Begin typing your search above and press return to search.

విశాఖలో జీవీఎల్ హడావుడి.. 2029 కోసం లాంగ్ టర్మ్ ప్లాన్?

బీజేపీ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు జీవీఎల్ నరసింహరావు విశాఖలో మళ్లీ హడావుడి చేస్తున్నారు. ఇటీవల నగరంలో సంక్రాంతి సంబంరాలను ఘనంగా నిర్వహించిన జీవీఎల్ తాను విశాఖను వదలననే సంకేతాలిచ్చారు.

By:  Tupaki Desk   |   22 Jan 2025 5:00 PM IST
విశాఖలో జీవీఎల్ హడావుడి.. 2029 కోసం లాంగ్ టర్మ్ ప్లాన్?
X

బీజేపీ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు జీవీఎల్ నరసింహరావు విశాఖలో మళ్లీ హడావుడి చేస్తున్నారు. ఇటీవల నగరంలో సంక్రాంతి సంబంరాలను ఘనంగా నిర్వహించిన జీవీఎల్ తాను విశాఖను వదలననే సంకేతాలిచ్చారు. 2024 ఎన్నికల్లో విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేయాలని జీవీఎల్ ప్లన్ చేశారు. అయితే పొత్తుల వల్ల ఆయనకు అవకాశం దక్కలేదు. ఇక టికెట్ దక్కకపోవడంతో విశాఖ రాజకీయాల నుంచి దూరంగా జరిగిపోయిన జీవీఎల్ మళ్లీ సడన్ ఎంట్రీ ఇచ్చారు. ఏటా నిర్వహించినట్లే ఈ సారి కూడా సంక్రాంతి సంబరాలు చేసినా, ఈ ఏడాది సంబరాలకు సమ్ థింగ్ స్పెషల్ అంటున్నారు ఆయన సన్నిహితులు.

జీవీఎల్ నరసింహారావు బీజేపీ పెద్దలకు బాగా దగ్గరగా ఉండే నేత. సెఫాలజిస్టుగా ఉంటూ రాజకీయాల్లోకి వచ్చారు. తెలుగు వాడైన ఈ బీజేపీ నేత ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు నామినేట్‌ అయినంత వరకు రాష్ట్రంలో పెద్దగా ఎవరికీ తెలియదు. తనకున్న పరిచయాలతో బీజేపీ రాజ్యసభ సభ్యత్వం దక్కించుకున్న జీవీఎల్.. ఆ తర్వాత తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ముఖ్యంగా ఏపీ బీజేపీ బాధ్యతలన్నీ తనవే అన్నట్లు గత ఐదేళ్లు పెద్దరికం వహించారు. ఇక విశాఖను కేంద్రంగా చేసుకుని ప్రత్యక్ష రాజకీయాలు చేయాలని భావించిన జీవీఎల్.. విశాఖ నగరంలో ప్రత్యేక కార్యాలయం ప్రారంభించి రాజకీయ కార్యకలాపాలను నిర్వహించారు.

2024 ఎన్నికల్లో విశాఖ ఎంపీ అభ్యర్థిని తానేనంటూ ప్రకటించుకున్నారు. పొత్తులు ఉన్నా, లేకున్నా తానే అభ్యర్థినంటూ హడావుడి చేసిన జీవీఎల్ ఆశలను కూటమి విచ్చిన్నం చేసింది. టికెట్ దక్కకపోవడంతో తీవ్ర నిరాశ ఎదుర్కొన్న జీవీఎల్ లోక్ సభ ఎన్నికల్లో పార్టీ పనులకే పరిమితమయ్యారు. ఇతర రాష్ట్రాల్లో పార్టీ అప్పగించిన పనులు అంటూ విశాఖకు దూరమయ్యారు. ఈ పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జీవీఎల్ కు పెద్దగా ప్రాధాన్యం దక్కలేదు. దీంతో పార్టీ వేదికలపైనా ఆయన కనిపించడం లేదు. గత ఏడు నెలలుగా రాష్ట్రంలో ఆయన కార్యకలాపాలు పెద్దగా లేవనే చెప్పాలి. గతంలో బీజేపీ పెద్దలు ఎవరు రాష్ట్రానికి వచ్చినా జీవీఎల్ మాత్రమే వారి ప్రసంగాలను అనువదించేవారు. ఎన్నికల ముందు ప్రధాని విశాఖ పర్యటనకు వస్తే జీవీఎల్ అనువాదకుడిగా వ్యవహరించారు. అయితే ఇప్పుడు ఆయన బదులుగా ప్రధాని ప్రసంగాన్ని రాష్ట్రంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అనువదిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో జీవీఎల్ ప్రాధాన్యం తగ్గిపోయిందా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.

ఈ పరిస్థితుల్లో జీవీఎల్ మళ్లీ విశాఖలో అడుగుపెట్టడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. రాజ్యసభ సభ్యత్వం ముగియడం, మళ్లీ ఆయనను నామినేట్ చేసే అవకాశాలు దగ్గరలో లేకపోవడంతో ప్రజాక్షేత్రంలోనే తన రాజకీయ జీవితానికి మెరుగైన బాటలు వేసుకోవాలని జీవీఎల్ ఆలోచిస్తున్నారట. టికెట్ దక్కలేదని దూరంగా ఉండిపోతే వచ్చే ఎన్నికల నాటికి కూడా తన తలరాత మారదనే ఆలోచనతో గతం గత: అంటూ కొత్తగా మళ్లీ మొదలుపెట్టాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. 2029లో విశాఖ నుంచి పార్లమెంటుకు పోటీ చేయాలనే ఆలోచనతోనే స్థానికంగా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.