Begin typing your search above and press return to search.

ఫైబర్ నెట్ లో ముగ్గురు అధికారులపై వేటు.. జీవీ రెడ్డి సంచలన నిర్ణయం

ఏపీ ఫైబర్ నెట్ పనితీరుపై చైర్మన్ జీవీ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను చైర్మన్ గా బాధ్యతలు చేపట్టి సంస్థ అభివృద్ధికి కృషి చేస్తున్నా, అధికారులు సహకరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

By:  Tupaki Desk   |   20 Feb 2025 9:15 AM GMT
ఫైబర్ నెట్ లో ముగ్గురు అధికారులపై వేటు.. జీవీ రెడ్డి సంచలన నిర్ణయం
X

ఏపీ ఫైబర్ నెట్ పనితీరుపై చైర్మన్ జీవీ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను చైర్మన్ గా బాధ్యతలు చేపట్టి సంస్థ అభివృద్ధికి కృషి చేస్తున్నా, అధికారులు సహకరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఫైబర్ నెట్ లో సంస్కరణలు అమలుచేస్తున్నామని, ఈ విషయంలో అడ్డుగా నిలుస్తున్న ముగ్గురు ఉన్నతాధికారులను సంస్థ నుంచి తొలగిస్తున్నట్లు సంచలన నిర్ణయం వెలువరించారు. జీవీ రెడ్డి చైర్మన్ అయ్యాక ఏపీ ఫైబర్ నెట్ కార్యకలాపాలపై ప్రత్యేక దర్యాప్తు జరుగుతోంది. అవసరం లేకుండా వేల సంఖ్యలో ఉద్యోగులను నియమించడంతోపాటు కార్యాలయాలకు రాకుండానే జీతాలు చెల్లిస్తున్నట్లు గుర్తించారు. దీంతో కొద్ది నెలల క్రితం ఒకేసారి 400 మంది ఉద్యోగులపై వేటు వేశారు.

అయితే తాను ఉద్యోగులను తొలగించాలని ఆదేశించినా ఎండీ దినేశ్ కుమార్ సంతకం చేయడం లేదని, ఉద్యోగులకు అక్రమంగా మూడు నెలలు జీతాలు చెల్లించారని జీవీ రెడ్డి ఆరోపించారు. ఉద్యోగులకు చెల్లించిన జీతాలను ఎండీ నుంచి రికవరీ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు చెప్పారు. ఆగస్టులో దినేశ్ కుమార్ ఎండీగా బాధ్యతలు తీసుకున్నా, ఇంతవరకు ఒక్క సమావేశం నిర్వహించలేదని, సంస్థ శ్రేయస్సు కోసం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మండిపడ్డారు.

ఇక సంస్థకు గుదిబండగా మారిన ఫైబర్ నెట్‌ చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ పప్పూ భరద్వాజ, బిజినెస్ అండ్‌ ఆపరేషన్స్‌ హెడ్‌ గంధంశెట్టి సురేశ్‌, ప్రొక్యూర్‌మెంట్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ శశాంక్‌ హైదర్‌ ఖాన్‌లను తొలగిస్తున్నట్టు వెల్లడించారు. 400 మంది ఉద్యోగులను తొలగించాలని ఆదేశించినా, ఎండీ, ఈడీ చర్యలు తీసుకోలేదని జీవీ రెడ్డి తెలిపారు. మరోవైపు జీఎస్టీ అధికారులు సంస్థపై రూ. 377 కోట్ల జరిమానా విధించారని, ఈ విషయాన్ని అధికారులు ఎవరూ తన దృష్టికి తీసుకురాలేదని చైర్మన్ జీవీ రెడ్డి ఆరోపించారు. 8 నెలలుగా సంస్థలో పురోగతి కనిపించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. రూపాయి కూడా ఆదాయం తీసుకురాలేక పోయామని నిస్సహాయత వ్యక్తం చేశారు. కొత్త కనెక్షన్లు ఏవీ ఇవ్వలేకపోయామని తెలిపారు. తమ నిర్ణయాలకు అనుమతులు ఆలస్యమవుతున్నాయని అధికారులు సహకరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎండీ దినేశ్ కుమార్ గత ప్రభుత్వంలో ఉన్నట్లే పని చేస్తున్నారని, ఆదాయం పెంచే చర్యలు తీసుకోవడం లేదని జీవీ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.