపీ ఫైబర్ నెట్ ఎండీ దినేష్ కుమార్ పై తీవ్ర ఆరోపణలు చేసిన జీవీ రెడ్డి పెద్ద దుమారమే తెరలేపారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ప్రభుత్వాధికారులపై విమర్శలకు దిగడం.. మీడియా ముందు తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో జీవీ రెడ్డి తీరుపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

ఫైబర్ నెట్ లో అధికారుల నుంచి సమస్యలు ఉన్నా, బహిరంగంగా మాట్లాడకూడదు కదా? అంటూ సీనియర్లు సైతం జీవి రెడ్డికి చెప్పినట్లు పార్టీలో జరుగుతోంది. దీంతో తన వ్యాఖ్యలు ప్రభుత్వానికి నష్టం చేశాయన్న అంచనాకు వచ్చిన ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి తన వివరణ ఇచ్చినట్లు చెబుతున్నారు.

అయితే జీవీ రెడ్డితో ప్రశంసపూర్వకంగా మాట్లాడిన ముఖ్యమంత్రి , ఆయన చేసిన ఆరోపణలపై కనీసం సమాచారం తెలుసుకోకపోవడం చర్చకు తావిస్తోంది. ఫైబర్ నెట్ లో ఏం జరుగుతుందో తనకు అంతా తెలుసునని, ఇంటెలిజెన్స్ సమాచారం తన వద్ద ఉందని చెప్పిన చంద్రబాబు.. జీవీ రెడ్డిని డైలమాలో పడేశారంటున్నారు. అధినేత అంతరంగం ఏంటో అర్థం చేసుకోలేక చైర్మన్ జీవీ రెడ్డి అయోమయాన్ని ఎదుర్కొంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. జీవీ రెడ్డి సామర్థ్యంపై పూర్తి నమ్మకంతో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఫైబర్ నెట్ ఎండీ దినేశ్ కుమార్ పై ఆయన ఫిర్యాదులను స్వీకరించకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోలేకపోతున్నారని అంటున్నారు.

కలిసి పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనతో ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి స్పీడుకు బ్రేకులు వేసినట్లేననే టాక్ వినిపిస్తోంది. చంద్రబాబు మానస పుత్రిక అయిన ఫైబర్ నెట్ లో జరిగిన తప్పిదాలపై ముఖ్యమంత్రికి పూర్తి అవగాహన ఉందని, ఆ విషయం జీవీ రెడ్డి తెలిసుకోలేక ఎండీ దినేశ్ కుమార్ పై ఆరోపణలు చేయడం మిస్ ఫైర్ అయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జీవీరెడ్డి సమర్థతపై ఎంత నమ్మకం ఉందో ఎండీ దినేశ్ కుమార్ పనితీరుపైనా సీఎం చంద్రబాబుకు అంతే భరోసా ఉందని అంటున్నారు. ఈ ఇద్దరు కలిసి పనిచేసి ఫైబర్ నెట్ ను గాడిలో పెడతారనే భావన ముఖ్యమంత్రికి ఉండేదని అంటున్నారు. అయితే ఇద్దరి మధ్య అనూహ్యమైన గ్యాప్ రావడంతో ముఖ్యమంత్రి ఆలోచనలో పడ్డారని అంటున్నారు.

పార్టీ ప్రతిపక్షంలో ఉండగా జీవీ రెడ్డి చాలా కష్టపడ్డారని ఆయనపై ముఖ్యమంత్రికి సదాభిప్రాయం ఉందని చెబుతున్నారు. అయితే పరిపాలన పరమైన అనుభవం ఆయన పెంచుకోవాలని సీఎం అభిప్రాయపడుతున్నట్లు చెబుతున్నారు. ప్రతిపక్షంలో ఫైటరుగా రాణించిన జీవీ రెడ్డి అధికారంలోకి వచ్చాక కూడా అదే పంథా అనుసరించడం వల్ల ఇలాంటి వివాదాలు వస్తాయని, అధికారులతో సమన్వయం చేసుకుని పని చేయించుకోవాల్సిన బాధ్యత నేతలపై ఉంటుందని పార్టీ నేతల ద్వారా జీవీ రెడ్డికి అవగాహన కల్పిస్తున్నట్లు చెబుతున్నారు. అధికారులపై అభ్యంతరాలు ఉంటే తనకో, మంత్రి లోకేశుకో చెప్పాల్సివుండగా, ఇలా మీడియాకు ఎక్కడం వల్ల ఉపయోగమేంటని జీవీ రెడ్డికి పార్టీ సీనియర్ల నుంచి ప్రశ్నలు ఎదురైనట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి జీవీ రెడ్డి విషయంలో చంద్రబాబు పూర్తి క్లారిటీతో ఉన్నారని, ఫైబర్ నెట్ అంశాన్ని తనకు వదిలేసి పదవిని ఎంజాయ్ చేయాలని సీఎం నుంచి సంకేతాలు అందినట్లేనని పరిశీలకులు చెబుతున్నారు.