జీవీఎల్ కి చెక్...పట్టుబట్టి సీటు సాధించిన బాబు...!
విశాఖ ఎంపీగా పోటీ చేయాలని సర్వ శక్తులూ సమకూర్చుకున్న రాజ్యసభ సభ్యుడు బీజేపీ సీనియర్ నేత అయిన జీవీఎల్ నరసింహారావు ని చివరికి దెబ్బ కొట్టారు
By: Tupaki Desk | 22 March 2024 9:32 AM GMTవిశాఖ ఎంపీగా పోటీ చేయాలని సర్వ శక్తులూ సమకూర్చుకున్న రాజ్యసభ సభ్యుడు బీజేపీ సీనియర్ నేత అయిన జీవీఎల్ నరసింహారావు ని చివరికి దెబ్బ కొట్టారు. ఆయనకు సీటు దక్కకుండా చేయడంలో అటూ ఇటూ కూడా రెండు వైపులా ప్రయత్నాలు జరిగాయని అంటున్నారు. చివరికి సక్సెస్ అయ్యారని అంటున్నారు.
తెలుగుదేశం పార్టీ తాజాగా ప్రకటించిన మూడవ జాబితాలో పదకొండు అసెంబ్లీ, పదమూడు పార్లమెంట్ నియోజకవర్గాల అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. ఇక మరో అయిదు అసెంబ్లీ సెగ్మెంట్లు, నాలుగు ఎంపీ సెగ్మెంట్లకు మాత్రమే అభ్యర్ధులను ప్రకటించాల్సి ఉంది. టీడీపీ ప్రకటించిన పదకొండవ జాబితా చూస్తే విశాఖ సీటు విషయంలో ఆ పార్టీ తన పంతం నెరవేర్చుకుందని అంటున్నారు.
బీజేపీతో టీడీపీ పొత్తు కుదిరిన దగ్గర నుంచి విశాఖ ఎంపీ సీటు విషయంలోనే పెద్ద ఎత్తున చర్చ సాగింది. బీజేపీ సీనియర్ నేత జీవీఎల్ నరసింహారావు గత రెండేళ్లుగా విశాఖలో మకాం వేసి ప్రచారం చేసుకుంటున్నారు. తనకే విశాఖ సీటు అని ఆయన నిబ్బరంగా ఉన్నారు. అయితే ఈ సీటుని బాలయ్య చిన్నల్లుడు లోకేష్ తోడల్లుడు అయిన శ్రీభరత్ ఆశిస్తున్నారు.
ఆయన 2019 ఎన్నికలలో ఇక్కడ పోటీ చేసి, జనసేన నుండి పోటీ పడిన జేడీ లక్ష్మీనారాయణ పెద్ద ఎత్తున ఓట్లు చీల్చడం వల్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు. దాంతో ఈసారి కనుక భరత్ పోటీ చేస్తే గెలుస్తారు అన్న అంచనాలు ఉన్నాయి. అదే సమయంలో జీవీఎల్ దూకుడు టీడీపీ వర్గాలను కొంత ఆందోళనకు గురి చేసింది.
విశాఖ ఎంపీ సీటు మీద బీజేపీ కూడా పట్టుబట్టింది. దానికి కారణం ఆ సీటుని జీవీఎల్‌కి ఇవ్వడంతో పాటు ఇదే సెగ్మెంట్‌లో ఒడిశా ఉత్తర భారతదేశానికి చెందిన రెండు లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వీరంతా బిజెపికి ఓటు వేసే అవకాశం ఉందన్న లెక్కలు ఉన్నాయి.
ఇక బీజేపీ ట్రాక్ రికార్డు చూస్తే 2014లో ఆ పార్టీ నాయకుడు హరిబాబు టిడిపి-బిజెపి కూటమి తరఫున పోటీ చేసి వైఎస్ జగన్ తల్లి విజయమ్మను ఓడించి జైంట్ కిల్లర్‌గా నిలిచారు. దాంతో విశాఖ పార్లమెంటుపై బీజేపీ హైకమాండ్ పట్టుబట్టింది. అయితే బీజేపీ ఎంత డిమాండ్ చేసినా టీడీపీ అధినేత్ చంద్రబాబు మొండిగా ఉన్నారని అంటున్నారు.
దానికి కారణం బీజేపీ నుంచి పోటీ చేసే జీవీఎల్ నరసింహారావు వైసీపీ అనుకూలుడు అన్న అనుమానాలు టీడీపీలో ఉన్నాయట. అంతే కాదు 2014లో టీడీపీ బీజేపీ కూటమి విచ్ఛిన్నానికి ఆయన కీలక పాత్ర పోషించారని కూడా డౌట్లు ఉన్నాయట.
మరో వైపు చూస్తే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేత విశాఖపట్నంను కార్యనిర్వాహక రాజధానిగా ప్రతిపాదించడంతో జీవీఎల్ పాత్ర ఉందని టీడీపీ అనుమానిస్తోందిట. దాంతో ఈ సీటులో ఆయనను పోటీ చేయనీయకూడదు అని మొదటి నుంచి పట్టుదలగానే ఉంది అని అంటున్నారు.
అంతే కాదు విశాఖ ఎంపీ సీటు టీడీపీకి సీటు దక్కడమే ముఖ్యమని భావించింది అని అంటున్నారు. ఇక జీవీఎల్ కి విశాఖ ఎంపీ సీటు ఇస్తే ఆయన ఓడిపోతారని ఆయనకు టీడీపీ ఓటర్లు ఆయనకు ఓటు వేయరు అన్న లెక్కలేవో ఉన్నాయని అందుకే ఆయనను తప్పించేశారు అని అంటున్నారు. మొత్తానికి విశాఖ ఎంపీ సీటు మీద టీడీపీ పట్టు సాధించడం వెనక చంద్రబాబు రాజకీయ వ్యూహాలు అనేకం ఉన్నాయని అంటున్నారు.